పర్యాటకుల తాకిడితో బెంబేలెత్తే టాప్‌ 10 ప్రదేశాలివే..! | Tourism: Tourist Attraction More In These Top 10 Countries | Sakshi
Sakshi News home page

పర్యాటకుల తాకిడితో ఉక్కిరిబిక్కిరి అయ్యే టాప్‌ 10 ప్రదేశాలివే..!

Jun 19 2025 1:26 PM | Updated on Jun 19 2025 2:55 PM

Tourism: Tourist Attraction More In These Top 10 Countries

తిండి ఎక్కువై ఒకడు ఏడిస్తే..తిన్నదరక్క మరొకడు ఏడ్చాడనేది సామెత కావచ్చు కానీ...ఎప్పటికీ కళ్లకు కట్టే వాస్తవం కూడా అదే. ప్రపంచంలో అనేక దేశాలు టూరిజం అభివృద్ధికి రోజుకో ప్లాన్‌ వేస్తూ నానా తంటాలు పడుతున్నాయి. అదే సమయంలో కొన్ని దేశాలు మాత్రం టూరిస్ట్‌లను ఎలా నియంత్రించాలా ఆని తలలు పట్టుకుంటున్నాయి. పర్యాటకుల వల్ల ఆదాయం సంగతి దేవుడెరుగు ముందు తమ దేశాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆలోచిస్తున్నారు. అలాంటి దేశాల గురించి ఒకసారి పరిశీలిస్తే... గత 2024–25 గణాంకాల ప్రకారం చూస్తే...ప్రపంచపు టాప్‌ 10 పర్యాటక దేశాలు..

ఫ్రాన్స్‌: ఈ పర్యాటకుల కలల రాజ్యం..గత ఏడాది  89.4మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులతో ప్రధమ స్థానంలో ఉంది. అయితే పర్యాటకుల సంఖ్య తగ్గడంతో ఆ దేశం హమ్మయ్య అనుకుంటూ ఊపిరిపీలుస్తోంది.  ప్రపంచ వ్యాప్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఈ దేశం అంతకు ముందు ఏడాది 2023లో పర్యాటకుల సంఖ్య 100మిలియన్లకు చేరి రికార్డ్‌ సృష్టించగా, ఆ తర్వాత చేపట్టిన నియంత్రణ చర్యలతో ఆ సంఖ్య తిరోగమించింది.

స్పెయిన్‌: ఈ దేశం గత ఏడాది  83.7మిలియన్ల పర్యాటకులతో 2వ స్థానంలో నిలిచింది.  ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో రకరకాల ఆకర్షణలతో గత ఆరేళ్లుగా రికార్డు సంఖ్యలో పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది.

అమెరికా: అగ్రరాజ్యం అమెరికా కూడా పర్యాటకుల రద్దీకి గురవుతోంది. గత ఏడాది 79.3మిలియన్ల మందిని ఆకర్షించింది. ట్రంప్‌ సర్కారు విధానాలతో ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య ఇప్పటికే తగ్గినట్టు కనిపిస్తోంది.

చైనా: అత్యధిక జనాభా కలిగిన ఈ దేశం అత్యధిక టూరిస్ట్‌ల రాకతో ఇబ్బందులు పడుతోంది. ఈ దేశాన్ని గత ఏడాది 65.7 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారు.

ఇటలీ: రోమన్‌ చరిత్ర, వైన్, కళలకు నిలయం లాంటి ఈ దేశం గత ఏడాది 64.5 మిలియన్ల పర్యాటకుల్ని రాబట్టింది. దీంతో ప్రస్తుతం టూరిజం ప్రమోషన్‌ కార్యక్రమాలు తగ్గాయి.

టర్కీ: ఇస్తాంబుల్, కేప్‌ పా, క్యాపాడోసియా వంటి ప్రదేశాలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ దేశం గత ఏడాది 51.2 మిలియన్ల టూరిస్ట్‌లతో 6వస్థానంలో నిలిచింది. అయితే  భారత దేశంతో తెచ్చుకున్న అకారణ శతృత్వం ఈ ఏడాది పర్యాటకుల సంఖ్యను గట్టిగా ప్రభావితం చేయవచ్చు.

మెక్సికో: బీచ్, సంస్కృతి, పురాతత్వ ప్రదేశాలతో  పాటు చవులూరించే వంటకాలకూ పేరొందిన ఈ దేశం... గత ఏడాది 45.మిలియన్ల మందిని ఆకర్షించింది.  

థాయ్‌లాండ్‌: ఇటీవలే మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని కూడా దక్కించుకున్న ఈ దేశానికి ల్యాండ్‌ ఆఫ్‌ స్మైల్స్‌గా పేరుంది. గత ఏడాది 39.8 మిలియన్ల టూరిస్ట్‌లను తన ఖాతాలో వేసుకుంది.

జర్మనీ: తరచుగా బీర్‌ ఉత్సవాలు, చారిత్రక నగరాలతో అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచే ఈ దేశాన్ని గత ఏడాది సందర్శంచిన పర్యాటకుల సంఖ్య 39.6 మిలియన్లు. 

యు.కే..లండన్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్‌ ఐర్లాండ్‌ వంటి ఐకానిక్‌ ప్రాంతాలతో పర్యాటకుల్ని కట్టి పడేస్తున్న యునైటెడ్‌ కింగ్‌డమ్‌... గత ఏడాది 39.6 మిలియన్ల మందిని తన దేశానికి రప్పించింది.

గత 2024–25 గ్లోబల్‌ పర్యాటక గణాంకాలలో  అగ్రస్థానాల్లో యూరోప్‌ – ఉత్తర అమెరికా దేశాలు నిలుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.  మిగిలిన దేశాల పరిస్థితి ఎలా ఉన్నా... టాప్‌ 10లో.. తీవ్రమైన పర్యాటకుల రద్దీతో స్పెయిన్, ఫ్రాన్స్‌, జపాన్‌ వంటి దేశాలకు తీవ్రమైన ఇబ్బంది కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. జవనవ్యయం, ధరలు పెరిగి, జీవన నాణ్యతకు ముప్పు ఏర్పడుతోంది. దీంతో ఈ పరిస్థితిని విరోధించాలనే స్థానికుల డిమాండ్‌ మేరకు నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.

(చదవండి: అత్యంత కాలుష్యరహిత హిల్‌స్టేషన్‌.. ! మన తెలుగు రాష్ట్రాలకు దగ్గర్లోనే...)

Advertisement
 
Advertisement
Advertisement