CWS: డ్రైవర్‌ బబ్లూ.. అమెరికా డాక్టర్‌ కోమలి! చాలా మంది ఎందుకు ఇలా పిచ్చిగా ఆరాధిస్తారు?

What Is Celebrity Worship Syndrome Tips To Overcome By Expert - Sakshi

బబ్లూ ఒక సినిమా హీరోకు వీరాభిమాని. ఎంత అంటే ఆధార్‌ కార్డ్‌లో తన పేరు కూడా మార్చేసుకునేంత! ఆ హీరో సినిమా రిలీజ్‌ అయ్యిందంటే వారం రోజులపాటు థియేటర్ల దగ్గరే ఉంటాడు. పూలదండలు, బ్యాండ్‌ మేళాలు, ఊరేగింపుల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తాడు. తమ హీరోను ఎవరైనా ఏదైనా అంటే వాళ్లను కొట్టేస్తాడు.

తమ హీరోను ఆన్‌లైన్‌లో ఎవరైనా ఏమైనా అంటే తన ఫేక్‌ ప్రొఫైల్‌ నుంచి వాళ్లను అసభ్యకరమైన రీతిలో ట్రోల్‌ చేస్తాడు. అలా ట్రోలింగ్‌కు గురైన వాళ్లలో ఒకరు సైబర్‌ క్రైమ్‌ కేసు పెట్టడంతో బబ్లూ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇంతా చేసి బబ్లూ చదివింది పదో తరగతి, చేసేది డ్రైవర్‌ ఉద్యోగం
∙∙ 
కోమలి అమెరికాలో డాక్టర్‌. ఇండియాలో ఉన్నప్పుడు మామూలుగానే ఉన్నా అమెరికా వెళ్లాక భారతీయ సంస్కృతీ సంప్రదాయాలపై ఆసక్తి పెరిగింది. ఉదయం లేవగానే ప్రవచనాలు వింటుంది. ఆ ప్రవచనకారుడు ఏం చెప్తే అది తు.చ. తప్పకుండా పాటిస్తుంది. ఆయన చెప్పేదంతా చాదస్తమని కుటుంబ సభ్యులు చెప్పినా పట్టించుకోదు.

మెడిసిన్‌ చదివి కూడా అంత అన్‌ సైంటిఫిక్‌ విషయాలను ఎందుకు పాటిస్తున్నావని కొలీగ్స్‌ ఎవరైనా అడిగితే.. ఆ ప్రవచనాల్లోని శాస్త్రీయత గురించి వివరించేందుకు ప్రయత్నిస్తుంది. అంతకుమించి ఏమైనా మాట్లాడితే వాళ్లతో గొడవ పడుతుంది, మాట్లాడటం మానేస్తుంది. 

సెలబ్రిటీ వర్షిప్‌ సిండ్రోమ్‌
బబ్లూ, కోమలి.. ఇలా సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, మత గురువులు, ప్రవచనకారులను అభిమానించేవారు మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. అభిమానించడంలో తప్పులేదు. కానీ ఆ అభిమానం దురభిమానంగా, ఉన్మాదంగా మారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే.. సంబంధబాంధవ్యాలను దెబ్బతీస్తుంటే.. దాన్నే ‘సెలబ్రిటీ వర్షిప్‌ సిండ్రోమ్‌’ అంటారు.

ఈ సిండ్రోమ్‌ ఉన్నవారికి తమ జీవితం కన్నా తాము అభిమానించే వారి జీవితం ముఖ్యం. తన కుటుంబ సభ్యులను పట్టించుకోకపోయినా తాము అభిమానించే హీరో, నేతలకోసం డబ్బు, సమయం, శక్తీ ఖర్చు పెడుతుంటారు. వారికోసం ఎంతటికైనా సిద్ధమవుతారు. ఇలాంటి వారిలో మానసిక ఆరోగ్యం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే వారికే తెలియని కొన్ని మానసిక సమస్యలు ఉంటాయన్నమాట.

అసలెందుకు ఆరాధిస్తారు?
కొందరు వ్యక్తులు కొన్నిరంగాల్లో ఏదో ఉన్నతిని సాధిస్తారు. మీడియా దాన్ని పదే పదే చూపిస్తుంది. వారి జీవితంలో జరిగే ప్రతి అంశాన్నీ గొప్పగా ప్రొజెక్ట్‌ చేస్తుంది. వారు చేసే ప్రతి పనినీ గొప్పగా ప్రచారం చేస్తుంది. దాన్ని చూసి అభిమానిస్తారు. అయితే కొందరిలో ఈ అభిమానం హద్దులు దాటుతుంది.

తాము అభిమానించే వ్యక్తులను మనుషులుగా చూడటం మరిచిపోతారు. వారిని మహాత్ములుగా, మహిమానిత్వులుగా, సర్వశక్తి సంపన్నులుగా, దైవ స్వరూపులుగా చూడటం మొదలుపెడతారు. వారిలో తప్పులేమీ ఉండవన్నట్లుగా, వారు చేసేవన్నీ ఒప్పే అన్నట్లుగా విశ్వసిస్తారు. ఈ స్థితికి చేరాక తార్కికతకు తావుండదు. తర్కంతో సంబంధం లేకుండా వారు చేసే ప్రతి పనినీ సమర్థిస్తుంటారు.

వాస్తవికతకు దూరం...
సెలబ్రిటీ వర్షిప్‌ సిండ్రోమ్‌ ఉన్న అభిమానులు వాస్తవికతకు దూరమవుతారు. తాము నమ్మిందే వాస్తవమనే భ్రమల్లో బతుకుతుంటారు
తమ సెలబ్రిటీని విమర్శించిన వాళ్లపై విరుచుకు పడతారు. ఎలాంటి గొడవలకైనా సిద్ధపడతారు. కేసుల్లో ఇరుక్కుంటారు.
తమను సెలబ్రిటీతో పోల్చుకుని వారిలా ఉండాలని ప్రయత్నిస్తారు. అలా లేనందుకు బాధపడుతుంటారు. బాడీ ఇమేజ్‌ సమస్యలుంటాయి.
ఆలోచించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. బాధ్యత లేకుండా ఫూలిష్‌గా ప్రవర్తిస్తుంటారు 
సెన్సేషన్‌ కోరుకుంటారు. ఇతరుల స్సేస్‌ను గుర్తించడంలో సమస్యలుంటాయి. 

బయటపడటం ఎలా?
మీరు అభిమానించే సెలబ్రిటీలో ఏయే లక్షణాలు, ప్రవర్తనలు మీకు నచ్చాయో లిస్టు రాసుకోండి. అదంతా పబ్లిక్‌ బిహేవియర్‌ మాత్రమేనని, నిజం కావాల్సిన అవసరం లేదని గ్రహించండి ∙అతనంటే మీకెందుకు ఇష్టమో విశ్లేషించుకోండి. అతని పట్ల అభిమానం మీ జీవితాన్ని, బంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోండి.

వారితో కలవగలిగితే, మాట్లాడగలిగితే మీరు అభిమానించడంలో తప్పులేదు. లేదంటే మీరు ఊహల లోకంలో ఉన్నారని తెలుసుకోండి
మీ సెలబ్రిటీ గురించి తెలుసుకోవడం కోసం, వారి గురించి మాట్లాడుతూ రోజుకు ఎన్ని గంటలు వెచ్చిస్తున్నారో లెక్కేయండి.

ఆ సమయాన్ని క్రమేపీ తగ్గించండి లేదా పూర్తిగా మానేయండి.
ఆ సెలబ్రిటీకి భిన్నంగా వేరే అలవాట్లను, హాబీలను అలవాటు చేసుకోండి ∙ఎంత ప్రయత్నించినా మీరు ఆ వలయం నుంచి బయటపడటం సాధ్యం కాకపోతే సైకాలజిస్ట్‌ను, లేదా సైకియాట్రిస్టును కలవండి.  


-సైకాలజిస్ట్‌ విశేష్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top