
ఒకప్పుడు ఒకలా ఉండదు.. ఎక్కడ ఆగిపోనివ్వదు.. యెదరేముందో చెప్పదు కదిలే సమయం.. నీడలా జ్ఞాపకం వదలదు.. తోడుగా ఏ నిజం నడవదు.. ఒంటిగా సాగటం తప్పదు జరిగే పయనం..
నీతోనె మొదలైందా.. నీతోనె ముగిసిందా.. ఇదే కదా కోరిందని.. వేరే ఇంకేం కావాలని.. అన్నామంటే
ఈనాటికి రేపంటూ ఉంటుందా.. ఇవ్వాళ ఎంతో బాగుందని అయినా ఏదో లోటుందని.. ఇంకా ఏదో కావాలని అనుకోని రోజుందా.. కలకే మన ఈ గమనం.. అని ‘ఊపిరి’ చిత్రంలో సీతారామశాస్త్రి చెప్పినట్లు.. ఆ ఒక్క క్షణం దాటితే అందమైన లోకం మనకళ్లముందుంటుంది. రోజులోనే కొంత సమయం చీకటి.. కొంత సమయం వెలుతురు ఉంటుంది.. అంతమాత్రానికే భయపడిపోతామా..? అక్కడే ఆగిపోతామా? అలాంటిది జీవితంలోనూ చీకటి వెలుగులు సహజమే.. అలాంటి అందకారాన్ని అధిగమిస్తేనే కదా వెలుతురు లాంటి భవిష్యత్తును చూడగలం.. జీవితంలో ఓడిపోయామనో.. బ్రేకప్ అయ్యిందనో.. లేదా కుటుంబంలో ఏదో సమస్య తలెత్తిందనో.. తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఎలా? అంటున్నారు పలువురు కౌన్సెలర్లు.. వయసుతో పనిలేకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు నగరంలోనూ, దేశంలోనూ పలు ఎన్జీఓలు కృషిచేస్తున్నాయి.. ఆత్మహత్యల నివారణకు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి.. సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణా దినం సందర్భంగా ఈ కథనం..
‘22 ఏళ్ల మహిళ.. రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు సిద్ధమైంది. ఫోన్‌లో స్నేహితురాలు వద్దని వారించి.. రోషీ్నకి ఫోన్ చేయమని బతిమాలింది. దీంతో ఫోన్ చేయగా ‘అమ్మా నీ ప్రాణం నీ ఇష్టం.. కానీ నీ ఆత్మహత్యను రెండు నిమిషాలు వాయిదా వేసుకో.. నా మాటలు విన్న తర్వాత నీ ఇష్టం..’ అంటూ కన్విన్స్ చేసింది.
లివింగ్ రిలేషన్‌షిప్‌లో బాబు పుట్టిన తర్వాత ఆ వ్యక్తి వదలి పెట్టాడని.. ప్రస్తుతం ఆనారోగ్య సమస్యలు వచ్చాయని.. ఎంతో ఇష్టమైన తన ఐదు నెలల బాబుని ఇంట్లో అమ్మ దగ్గర వదిలేశానని చెప్పింది. ఆ తర్వాత కౌన్సెలర్ మాటలతో ఆత్మహత్య ఆలోచన విరమించుకుంది.’
‘చున్నీతో ఉరేసుకుంటున్నా.. మీరెలా కాపాడతారో కాపాడండి.. అంటూ 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి రోషీ్నకి కాల్ చేసి చాలెంజ్ విసిరాడు. గర్ల్‌ఫ్రెండ్ ఇంకొకరితో తిరుగుతోదని, తనను పట్టించుకోవడం లేదని మనసులో బాధను బయటపెట్టాడు.’ కనీ పెంచిన తల్లిదండ్రులు ముఖ్యమో.. రెండేళ్ల క్రితం పరిచయమైన అమ్మాయి ముఖ్యమో.. ఆలోచించుకో? ప్రేమించడానికి ఇంకొకరు దొరకొచ్చు.. నీ ప్రాణం పోతే మళ్లీ వస్తుందా?.. అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో పునరాలోచనలో పడ్డాడు..
ఇలా.. ఆర్థిక ఇబ్బందులతో ఒకరు.. కుటుంబ కలహాలతో మరొకరు చెప్పుకుంటూ.. కొన్ని వేల మందికి అండగా నిలిచింది రోషీన్.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని విద్యార్థులు, ఉద్యోగం రాలేదని నిరుద్యోగులు, వివాహం కాలేదని యువత, పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని ఉద్యోగులు, రిలేషన్‌షిప్‌లో అనుమానాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు.. ఇలా చిన్నపాటి సమస్యలకు మనసు చిన్నబుచ్చుకుంటున్నారు. గోరంత సమస్యను కొండంతగా భావించి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
చిన్నిపాటి కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బంగారు భవిష్యత్తును అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. ప్రపంచంలో సమస్యలు మనకు మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటాయని భావించి ఆ ఒక్క క్షణం తొందరపడకుండా ఉంటే.. మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవచ్చు.. మనలోని బాధను కావాల్సిన వారితోనో.. ఇతరులతో పంచుకుంటే 90 శాతం పరిష్కారాలు లభిస్తాయని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఏదో ఒకదాంట్లో ఓటమి చెందామనో..పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో.. తల్లిదండ్రులు మందలించారనో కుమిలిపోకుండా.. వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు..
ఎన్జీఓల కృషి..
నగరానికి చెందని పలు ఎన్‌జీఓ సంస్థలు ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తున్నాయి. ఇందులో ఏటా సుమారు 18 వేల నుంచి 23 వేల మంది కాల్ సెంటర్ ద్వారా సమస్యలు చెప్పుకుంటున్నారని కొన్ని అధ్యయనాల నివేదికల చెబుతున్నాయి. ఆ నివేదిక ప్రకారం..
ఆ మూడు నెలలే కీలకం..
విద్యార్థుల ఆత్మహత్యల్లో ఆ మూడు నెలలే కీలకంగా మారుతున్నాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇతర అకడమిక్ కోర్సుల్లో పాస్ కాలేదని కొందరు, తక్కువ మార్కులు వచ్చాయని మరికొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువుల విషయంలోనూ కొందరు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు.
లక్షలు పోసి చదివిస్తున్నామని తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారని, ఇది వారి సున్నిత మనసును మరింత కుంగదీస్తున్నాయి. తల్లిదండ్రుల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాలి. పిల్లలతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలి.
– డాక్టర్ బీ.సూర్యారావు, సైకాలజిస్టు
ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వారిలో కుటుంబ తగాదాలు, రిలేషన్‌షిప్, బ్రేకప్ వంటివి 30 శాతం ఉన్నాయి.
ఒంటరితనం, కుంగుబాటు, ఇతర మానసిక సమస్యలతో మరో 10 శాతం.
వివాహం కాలేదని, ఇతర సామాజిక సమస్యలతో 12 శాతం. ఇలా పలు కారణాలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
నిరుద్యోగం, అప్పులు, ఆర్థిక పరమైన సమస్యలతో 25 శాతం మంది. విద్య, వృత్తిపరమైన ఒత్తిడిని
తట్టుకోలేక మరో 22 శాతం.
ఆవేశంలో నిర్ణయాలు వద్దు..
ఆత్మహత్యల నివారణకు 22 రాష్ట్రాల్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీతో సహా 16 ప్రాంతీయ భాషాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు నిర్వహిస్తున్నాం. ఎక్కువ మంది మహిళలు ప్రేమ, వివాహం, కుటుంబ ఇబ్బందులని చెబుతున్నారు. మగవారిలో ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగం, పని ఒత్తిడితో.. పూర్తిగా నెగిటివ్ ఆలోచనల్లోకి వెళ్లిపోతున్నారు.
ఒక్కోసారి ఎవరికీ చెప్పుకోలేక ఒంటరితనాన్ని ఫీలవుతున్నారు. ఇటువంటి వారికి వారం లేదా 15 రోజులకు ఒక సెషన్ చొప్పున హైదరాబాద్‌లోనూ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. 78930 78930 హెల్ప్‌లైన్ ద్వారా సాయం పొందవచ్చు.
(చదవండి: నింద, ఒత్తిడి, మౌనం..ఇంత ప్రమాదకరమైనవా? అంత దారుణానికి ఒడిగట్టేలా చేస్తాయా..?)