కాళ్ల పారాణి ఆరక ముందే కాటికి.. | Bride commits suicide after not wanting to get married | Sakshi
Sakshi News home page

కాళ్ల పారాణి ఆరక ముందే కాటికి..

Oct 31 2025 4:43 AM | Updated on Oct 31 2025 4:43 AM

Bride commits suicide after not wanting to get married

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి మనస్తాపం

తల్లిదండ్రులు చేసిన పెళ్లి ఇష్టం లేక నవవధువు ఆత్మహత్య

కోస్గి: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో పాటు.. పోలీసులు, గ్రామ పెద్దల వద్ద పంచాయతీలోనూ న్యాయం జరగలేదు. దీనికితోడు తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ నవ వధువు పెళ్లి జరిగిన మూడు రోజులకే బలవన్మరణానికి పాల్పడింది.

స్థానికుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన గొల్ల మల్లప్ప, మైబమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, శ్రీలత (21) అనే కుమార్తె ఉన్నారు. శ్రీలత అదే గ్రామానికి చెందిన శ్రీశైలం అలియాస్‌ సూరి అనే యువకుడిని ప్రేమించింది. వీరి ప్రేమ విషయం మూడు నెలల క్రితం అమ్మాయి ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు వేరే పెళ్లి సంబంధం చూశారు. దీంతో శ్రీలత అప్పట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. 

కుటుంబాల పంతం..
తన కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ప్రేమించిన యువకుడు చెప్పిన విధంగా శ్రీలత డయల్‌ 100కు ఫోన్‌ చేసి బలవంతంగా తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇరు కుటుంబాల వారు గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటామని చెప్పగా అమ్మాయి సైతం ఒప్పుకోవడంతో పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. 

ఇరు కుటుంబాల వారు పెద్ద మనుషుల సమక్షంలో పెళ్లికి ఒప్పుకునేది లేదని పంతం పట్టడంతోపాటు యువకుడు సైతం పెళ్లికి నిరాకరించాడు. ఈ క్రమంలో శ్రీలతకు ఈ నెల 26న షాద్‌నగర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపించారు. మంగళవారం యువతి మేనమామ ఉండే మోత్కూర్‌కు వధూవరులు వచ్చారు. 

వారి ఇంట్లో శ్రీలత పురుగు మందు తాగడంతో కుటుంబ సభ్యులు ఆమెను వికారాబాద్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించగా పరిస్థితి విషమించి గురువారం ఉదయం మృతిచెందింది. ఈ ఘటనపై యువతి సోదరులు.. శ్రీలత ప్రేమించిన యువకుడిపై కోస్గి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా, సంఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదని, అక్కడే ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. 

రాజకీయ రగడ..
మరో పక్క శ్రీలత ప్రేమించిన యువకుడు సూరి అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తుండటంతో రాజకీయ రగడ మొదలైంది. ఆ నాయకుడి అండతోనే యువకుడు పెళ్లికి నిరాకరించాడని, పోలీసులు సైతం వారికే మద్దతు ఇస్తున్నారని బాధితులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజా సంఘాల నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. యువతి మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement