
ఆత్మదర్శిని
నీవు నీవుగా మిగిలిపోవడమే అసలైన విశ్రాంతి. ఎందుకంటే నీవు నీవుగా మిగిలిపోవడానికి ఏమైనా శ్రమ ఉందా? అస్సలు లేదు. కానీ మనిషి నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా కావాలి, అలా కావాలి అనుకుంటూ విశ్రాంత స్థితి నుండి పక్కకు వెళ్ళిపోతున్నాడు. నీవు నీవు కావడానికి ఏమైనా శక్తి కావాలా? లేక ప్రయత్నం కావాలా? అసలు అలా ఉన్నప్పుడు అలసటనేదే ఉండదు.
నీ పేరు మైత్రేయ అనుకుందాం. ఎప్పుడైతే నీవు మైత్రేయ అనే వ్యక్తివి ఐనావో, నాకు ప్రాముఖ్యత కావాలి. నన్ను సమాజం గుర్తించాలి, నన్ను గౌరవించాలి అనుకున్నావు. అదే నువ్వు ఆత్మగా ఉన్నపుడు, సాక్షిగా ఉన్నపుడు ఇలా అనిపించదు. అంటే సమాజంలో ఎప్పుడూ ఒక వ్యక్తిలా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావు. నీవు ఏది కాదో అది నిరూపించుకోవాలని అనుకుంటున్నావు. అలా ఏదో నిరూపించాలని అనుకుంటున్నావు కాబట్టే నీలో ఎప్పుడూ ఏదో అలసట ఉండే తీరుతుంది. అందుకే చూడు ఎప్పుడైనా నీవు బయటికి వెళ్ళేటప్పుడు బాగా బిగుసుకోని పోతావు. ఇంటికి రాగానే రిలాక్స్ ఐపోతావు. ఎందుకంటే ఇంటికొచ్చాక నీవు నీవైపోతున్నావన్నమాట. అంటే రిలాక్సేషన్‌కి కారణం నీవు నీ అంతరాత్మతో ఉండటమే. నీవు సమాజంలో కలిసినప్పుడల్లా నీవు కానిది చూపించాలను కోని ఏదో ఒకటి నటిస్తూ వ్యక్తిత్వం అనే ముసుగును వేసుకుంటూ నీ అంతరాత్మకు దూరంగా జరిగిపోతున్నావు. నీ నిజతత్వమైన ప్రశాంతతకు విశ్రాంతికి చాలా దూరమవుతున్నావు.
నీవు ఆత్మగా మిగిలిపోవడానికి ఏమీ చేయనవసరం లేదు. నీవు నీవుగా ఈ క్షణంలో సంపూర్ణత్వంతో మిగిలిపోతే నీవే ఆత్మ. ఆత్మ స్వయం ప్రకాశం అంటారు భగవద్గీతలో కూడా. సహజంగానే నీవు శాంతి, విశ్రాంతి మూర్తీభవించిన మనిషివి. నీలో లేనిది ఏమీ లేదు. కానీ మనం ఎప్పుడూ ఇంకా ఏదో కావాలి అని వ్యక్తిగా కోరుకుంటూనే ఉంటాం. భగవద్గీత ప్రకారం ఆత్మ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దానికి చావులేదు. పుట్టుక లేదు. ఆత్మగా మిగిలిపోవడానికి ఏమైనా కావాలా? ఆత్మకు వస్తువులు, విషయాలు కావాలా? ఏమీ అబ్జర్లేదు. ఆత్మగా ఏదీ నీకు చెందదు. నీవు ఎవరికీ చెందవు. కానీ అన్నీ నీవే ఒక ఆత్మగా... దేవునిగా. అందుకే ఆత్మగా నీవు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీవు అంతులేని ప్రకాశానివి, నీవే దైవానివి.
– స్వామి మైత్రేయ,
ఆధ్యాత్మిక బోధకులు