విద్యాబాలన్.. ‘జల్సా’ మూవీ రివ్యూ

Vidya Balan, Shefali Shah Deliver Acting Masterclass in Amazon Film Jalsa - Sakshi

క్రైమ్‌ అండ్‌ పనిష్‌మెంట్‌... పురుష ప్రపంచంలో కనిపించే చర్య... ప్రతిచర్య. కాని స్త్రీల ప్రపంచంలో నేరం తర్వాత శిక్ష ఉంటుందా క్షమ ఉంటుందా? ‘జల్సా’ సినిమా చూడాలి. ఇద్దరు హీరోల రోజులు పోయి ఇద్దరు మహిళా ఆర్టిస్టుల రోజులు వచ్చాయి అని ఈ సినిమా ఎలుగెత్తి చాటుతోంది. విద్యాబాలన్, షెఫాలీ షా... వీళ్ల పోస్టర్‌తో సినిమా రిలీజ్‌ కావడం పెద్ద బాలీవుడ్‌ లీప్‌.
మరో విశేషం సెరిబ్రల్‌ పాల్సీ ఉన్న తెలుగు పిల్లవాడు సూర్య కాశీభట్ల ముఖ్యపాత్ర పోషించి ఆకట్టుకోవడం. ఈవారం సండే సినిమా.

మనిషి ఒక నేరం చేస్తాడు. చట్టం శిక్ష విధిస్తుంది. అన్నిసార్లు చట్టానికి చిక్కకపోవచ్చు. ఆ శిక్ష సాపేక్షం కావచ్చు. అంతమాత్రం చేత ఆ నేరం ఆ మనిషిని ఊరికే ఉంచుతుందా? మానసికంగా అది విధించే శిక్ష ఏమిటి? పశ్చాత్తాపంతో విధించుకునే శిక్ష ఏమిటి? శిక్షను తప్పించుకుందామనుకుని ప్రయత్నిస్తూ ఆ అశాంతి లో వేసుకునే శిక్ష ఏమిటి? మానవ ప్రవర్తన, స్వభావం, ఆలోచన ఎప్పటికప్పుడు వినూత్నం. పరిస్థితులకు ఒక్కోసారి బానిస. అవే పరిస్థితులపై విజేత.

‘జల్సా’ ఒక నేరం చేసిన స్త్రీకి, ఆ నేరం వల్ల నష్టపోయిన స్త్రీకి మధ్య నడిచే కథ. సాధారణంగా సినిమా అనేది వ్యాపారం కాబట్టి ఇలాంటి కథలు మగవారి మధ్య రాసుకుంటారు. ఆ మగవాళ్ల ఇమేజ్‌తో సినిమాలు ఆడుతాయి. కాని ఇప్పుడు స్త్రీలతో కథ నడిపించవచ్చని నిరూపిస్తున్నారు. ఇది ప్రయోగం. ప్రయత్నం. ముందంజ.

కథ ఏమిటి?
ముంబై నగరంలో ఉన్నత వర్గానికి చెందిన జర్నలిస్ట్‌ విద్యాబాలన్‌. ఆమె విడాకులు తీసుకుంది. ఆమెకు సెరిబ్రల్‌ పాల్సీ ఉన్న ఒక పన్నెండేళ్ల కొడుకు ఉన్నాడు. తోడుగా వృద్ధురాలైన తల్లిగా రోహిణి హట్టాంగడి. వీరందరికీ వండి పెట్టడానికి రుక్సానా అనే వంట మనిషి షెఫాలీ షా. విద్యా బాలన్‌ విలువలు ఉన్న జర్నలిస్ట్‌. ఆమె సత్యాన్ని వెలికి తీయడానికి ఎంతటి వారినైనా ఎదిరిస్తూ ఉంటుంది. కాని ఆమే సత్యాన్ని దాయవలసి వస్తే? ఒకరోజు అర్ధరాత్రి ఆమె డ్యూటీ నుంచి ముగించి కారు డ్రైవ్‌ చేస్తూ ఒక టీనేజ్‌ అమ్మాయిని ఢీ కొడుతుంది. ఊహించని ఈ ఘటనకు ఎలా రియాక్ట్‌ కావాలి? అక్కడ ఎవరూ ఉండరు. దిగి చూసే ధైర్యం లేదు. టీనేజ్‌ అమ్మాయిని ఆమె ఖర్మానికి వదిలి ఇల్లు చేరుకుంటుంది.

కాని మరుసటి రోజు తెలుస్తుంది అలా తాను యాక్సిడెంట్‌ చేసి మృత్యువు అంచుదాకా (సీరియస్‌గా గాయపడుతుంది) పంపిన అమ్మాయి తన పనిమనిషి కూతురేనని. ఒక వైపు సంఘంలో పరువు, ఇంకో వైపు జైలు భయం, మరోవైపు ఎలా తప్పించుకోవాలి అనే ఆందోళన, తన సొంత ఇంటి మనిషిలాంటి అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాననే గిల్ట్‌. ఇవన్నీ ఆమెను వెంటాడుతాయి. సత్యాన్ని వెతుకులాడే జర్నలిస్ట్‌ తానే ఒక సత్యాన్ని తొక్కిపెట్టాల్సిన పరిస్థితికి వస్తుంది. మరోవైపు పనిమనిషి అయిన షెఫాలీ షాకు ఇదంతా తెలియదు. ఎవరో యాక్సిడెంట్‌ చేశారు. తన యజమాని వైద్యం చేయిస్తోంది. కూతురు బతుకు బుగ్గిపాలైంది అనే శోకం. కాని ఒక నేరం జరిగితే అందుకు తప్పకుండా శిక్ష ఉంటుంది. చట్టానికి విద్యాబాలన్‌ దొరక్కపోవచ్చు. కాని షెఫాలీ షాకు దొరికిపోతుంది. తన కూతురికి యాక్సిడెంట్‌ చేసింది తన యజమానే అని తెలుసుకున్న షెఫాలీ షా ఏం చేసింది? చూడాలి.

పరిస్థితులు
ఒక ఘటన జరిగినప్పుడు పరిస్థితుల కొద్దీ మనిషి స్వభావం ఎలా మారిపోతుందో ఈ సినిమా చర్చిస్తుంది. విద్యాబాలన్‌ యాక్సిడెంట్‌ ముందు వరకూ ఒక మనిషి... అయ్యాక ఒక మనిషి. ఆమెకు తీవ్రమైన మానసిక ఆందోళన మొదలైపోతుంది. లిఫ్ట్‌లో, నాలుగ్గోడల మధ్య ఉండలేకపోతుంటుంది. పీడకలలు. ఇదంతా సత్యాన్ని దాచడం వల్లే. ఆమె తన స్వభావానికి విరుద్ధంగా ఈ విషయం బయటపడకుండా ఉండాలంటే ఎవరెవరిని ఎంతెంత పెట్టి కొనాలి అనే రంధిలో పడిపోతుంది. మరోవైపు తన కూతురులాంటి అమ్మాయిని జీవచ్ఛవంలా హాస్పిటల్‌లో చూసి లోలోపల కుమిలిపోతూ ఉంటుంది.  అటువైపు షెఫాలీ షా చుట్టూ చాలామంది మూగుతారు.

నేరం జరిగినప్పుడు శిక్ష పడాలి అని మొదట అనిపిస్తుంది. కాని పేదవాళ్లు ఆ సందర్భంలో ఒకలాగా శ్రీమంతులు ఒకలాగా వ్యవహరిస్తారని ఈ సినిమాలో చూపిస్తారు. పోలీసులే మధ్యవర్తులుగా మారి నీకో పది లక్షలు ఇప్పిస్తాం... కాంప్రమైజ్‌ అయిపో అని షెఫాలీని ఒప్పిస్తారు. గమనించండి. పేదవాళ్లు శ్రీమంతులకు నష్టం కలిగిస్తే ఇలాంటి అప్షన్‌ ఉండదు. వారు జైలుకు వెళతారు. షెఫాలీ అంగీకరిస్తుంది. కాని చివరకు నేరం చేసింది తన యజమానే అనుకున్నాక ఆమె ప్రతిచర్య వేరేగా ఉంటుంది. ఆ ప్రతిచర్య ఏమిటి? స్త్రీ అంటే క్షమ. క్షమించడమే. కాని ఇదంతా గ్రిప్పింగ్‌గా ఉంటుంది చూడటానికి.

ఆ పిల్లాడు
ఈ సినిమాలో విద్యాబాలన్‌ కుమారుడుగా వేసిన సూర్య కాశీభట్ల మరో ముఖ్యపాత్ర. ఈ పాత్ర ఒక సంకేతం కావచ్చు. కన్నకొడుకు సెరిబ్రల్‌ పాల్సీ (మాట, కదలికల లోపం)తో ఉన్నప్పటికీ విద్యా బాలన్‌ ఆ పిల్లాణ్ణి ప్రేమించకుండా ఉంటుందా? ఎంతో ప్రేమిస్తుంది. ఆ పిల్లాడికి వంట మనిషిగా పని చేసే షెఫాలీ కూడా వాణ్ణి ఎంతో ప్రేమిస్తుంది. ఆ పిల్లాడు సంపూర్ణుడు కాడు. లోపం ఉన్నవాడు. తాము ఇష్టపడే మనుషులు సంపూర్ణులు అయి ఉండరు. ఏవో ఒక లోపాలు ఉంటాయి. తప్పులు జరుగుతాయి. పొరపాట్లు చోటు చేసుకుంటూ ఉంటాయి. అంతమాత్రాన ఆ బంధాలను తెంపేసుకోలేము. కఠినమైన శిక్షలు విధించలేము. క్షమ ఒక మార్గం ఏమో వెతకాలి. ఏమంటే శిక్ష కంటే క్షమ గొప్పది.

ఈ సినిమా అలాంటి ఆలోచన ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. విద్యా బాలన్, షెఫాలీ... వీరద్దరి గొప్ప నటనను చూడొచ్చు. సూర్య కూడా ఎంతో గొప్పగా నటిస్తాడు. కథ ఇంకా బాగుండొచ్చు. క్లయిమాక్స్‌ అసంపూర్ణం అనిపించవచ్చు. కాని అసంపూర్ణతను ప్రేమించమనే కదా డైరెక్టర్‌ సురేశ్‌ త్రివేణి చెబుతున్నది.

అమేజాన్‌ ప్రైమ్‌లో ఉంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top