జుట్టు సౌందర్యానికి మామిడి ఆకులు.. ఈ విషయాలు మీకు తెలుసా?

Unknown Amazing Benefits Of Mango Leaves In Hair Growth - Sakshi

నోరూరించే మామిడి పళ్లు తినాలంటే వేసవి వచ్చేవరకు ఎదురు చూడక తప్పదు. అయితే మామిడి ఆకులు కోసుకోవడానికి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. అందుకే వివాహాది శుభకార్యాలు, పండుగలు, పర్వదినాలలో గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టుకుంటూనే ఉన్నాం. ఇంతేనా? జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి, ఆరోగ్య సంరక్షణకు కూడా మామిడి ఆకులు ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. మామిడి ఆకులలో జుట్టు కుదుళ్లు బలంగా ఉండటానికి అవసరం అయ్యే కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచే ఎ, ఇ, సి విటమిన్లు ఉండటం వల్ల ఇది సాధ్యం అవుతుందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.

మామిడాకులలో పైన చెప్పుకున్న విటమిన్లతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని ఉపయోగించిన వారికి జుట్టు బాగా పెరుగుతుంది. అంతేకాదు... తలపై మామిడి ఆకులను ఉంచి, వాటిని కప్పుతూ ఏదైనా పలుచని క్లాత్‌ను కట్టుకోవడం ద్వారా తలనొప్పి తగ్గుతుంది. తలలో రక్తనాళాలు దెబ్బతినకుండా ఉంటాయి. రక్త ప్రసరణ పెరుగుతుంది.

మామిడి ఆకుల్లో ఉండే సహజ తైలాలు జుట్టు సంరక్షణకు ఉపకరిస్తాయి. మామిడి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు నెరవకుండా, బలహీనంగా మారకుండా ఉంచుతాయి. మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలూ లేకుండా జుట్టు నల్లగా, ఒత్తుగా తయారవుతుంది. మామిడి ఆకులలో ఉండే ఫ్లేవనాయిడ్లు జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో , నిగారింపు వచ్చేలా చేయడంలో సహాయపడతాయి.

ఎలా ఉపయోగించాలి? 
తాజా మామిడి ఆకులు కొన్ని తీసుకుని కాసిని నీళ్లు చేర్చి మిక్సీలో వేసుకుని లేదా రుబ్బుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. దానికి పెరుగు లేదా ఆలివ్‌ నూనెను చేర్చాలి. ఈ పేస్ట్‌ను చివళ్ల నుంచి కుదుళ్ల వరకు పట్టించాలి. ఆరేదాకా ఉంచి, ఆ తరవాత మైల్డ్‌ షాంపూతో స్నానం చేయాలి.

మామిడి ఆకులను ఎండలో ఎండబెట్టి మెత్తగా పౌడర్‌లా చేసుకోవాలి. తరువాత పేస్ట్‌ లా చేసుకుని బ్లాక్‌ టీని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేస్తే జుట్టుకు మంచి పోషణ అందటంతో పాటు నల్లగా మారుతుంది. 

మధుమేహంతో బాధపడేవారు కొన్ని మామిడి ఆకులను శుభ్రంగా కడిగి నీళ్లలో ఉడకబెట్టి కషాయంలా కాచుకోవాలి. గోరువెచ్చగా అయ్యాక వడపోసి తాగాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top