నీ ఉత్తరం అందింది

woman is reunited with daughter she gave up for adoption 50 Years Ago - Sakshi

ఈజ్‌ దిస్‌ విక్టోరియా?! ఇటీజ్‌ మేరీ బెత్‌..

కథలైతే ఎక్కడో ఒక చోట మొదలు పెట్టొచ్చు. జీవితం అలాక్కాదు. ఎప్పుడూ ఒక ముగింపు దగ్గరే మొదలౌతుంది. 68 ఏళ్ల మేరీ బెత్‌ డిశాంటో జీవితం కూడా  ఈ ఏడాది ఆగస్టులో ఓరోజు పెన్సిల్వేనియా మిల్‌క్రీక్‌ టౌన్‌షిప్‌లోని ఆమె ఇంటి డోర్‌ బెల్‌ మోగడంతో మొదలైంది! తలుపులు తెరిచారు మేరీ బెత్‌. ఎదురుగా విక్టోరియా రిచ్‌.
‘మామ్‌.. నేను విక్టోరియా రిచ్‌!’
యాభై ఏళ్ల వయసున్న మహిళ తనని మామ్‌ అంటోంది! తన పేరు విక్టోరియా రిచ్‌ అంటోంది. పేరైనా పెట్టకుండా యాభై ఏళ్ల క్రితం తను ఎవరికో ఇచ్చేసిన నెలల బిడ్డేనా విక్టోరియా! మేరీ బెత్‌ డిశాంటోకు యాభై ఏళ్ల క్రితం కడుపులోని బిడ్డ కాలితో తన్నినట్లనిపించింది.  

∙∙
ఈ ప్రారంభానికి ముగింపు రోజు 1970 ఆగస్టు 20. న్యూయార్క్‌లోని విక్టోరియా ఇన్‌ఫాంట్‌ హోమ్‌. మేరీ బెత్‌ పక్కలో అప్పుడే పేగు తెగిన బిడ్డ! నవమాసాల బరువు దించిన బిడ్డ. గ్రాడ్యుయేషన్‌ అయిపోగానే.. బెత్‌కి పద్దెనిమిదేళ్లకే పుట్టిన బిడ్డ. పెళ్లి కాకుండా పుట్టిన బిడ్డ. ‘బిడ్డను ఎవరికైనా ఇచ్చేద్దాం’ అని ఆసుపత్రిలోనే అనేశారు బెత్‌ అమ్మానాన్న. బెత్‌ మాట్లాడలేదు. బిడ్డను ఇచ్చేసి తర్వాతి జీవితాన్ని గడిపేయడమా? బిడ్డతోనే జీవితం అనుకోవడమా? ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు. తల్లీబిడ్డ కొన్నాళ్లు ఆసుపత్రిలోనే ఉండవలసి వచ్చింది.

ఇంకా మాటలే రాని ఆ బిడ్డతో బెత్‌ సంభాషణ మొదలు పెట్టింది. బిడ్డకు ఉత్తరాలు రాస్తోంది. బిడ్డపై మురిపెంగా కవిత్వం అల్లుతోంది. ఉండుండి అకస్మాత్తుగా ‘ఇచ్చేద్దాం’ అని అమ్మానాన్న అన్న మాట గుర్తొచ్చేది. అప్పుడు ఆమెకు కొన్ని ఆలోచనలు వచ్చేవి. బిడ్డను తను దత్తత ఇచ్చేస్తుంది. వాళ్లు తన బిడ్డను అదృష్టంలా, వరంలా చూసుకుంటుంటారు. ఇదొక ఆలోచన.  తను దత్తత ఇవ్వనే ఇవ్వదు. ఇంటికి తీసుకెళుతుంది. బిడ్డను గుండెలకు ఆన్చుకుని, ఆ పసికందును ప్రపంచంలోకి ఎలా నడిపించాలో తెలియక ఒక చీకటి గదిలో ఏడుస్తూ కూర్చుంటుంది. ఇది ఇంకొక ఆలోచన.

తన జీవితాన్నెలాగూ నాశనం చేసుకుంది. తన కూతురు జీవితాన్ని కూడా నాశనం చేయకూడదు. ఇది చివరి ఆలోచన. గుండె దిటవు చేసుకుని బిడ్డను దత్తతకు ఆసుపత్రిలోనే ఉంచి ఇంటికి వచ్చేసింది. రోజుల పాటు బిడ్డ కోసం ఏడ్చింది. చివరికి ధ్యాస మళ్లడానికి ఓ ఉద్యోగం వెతుక్కుంది. అక్కడ పరిచయమైన ర్యాండీ డిశాంటోని పెళ్లి చేసుకుంది. నలభై ఎనిమిదేళ్లు గడిచాయి. ఇద్దరు మగపిల్లలు. ప్రతి ఆగస్టు 20న వాళ్లు ముగ్గురు పిల్లలవుతారు. దగ్గర లేని కూతురును మిగతా రోజుల కన్నా ఎక్కువగా ఆ రోజు పదే పదే తలచుకుంటుంది బెత్‌. భర్తకు ఆ సంగతి తెలుసు. భార్యను దగ్గరకు తీసుకుంటాడు.   
∙∙
యు.ఎస్‌.లోనే మరోచోట పెరుగుతున్న విక్టోరియా రిచ్‌కి కూడా తల్లిదండ్రులకు తను సొంత బిడ్డను కాదన్న సంగతి తెలుసు. సొంత తల్లిని కలుసుకోవాలని అనిపించనంత ప్రేమతో ఆమె పెరిగింది. ఫైన్‌ ఆర్ట్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసింది. ఫొటోగ్రఫీ ఎడిటర్, వీడియో ప్రొడ్యూజర్‌ అయింది. ఎప్పుడైనా తల్లిని కలుసుకోవాలని అనిపించేది కానీ, ఒక అన్వేషణే ప్రారంభించేంతగా కాదు. 2006లో యాన్‌ ఫెస్లర్‌ రాసిన ‘పిల్లల్ని దత్తత ఇచ్చిన తల్లుల దాపరికాలు’ అనే పుస్తకం చదివాక తొలిసారి తల్లిని చూడాలని రిచ్‌కి అనిపించింది.

పుస్తకం కోసం ఫెస్లర్‌ ఇంటర్వ్యూ చేసిన తల్లులందరూ.. ‘తమ బిడ్డ ఎలా ఉందో’ అని దుఃఖపడినవారే. తన తల్లీ దుఃఖపడుతూ ఉంటుంది. ఆమె దుఃఖాన్ని పోగొట్టడం కూతురుగా తన బాధ్యత అనుకుంది. ఆమె అదృష్టం! దత్తతు వెళ్లిన వాళ్లు కోరితే జనన ధృవీకరణ పత్రం మంజూరు చేయాలన్న చట్టం న్యూయార్క్‌లో వచ్చింది. గత ఏడాది జనవరి 15న ఆ చట్టం అమల్లోకి రాగానే బర్త్‌ సర్టిఫికెట్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న కొన్ని వేల మందిలో విక్టోరియా రిచ్‌ కూడా ఒకరు. పత్రం చేతికొచ్చింది. తల్లి పేరు చూసుకుంది. మేరీ బెర్త్‌ ఊల్ఫ్‌! ఆ అక్షరాలను కళ్లతో, వేళ్లతో, మనసుతో స్పృశించింది.

‘మామ్‌’అనే మాట అప్రయత్నంగా ఆమె నోటి వెంట వచ్చింది. రిచ్‌ స్నేహితులు ఇంటర్నెట్‌లో మేరీ బెర్త్‌ను వెదకడంలో సహాయపడ్డారు. తేలికైన విషయమా? తప్పిపోయిన బిడ్డలా, తప్పిపోయిన తల్లి.. బెర్త్‌! చివరికి చిరునామా దొరికింది! తన ఫొటోలు జతచేసి, తల్లికి మాత్రమే అర్థమయ్యేలా జాగ్రత్తగా ఒక ఉత్తరం రాసింది రిచ్‌. వేరే ఎవరి చేతిలో పడినా సమస్యలేదు. మామూలు ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ ఉత్తరంలానే అనిపిస్తుంది.  తన వివరాలు కూడా పెద్దగా ఇవ్వలేదు. కూతుర్ని కలుసుకోవాలన్న ఆశ ఆ తల్లికి నిజంగా ఉంటే కనుక అందుకు ఉపయోగపడేలా అవసరమైన వివరాల వరకే ఉన్నాయి. ఆ ఉత్తరాన్ని ఈ ఏడాది మార్చి 3 న పోస్ట్‌ చేసింది. చేశాక ఆందోళన పడింది.
∙∙
దత్తత ఇచ్చేసిన పిల్లల్ని మళ్లీ కలుసుకోవాలని తల్లులకు ఉండదని ఫేస్‌బుక్‌లోని ‘అడాప్షన్‌ గ్రూప్‌’ అనుభవాలలో చదివి ఉంది రిచ్‌. అది జ్ఞాపకం వచ్చింది. ఉత్తరం రాసి తన తల్లినేమైనా ఇబ్బంది పెట్టానా అనుకుంది. రెండు రోజులు గడిచాయి. ఆఫీస్‌లో ఉండగా  మార్చి 5న ఆమెకో కాల్‌ వచ్చింది. కాలర్‌ ఐడీలో ఈరి, పి.ఎ. అని ఉంది. పెన్సిల్వేనియాలోని ఈరి ప్రాంతం. అది తన తల్లి ఉండే ప్రదేశమే! రిచ్‌ ఒక్కసారిగా లేచి, ఉద్వేగాన్ని అణచుకుంటూ కాల్‌ లిఫ్ట్‌ చేసింది. ‘‘ఈజ్‌ దిస్‌ విక్టోరియా? ఇటీజ్‌ మేరీ బెత్‌. నేను నీ ఉత్తరం అందుకున్నాను’’ అని అక్కడితో మాట ఆగిపోయింది.

ఫోన్‌ కట్‌ అవడం కాదు. మాట కట్‌ అయింది. ఆ తర్వాత తల్లి ఏం చెప్పబోతుందో రిచ్‌ ఊహించింది. ‘దయచేసి నన్నెప్పుడూ కలుసుకునే ప్రయత్నం చేయకు’ అనే మాటకు సిద్ధపడటం కోసం ధైర్యాన్ని కూడగట్టుకుంటోంది. అయితే ఆమె విన్న మాట వేరు. ‘‘మనం కలుసుకుందాం’’ అంది బెత్‌. రిచ్‌ ఆనందానికి అవధుల్లేవు. మాట్లాడుకోవడం, మెజేస్‌లు ఇచ్చుకోవడం మొదలైంది. కలుసుకునే రోజు కూడా ఫిక్స్‌ అయింది. తల్లి ఉండే ఈరి ప్రాంతానికి వెస్ట్రన్‌ న్యూయార్క్‌ దూరమేమీ కాదు. రిచ్‌ ఉండేది క్వీన్స్‌లో. కానీ మే నెలలో కాలేజ్‌ గ్రాడ్యుయేషన్‌కి, జూన్‌లో ఒక పెళ్లికి ఆమె వెస్ట్రన్‌ న్యూయార్క్‌ వెళ్లవలసి  ఉంది. అప్పుడు అట్నుంచటు తల్లి దగ్గరకు వెళ్లొచ్చని ప్లాన్‌ చేసుకుంది. అయితే కరోనా వల్ల వెళ్లడం కుదర్లేదు. మళ్లీ కాల్స్, మెసేజ్‌లు.. అంతవరకే.  
∙∙
విక్టోరియా రిచ్‌ పెరిగింది ఇటాలియన్‌ల ఇంట్లో. బెత్‌ కుటుంబంలో ఐరిష్, జర్మన్‌ సంస్కృతులు ఉన్నాయి. రెండు కుటుంబాలవీ క్యాథలిక్‌ విశ్వాసాలు. అవి కూడా తల్లీకూతుళ్లను దగ్గర చేశాయి. విక్టోరియా రిచ్‌ తన 50 వ పుట్టిన రోజుకు ముందు తల్లిని కలుసుకోవడం మాత్రం కాలం కుదిర్చిన ఏర్పాటు అనుకోవాలి. ‘సినిమాలో కనుక తల్లీకూతుళ్లు ఇలా కలుసుకున్నట్లయితే నాకేమీ అనిపించేది కాదు. మామూలు కథలా ఉండేది. నాకు జరిగింది కాబట్టేమో జీవితంలా అనిపిస్తోంది’ అంటున్నారు విక్టోరియా రిచ్‌.

మార్చి 5న కూతురు రాసిన ఉత్తరం అందే సమయానికి మేరీ బెత్‌ కిచెన్‌లో గిన్నెలు కడుగుతూ, టీవీలో ‘లాంగ్‌ లాస్ట్‌ ఫ్యామిలీ’ ప్రోగ్రామ్‌ చూస్తూ ఉన్నారు. కలుసుకున్న కుటుంబ సభ్యుల నిజ జీవిత కథలు అవి. సుఖాంతం అవుతాయి కనుక ఆమె ఆ ప్రోగ్రామ్‌ను ఇష్టంగా చూస్తుంటారు. ఆ రోజు మాత్రం చివరి వరకు చూడకుండానే టీవీని ముందే కట్టేశారు. ఆమె కథమాత్రం ‘పోస్ట్‌’అనే మాటతో మార్చిలో ఒకసారి, కాలింగ్‌ బెల్‌తో ఆగస్టులో ఒకసారి కొత్తగా ప్రారంభం అయింది. ఈ కథను ‘ది కాలర్‌ ఐడి సెడ్‌ ఈరీ, పి.ఎ.’ అనే పేరుతో ‘అమెరికన్‌ పబ్లిక్‌ బ్రాడ్‌క్యాస్టింగ్‌’ తన నెట్‌వర్క్‌లోని యూట్యూబ్‌లో, వాయిసెస్‌లో, ఫేస్‌బుక్‌లో  పెట్టింది.


తల్లిని చేరిన బిడ్డ
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top