Vasectomy Operations: వెసక్టమీ చేయించుకుంటే పురుషులు శక్తిహీనులవుతారా?

Vasectomy Operations: Men Avoid Family Planning Surgeries - Sakshi

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు దూరంగా పురుషులు

నాలుగున్నరేళ్లలో కేవలం 559 వెసక్టమీ ఆపరేషన్లు

అపోహలు వీడాలంటున్న వైద్యులు 

అరసవల్లి(శ్రీకాకుళం జిల్లా): వెసక్టమీ.. ఈ పేరు వింటేనే మగవారు పరుగులు తీస్తున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్లో భాగంగా చేసుకోవాల్సిన ఈ ఆపరేషన్లకు వెనకంజ వేస్తున్నారు. కేవలం అపోహలే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెసక్టమీ ఆపరేషన్ల గణాంకాలు పరిశీలిస్తే ఇదే విషయం తేటతెల్లమవుతోంది. వెసక్టమీకి తాము దూరమంటూ.. భారం బాధ్యతంతా ఇల్లాలిదే అన్నట్లుగా కొందరు ప్రదర్శిస్తున్న ధోరణి ఈ లెక్కలకు కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. దీంతో ఒకరిద్దరు పిల్లల్ని కనగానే ఆడవాళ్లకు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత నాలుగున్నరేళ్లులో కేవలం 559 మంది పురుషులు మాత్రమే వెసక్టమీ ఆపరేషన్లు చేయించుకోవడం గమనార్హం.
చదవండి: స్టార్టప్‌ కలలు కంటున్నారా.. ఈ స్కూల్‌ మీకోసమే..!

సింగిల్‌ డిజిట్‌కే పరిమితం.. 
ఒకప్పుడు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవడంలో మగవారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండేవారు. క్రమేణా వారిలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ ఆపరేషన్లు చేయించుకునే బాధ్యత మహిళలదే అన్న భావనలో ఉంటున్నారు. వంద మంది మహిళలు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటుంటే.. వెసక్టమీ చేయించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ప్రభుత్వ లక్ష్యాలు వేలల్లో ఉంటే అమలు సింగిల్‌ డిజిట్లు దాటడం లేదు. ప్రస్తుత సమాజంలో దాదాపుగా విద్యావంతులు అన్నింట్లో అవగాహన కలిగిఉన్నప్పటికీ.. వెసక్టమీ వంటి ఆపరేషన్ల విషయంలో ముందుకు రావడం లేదు. పైగా ఇలాంటి వాటిపై ఎలాంటి చర్చలకు ఆస్కారమివ్వడం లేదు. ఎక్కడో భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటేనే కొందరు భర్తలు వెసక్టమీలకు అంగీకరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అపోహలే కారణమా.. 
వెసక్టమీ చేయించుకుంటే పురుషుల శక్తిహీనులవుతారని, పనులు సమర్ధంగా చేయలేరన్న అపోహ చాలా మందిలో ఉంది. 
భర్త కంటే తామే శస్త్రచికిత్సలు చేయించుకుంటామంటున్న మహిళలే అధికంగా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. 
ప్రస్తుతం ప్రసవానంతరం మహిళలే ట్యుబెక్టమీ చేయించుకోవడం రివాజుగా మారిపోయింది. 
అపోహలు తొలగించేందుకు వైద్యారోగ్య శాఖ బుర్రకథలు, వీధి నాటకాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా...ఫలితం మాత్రం కనబడడం లేదు.  
మహిళలకు ట్యుబెక్టమీ చేయడం మేజర్‌ ఆపరేషన్‌ లాంటిదే అని వైద్యులు చెబుతున్నారు. అదే పురుషుల విషయంలో వెసక్టమీ మాత్రం చాలా సులువైన, సులభమైన ప్రక్రియ అని అంటున్నారు. ఎటువంటి కోతలు, కుట్లు అవసరం లేకుండానే సాంకేతిక పరిజ్ఞానంతో వెసక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. 

జిల్లాలో ఇదీ పరిస్థితి..
కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో జిల్లా వైద్యారోగ్య శాఖ విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో నాలుగున్నరేళ్లుగా ఈ శస్త్రచికిత్సల లెక్కలు చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. తాజాగా 2022–23 (జూన్‌ నాటికి)లో వెసక్టమీ సర్జరీలు 654, ట్యుబెక్టమీ సర్జరీలు 12,430 వరకు లక్ష్యంగా నిర్ణయించగా ప్రస్తుత జూన్‌ నెలాఖరు నాటికి కేవలం ఆరు వెసక్టమీ, 840 ట్యుబెక్టమీ సర్జరీలు నమోదయ్యాయి. లక్ష్య శాతాలను పరిగణనలోకి తీసుకుంటే 3.67 శాతం వెసక్టమీ, 27.03 శాతం ట్యుబెక్టమీ లక్ష్యాలను మాత్రమే సాధించారు.

అవగాహన కల్పిస్తున్నాం.. 
కుటుంబ నియంత్రణకు వీలుగా పురుషులకు వెసక్టమీ, మహిళలకు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించుకునేలా ఎప్పటికప్పుడు అవగాహన కలి్పస్తున్నాం. అయినప్పటికీ అపోహలతో పురుషులు ముందుకు రావడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో సాధించిన లక్ష్య శాతం సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవుతోంది. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎలాంటి అపోహలు లేకుండా వెసక్టమీకి పురుషులు సిద్ధం కావాలి. అన్ని పీహెచ్‌సీలు, ప్రభుత్వ వైద్యశాలల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తాం. చాలా మంది వైద్యులు ఈ సర్జరీలపై దృష్టి సారించడం లేదన్నది వాస్తవం. 
– డాక్టర్‌ బి.మీనాక్షి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top