రావణ వధానంతరం పుష్పక విమానంలో సపరివారంగా బయలుదేరిన రాముడు మార్గమధ్యంలో సముద్ర తీరాన మజిలీ చేశాడు. రాముడి రాకను తెలుసుకున్న మునులందరూ ఆయన దర్శనం కోసం వచ్చారు. రాముడిని మునులందరూ వేనోళ్ల స్తుతించారు. రాముడు వారికి నమస్కరించి, ‘మునులారా! పులస్త్యబ్రహ్మ కుమారుడైన రావణుడు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఎప్పటికీ బ్రాహ్మణుడే! యుద్ధంలో నేను రావణుడిని చంపవలసి వచ్చింది. బ్రహ్మహత్య మహాపాతకమని శాస్త్రాలు చెబుతున్నాయి. నేను ఆ మహాపాతకాన్ని తొలగించుకోవాలంటే, ఏం చేయాలో తగిన ఉపాయం మీరే సెలవీయండి’ అని అడిగాడు.
‘పరమాత్మా! నీకు దోషం అంటుతుందా? లోకాన్ని అనుగ్రహించటానికి అడిగావు. అయినా, పరిహారం చెబుతున్నాం విను! ఈ సాగర తీరంలో శంభు ప్రతిష్ఠాపన చెయ్యి. శివలింగ ప్రతిష్ఠాపన వల్ల వచ్చే పుణ్యాలను పరమేష్టి కూడా స్తుతించలేడంటే, మా బోటివారికి వివరించడం శక్యమా? కాశీ విశ్వేశ్వరుడిని సందర్శించుకున్నప్పుడు వచ్చే పుణ్యం కంటే, నువ్వు ఇక్కడ ప్రతిష్ఠించబోయే శివలింగాన్ని దర్శించుకున్న వారికి వెయ్యిరెట్లు పుణ్యం వస్తుంది’ అని మునులందరూ ముక్తకంఠంతో పలికారు.‘మరందుకు ముహూర్తాన్ని మీరే నిర్ణయించండి’ అన్నాడు రాముడు.
‘మరో నాలుగు ఘడియలకు దివ్యమైన ముహూర్తం ఉంది’ చెప్పారు మునులు.రాముడు తన పక్కనే ఉన్న హనుమంతుడి వైపు చూసి, ‘హనుమా! కైలాస పర్వతం మీదనున్న శివలింగాన్ని మరో నాలుగు ఘడియల్లోగా ఇక్కడకు తీసుకురావాలి. తేగలవా?’ అని అడిగాడు.‘స్వామీ! నువ్వు ఆజ్ఞాపించాలే గాని, అదెంత పని?’ అని అంటూ మరుక్షణంలోనే ఒక్కసారిగా కుప్పించి, నింగిపైకి ఎగిశాడు. అకస్మాత్తుగా హనుమంతుడు అలా పైకెగిరే సరికి, నేల కంపించింది. చుట్టూ ఉన్న సుగ్రీవాది వానర ప్రముఖులు, విభీషణుడు, అతడి పరివారం హనుమంతుడిని సంభ్రమాశ్చర్యాలతో తిలకించసాగారు.
హనుమంతుడి వేగాన్ని నింగి నుంచి గమనిస్తున్న దేవతలు, అతడు ఏకంగా కైలాస పర్వతాన్నే పెకలించుకుని వస్తాడేమోనని కలత చెందారు.హనుమంతుడు ఉత్తర దిశగా నింగిలో వాయువేగంతో దూసుకుపోయాడు. అరఘడియలోనే కైలాసానికి చేరుకున్నాడు. శివలింగం కోసం కైలాస పర్వతంపై అడుగడుగునా వెదికాడు. ఎక్కడా శివలింగం అతడికి కనిపించలేదు. తాను శివలింగం జాడ కనుగొనే సరికే గడువు మించిపోతుందేమోనని దిగులు చెందాడు. కాసేపు ఆలోచించాడు. మహత్తరమైన ఇలాంటి దైవకార్యాలు తపస్సు ద్వారా మాత్రమే నెరవేరుతాయని భావించి, ఒంటికాలిపై నిలబడి, నడినెత్తిన కనిపిస్తున్న సూర్యుడిపై చూపునిలిపి, చేతులు పైకెత్తి నమస్కరిస్తూ తపశ్చర్యకు పూనుకున్నాడు.
హనుమంతుడి దీక్షాదక్షతకు సంతోషించిన శివుడు కొద్దిసేపటికే అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు.‘నాయనా! ఏం కావాలో కోరుకో! అని అడిగాడు.‘పరమేశ్వరా! శ్రీరాముడు నీ అవ్యయలింగాన్ని భూలోకంలో ప్రతిష్ఠించాలని సంకల్పించుకున్నాడు. గడువు మీరిపోక ముందే నీ అవ్యయలింగాన్ని అనుగ్రహించు. తీసుకుపోయి, శ్రీరాముడికి అందిస్తాను’ అన్నాడు.శివుడు వెంటనే హనుమంతుడి చేతికి తన అవ్యయలింగాన్ని ఇచ్చి, అంతర్ధానమయ్యాడు.హనుమంతుడు వెనువెంటనే ఆ లింగాన్ని తీసుకుని, ఆకాశ మార్గాన దక్షిణ సముద్రతీరంలో రాముడు నిరీక్షిస్తున్న ప్రదేశానికి బయలుదేరాడు.
ఈలోగా వేళ మించిపోతూ ఉండటంతో, మునులందరూ ‘రామా! ముహూర్తం సమీపించింది. హనుమ వల్ల ఆలస్యమయ్యేలా ఉంది. వేళ మించిపోకుండానే సైకత లింగాన్ని ప్రతిష్ఠించు’ అని చెప్పారు. మునుల సలహాతో సీతారాములు సముద్రంలో స్నానాలు ఆచరించి, సైకత లింగ ప్రతిష్ఠాపనకు సిద్ధమయ్యారు. మునులు మంత్రాలు చదువుతుండగా, రాముడు సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడు. రాముడు శివలింగ ప్రతిష్ఠాపన జరుపుతున్న సమయానికే హనుమంతుడు గగన మార్గంలో అక్కడకు చేరుకున్నాడు. పైనుంచి తిలకించిన హనుమంతుడికి రాముడు సాగిస్తున్న శివలింగ ప్రతిష్ఠాపన కార్యక్రమం కనిపించింది. ‘స్వామి శివలింగం కోసం నన్ను కైలాసానికి పంపించి, ఇక్కడ అన్యలింగ ప్రతిష్ఠాపన చేయడమేమిటి’ అనుకుంటూ లోలోపల కలత చెందాడు.
రాముడికి సమీపంలోనే నేల మీదకు దిగాడు హనుమంతుడు. అక్కడే ఉన్నవారందరినీ పలకరించాడు. నేరుగా రాముడి వద్దకు వచ్చాడు. ‘స్వామీ! నీ కార్యాన్ని సకాలంలో నెరవేర్చలేని నా జన్మవ్యర్థం’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకుని పలికాడు.రాముడు అతడిని అనునయించాడు. ‘హనుమా! నువ్వు వేరు, నేను వేరు కాదు. నీలో ద్వైతబుద్ధి ఇంకా తొలగిపోలేదు. అందుకే ఈ దుఃఖం. ముహూర్తం మించిపోతోందని మునులు చెప్పడంతో సైకతలింగాన్ని ప్రతిష్ఠించాను. అంతమాత్రానికే శోకించడం తగునా! నువ్వు కూడా యుద్ధంలో ఎందరో బ్రహ్మరాక్షసులను సంహరించావు కదా! శివుడు అనుగ్రహించిన అవ్యయలింగాన్ని నీ పేరిట ప్రతిష్ఠించు’ అని పలికాడు.హనుమంతుడు తాను కైలాసం నుంచి తెచ్చిన శివలింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించాడు.
∙సాంఖ్యాయన


