డయాబెటిస్‌ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? 

What Diabetes Patients Can Eat And Avoid - Sakshi

డయాబెటిస్‌ ఉన్నవారికి వారి బరువునూ, వారు రోజూ చేసే కార్యకలాపాలను బట్టి న్యూట్రిషనిస్టులు వ్యక్తిగతమైన డైట్‌ఛార్ట్‌ సూచిస్తారు. అయితే ఇక్కడ ఇస్తున్నవి కేవలం ఓ సాధారణ డయబెటిస్‌ పేషెంట్‌ ఆరోగ్యకరంగా తీసుకోదగిన / తీసుకోదగని పదార్థాల జాబితా మాత్రమే. సాధారణంగా డయాబెటిస్‌ ఉన్నవారు తమ ఆహారంలో పీచు, కార్బొహైడ్రేట్స్‌ వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇందుకోసం పీచు పుష్కలంగా ఉండే జొన్న, మొక్కజొన్న, గోధుమ, దంపుడుబియ్యం, మొలకెత్తిన గింజలు, పళ్లూ, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.

తాజా కూరగాయల్లో పీచు పదార్థాలు, కొన్ని విటమిన్లు, ఫైటోన్యూట్రియెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవాలి. కొవ్వు పదార్థాలైన నెయ్యి, వెన్న, జున్ను, మీగడ వంటి పదార్థాలను బాగా తగ్గించాలి. వేపుళ్లు పూర్తిగా తగ్గించాలి. డయాబెటిక్‌ పేషంట్స్‌ విషయంలో వారు తీసుకునే ఆహారంలో వేపుళ్లు మరీ ఎక్కువగా పెరిగితే... గుండెజబ్బులు వచ్చే అవకాశమూ   పెరుగుతుంది కాబట్టి వాటన్నింటినీ బాగా తగ్గించాలని డాక్టర్లు / డైటీషియన్లు సూచిస్తారు. 

ఇక తీపి పదార్థాల విషయానికి వస్తే చక్కెర, తేనె, బెల్లం చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. బ్రెడ్స్, బేకరీ ఫుడ్స్, కార్న్‌ఫ్లేక్స్‌ వంటి పీచు తక్కువగా ఉండేవి, మైక్రోన్యూట్రియెంట్స్‌ తక్కువగా ఉండే పదార్థాలను పూర్తిగా తగించాలి డయాబెటిస్‌ ఉన్నవారు తాము చురుగ్గా ఉండటానికీ, తమలోని చక్కెరను అదుపులో ఉంచుకోడానికీ ఎక్సర్‌సైజ్‌ దోహదపడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

ఆహారపు మోతాదు విషయానికి వస్తే... రోజూ కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలనే ఆహార నియమం పెట్టుకోవాలి. రాత్రి భోజనంలో వీలైనంతవరకు శ్నాక్స్‌ తీసుకోవడం ఉత్తమం. అయితే ఇవన్నీ ఎవరికివారికే తమ కేస్‌కు తగినట్లుగా డీటెయిల్డ్‌ న్యూట్రిషనల్‌ ప్లాన్‌ అవసరం. అది రోగి బరువు, దైనందిన కార్యకలాపాలు, వారి బ్లడ్‌ సుగర్‌ లెవెల్స్, చక్కెరను నియంత్రణలో ఉంచడానికి వాడుతున్న మందుల వంటి అనేక అంశాల ఆధారంగా డీటెయిల్డ్‌ న్యూట్రిషన్‌ ప్లాన్‌ను డైటీషియన్లు సూచిస్తారు. (చదవండి: గ్రీన్‌ టీ, కాఫీతో గుండె జబ్బులకు చెక్‌! )

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top