Heart Attack: 30 ఏళ్లకే గుండెపోటు.. కారణాలేంటి?.. ఇలా చేయకపోతే డేంజర్‌లో పడినట్టే!

What Are The Causes Of Heart Disease - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గం కూడేరుకు చెందిన వేణుగోపాల్‌ వయసు 35 ఏళ్లు. ఈయన వయసుకు మించిన బరువుతో ఉంటారు. ఈ మధ్యనే ఒక్కసారిగా గుండె పట్టేసింది. రాత్రికి రాత్రి 108 వాహనంలో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. హార్ట్‌ఎటాక్‌ అని చెప్పారు. తక్షణమే స్టెంట్‌ వేశారు. సకాలంలో ఆస్పత్రిలో చేర్చడంతో బతికి బయటపడ్డారు.
చదవండి: 5AM Club: వాళ్లంతా ఉదయం ఐదింటికే నిద్రలేస్తారు! ప్రయోజనాలెన్నో!

గార్లదిన్నెకు చెందిన శ్రీనివాసులు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. సిగరెట్‌ తాగే అలవాటు ఉంది. అప్పుడప్పుడు మద్యం సేవిస్తారు. వాకింగ్, వ్యాయాయం వంటివి తెలియవు. ఉన్నట్టుండి ఈ మధ్యనే ఛాతిలో తీవ్రనొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించి యాంజియో నిర్వహించగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రెండు వాల్వులు పూడుకుపోయాయని వైద్యులు తెలిపారు. రెండు స్టెంట్‌లు వేసిన తర్వాత కోలుకున్నారు.

పైన చెప్పినవి మచ్చుకు రెండు ఉదాహరణలే. వ్యాయామం, ఆహార నియమాలు పట్టించుకోని వారికి ఈ ప్రతికూలతలు ముప్పై ఏళ్లకే చూపిస్తుండటం కలవరపరుస్తున్న అంశాలు.

ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన జీవన శైలిజబ్బులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ ఎగబాకుతున్నాయి. బ్రెయిన్‌ స్ట్రోక్, హార్ట్‌స్ట్రోక్‌ వంటి సమస్యలతో వస్తున్న వారిలో పట్టణ వాసులతో పాటు పల్లెటూరి వారూ ఉన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు సగటున నెలకు 500కు పైగా గుండెపోటు సమస్యలతో వస్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో బ్రెయిన్‌స్ట్రోక్‌ సమస్యలతో వస్తున్న వారి సంఖ్య పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఊబకాయం సమస్య కూడా పెరుగుతుండటంతో అధిక శాతం మంది రక్తపోటు, డయాబెటిక్‌ బారిన పడుతున్నారు.

జబ్బుల శాతం పెరుగుతోంది 
జీవనశైలి జబ్బుల శాతం పెరుగుతోంది. ఆహార అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు ఈ జబ్బులకు కారణమవుతున్నాయి. వ్యాయామ లేమితో ఎక్కువ మంది జబ్బుల బారిన పడుతున్నారు. ఈ మధ్య చాలా మంది మానసిక జబ్బులతో ఆస్పత్రి బాట పడుతున్నారు. 
– విశ్వనాథరెడ్డి, మానసిక వైద్యనిపుణులు, జాతీయ హెల్త్‌ మిషన్‌

జీవనశైలిలో మార్పు రావాలి 
రోగాలకు దురంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ నిత్యం తమ జీవనశైలిలో మార్పులను అనుసరించాల్సిందే. ప్రధానంగా వ్యాయామం, యోగా, క్రీడలు వంటి వాటిలో ప్రాతినిధ్యం వహించాలి. ఒకే చోట ఉండి ఉద్యోగం చేయడం, శారీరక శ్రమ లేకపోవడంతో అనారోగ్యాలను కొనితెచ్చుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి రోజువారి 2000 వరకు ఓపీ సేవలు, 500 వరకు ఐపీ సేవలు అందిస్తున్నాం.
– రఘునందన్‌, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌   

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top