ఈ యాడ్స్‌లో నటించిన సెలబ్రిటీలు వీళ్లే..

Top Advertisements: Behind Stories - Sakshi

అట్టర్లీ బట్టర్లీ... కార్టూన్స్‌ అంటే కళ్లను టీవీకి కట్టేసే పిల్లలు కమర్షియల్స్‌నూ కన్నార్పకుండా చూస్తారు..  తెలియని బ్రాండ్‌ ఉండదు.. కంఠతా రాని  డైలాగ్స్, జింగిల్స్‌ ఉండవు.. అందులో పిల్లలు కనిపించే ప్రకటనలైతే చెప్పక్కర్లేదు.. ఆ చైల్డ్‌ మోడల్స్‌ను చైల్డ్‌హుడ్‌ ఫ్రెండ్స్‌లాగే భావించిన తరమూ ఉంది! ఆ జ్ఞాపకాలు మెదడు పొరల్లోనే ఉండిపోకుండా మనసుకూ మారుతూ తాజా పరుస్తున్నాయి. నాటి లిటిల్‌ స్టార్స్‌ నేడు ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో అన్న కుతూహలాన్ని కలిగిస్తున్నాయి.. ఫేస్‌బుక్‌లో సెర్చ్‌ చేసి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాలన్నా.. వాళ్ల అసలు పేర్లు తెలియాలి.. మొహాలను పోల్చుకోగలగాలి.. కదా.. అందుకే ఆ పాత రోజులను...వాళ్ల ప్రెజెంట్‌ స్టేటస్‌ను పట్టుకొని వచ్చిందే ఈ కథనం.. ఈ అక్షరాల వెంట బాల్యాన్ని చేరుకోండి.. వర్తమానాన్నీ అందుకోండి. 

దేశంలో శ్వేత విప్లవానికి ప్రతీక అమూల్‌ పాలు.. పాల ఉత్పత్తులు. ఆ రోజుల్లో బొద్దుగా, ఆరోగ్యంగా ఉన్న ఏ పాపాయి కనపడ్డా ‘వావ్‌.. అమూల్‌ బేబీ’ అనుకునేవాళ్లట అసంకల్పితంగా. తల్లి పాలకు సమానమైన పోషకాలతో అమూల్‌ పాలు అనే వ్యాఖ్యతో ఆ బ్రాండ్‌ పాపులర్‌ అయింది. స్ట్రాంగ్‌ ఇండియాకు గుర్తుగా మారుమోగింది. అలాంటి అమూల్‌కు తొలి బేబీ మోడల్‌ .. ఫస్ట్‌ అమూల్‌ బేబీ ఎవరో తెలుసా? ప్రముఖ కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ సోదరి. కలర్‌లో మొదలైన అమూల్‌ యాడ్‌ ఫస్ట్‌ అమూల్‌ బేబీ కూడా శశి థరూర్‌ మరో చెల్లెలు. అది 1961 నాటి సంగతి. పాల వెల్లువ (శ్వేత విప్లవం) మొదలైన తొలినాళ్లలో అమూల్‌ పాల పొడి ప్యాకెట్‌ మీద మోడల్‌ కోసం పండంటి పాపాయిని వెదికే పనిలో పడింది అమూల్‌ అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీ. ఏడువందల పన్నెండు మంది పిల్లల ఫొటోలను పరిశీలించింది. రాజీ పడలేదు. మరిన్ని ఫొటోలను పరిశీలించాలనే ఉద్దేశంతో అమూల్‌ అడ్వర్టయిజ్‌ అండ్‌ సేల్స్‌ ప్రమోషన్‌ డైరెక్టర్‌కు శశిథరూర్‌ తండ్రి తెలిసి ఉండడంతో అతణ్ణి కలిశాడు.

తన ప్రయత్నం గురించి చెబుతూ ఎందుకైనా మంచిది మీ పిల్లల ఫొటోలు కూడా ఒకసారి చూపించమని కోరాడు. తన కూతురు ఫొటో చూపించాడు. చారెడేసి కళ్లతో.. బొద్దుగా.. ఆరోగ్యంగా ఉన్న ఆ నెలల పాపను చూడగానే ‘అమూల్‌ బేబీ ఫౌండ్‌’ అన్నాడట డైరెక్టర్‌. కట్‌ చేస్తే అమూల్‌స్ప్రేకి మోడల్‌ అయింది ఆ బేబీ. పేరు శోభ. అమూల్‌కి ఫస్ట్‌ బేబీ మోడల్‌గా.. అమూల్‌ అట్టర్లీ బట్టర్లీ డెలీషియస్‌ ప్రకటనల్లో అందరినీ అలరించిన బేబీగా గుర్తుండి పోయింది. థరూర్‌ కుటుంబంతో అమూల్‌ అనుబంధం అక్కడితోనే ఆగిపోలేదు. కలర్‌లో వచ్చిన ప్రకటనకూ మోడల్‌గా ఆ ఇంటి పాపాయినే ఎంచుకున్నారు. తొలి మోడల్‌ శశిథరూర్‌ అక్కయ్య శోభ అయితే కలర్‌లో తొలి మోడల్‌గా శశిథరూర్‌ చెల్లెలు స్మిత ఎంపికైంది. శశిథరూర్‌ కూడా ఆ కుటుంబపు అమూల్‌ బంధాన్ని కొనసాగించారు. ఆయన అమెరికా నుంచి వచ్చాక.. రాజకీయాల్లో చేరాక.. అమూల్‌ కార్టూన్స్‌ క్యాంపెయిన్‌కి మోడల్‌ అయ్యారు. ముంబై, మెరైన్‌ డ్రైవ్‌లోని ఆ హోర్డింగ్స్‌ను చూసి శశిథరూర్‌  ‘ఇప్పుడు మా నాన్నగారు ఉండుంటే తన కొడుక్కూడా  అమూల్‌ మోడల్‌ అయ్యాడని ఆనందపడేవారు’ అని చమత్కరించాడు. ఫస్ట్‌ అమూల్‌ బేబీ శోభ 1977లో ‘మిస్‌ కోల్‌కత్తా’ క్రౌన్‌ గెలుచుకుంది. స్మిత కూడా అందాల పోటీల్లో పాల్గొన ‘మిస్‌ ఇండియా’ రన్నరప్‌గా నిలిచింది. 

సామాన్యుడి స్నాక్స్‌..
పార్లే జీ బిస్కట్స్‌ కవర్‌ మీదున్న పాపాయికి సంబంధించి చాలా వదంతులు ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో ఒకటి.. ఆ పాప ఎవరో కాదు చిన్నప్పటి సుధా మూర్తే అని. సుధా మూర్తి ఎవరో తెలుసు కదా.. ప్రముఖ  రచయిత్రి, ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణ మూర్తి భార్య . రెండో వదంతేమో ఆ అమ్మాయి పేరు నీరూ దేశ్‌పాండే అని, నాగ్‌పూర్‌ నివాసి అని, ఆమె మూడో ఏట వాళ్ల నాన్న ఆ ఫొటో తీసి పార్లే జీ వాళ్లకు పంపితే .. దాన్ని పార్లే జీ వాళ్లు తమ బ్రాండ్‌ మస్కట్‌గా ఉపయోగించుకున్నారని. అయితే నిజం ఏంటంటే.. అదొక కల్పిత చిత్రం.  1960లో ఎవరెస్ట్‌ క్రియేటివ్స్‌ అనే సంస్థ దాన్ని చిత్రించింది.

ఐయామ్‌ ఎ కంప్లాన్‌ బాయ్‌.. 
హూ.. ఐయామ్‌ ఎ కంప్లాన్‌ గర్ల్‌.. కంప్లాన్‌ యాడ్‌ అని వేరే చెప్పక్కర్లేదు. కాని ఆ కంప్లాన్‌ బాయ్, కంప్లాన్‌ గర్ల్‌ గురించే చెప్పాలి. ఒక్కసారి ఆ పాత కమర్షియల్‌ను జ్ఞాపకం చేసుకోండి. అందులో అన్నాచెల్లెళ్లుగా నటించిన ఆ ఇద్దరినీ ఇప్పుడు ఈజీగా పోల్చుకోగలుగుతాం. అప్పటి ఆ ఇద్దరి నవ్వులు, ఎక్స్‌ప్రెషన్స్‌ను కాస్త మనసు పెట్టి పరిశీలిస్తే ఇప్పటి ఆ ఇద్దరెవరో ఇట్టే తెలిసిపోతారు. అవును... ఆ కంప్లాన్‌ బాయ్‌.. ‘కబీర్‌ సింగ్‌’ షాహీద్‌ కపూర్‌. మరి కంప్లాన్‌ గర్ల్‌? ఇంకెవర్‌  తెలుగు సినిమా ‘సూపర్‌’ హీరోయిన్‌ ఆయేషా టకియా. చైల్డ్‌ మోడల్‌ దశ దాటాక టీన్స్‌లో వీళ్లిద్దరూ కలసి వీడియో ఆల్బమ్‌లోనూ నటించారు. వీళ్ల సినిమా ప్రయాణాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరూ చూసిందే.. చేస్తున్నదే. 

ఘర్‌ ఘర్‌ కీ రోనక్‌..
...అనగానే 1960, 70ల్లో పిల్లలుగా ఉన్న పెద్దవాళ్లందరికీ గుర్తొచ్చే పదం ‘మర్ఫీ’. ఎస్‌.. ‘మర్ఫీ .. ఘర్‌ ఘర్‌ కీ రోనక్‌.. మర్ఫీ ఘర్‌ ఘర్‌ కీ ఛానక్‌ .. తరహ్‌ తరహ్‌ కే మర్ఫీ రేడియో లా దేతే హై ఘర్‌ మే జాన్‌’ అంటూ మహ్మద్‌ రఫీ పాడిన ఆ వ్యాపార ప్రకటనా గీతం ప్రార్థనా గీతంలా పాపులర్‌ అయిన బాల్యం అది. రేడియోకు పర్యాయపదంగా మారిన మర్ఫీ సృష్టించిన నోస్టాల్జియా ఘనమైనదే. చెక్క ఫ్రేముతో పోర్టబుల్‌ టీవీ పరిమాణంలో ఉండే ఆ కాలపు మర్ఫీ రేడియో ఇంట్లో ఉందంటే ఆ ఇంటి హోదాయే వేరు. మ్యాటీ క్లాత్‌ పరిచిన టేబుల్‌ మీద రేడియో ఉంటుంది ఠీవీగా. ఆ క్లాత్‌ ఆ ఇంటి ఇల్లాలి ఎంబ్రాయిడరీ కళతో మెరిసిపోతూంటుంది. రేడియో మీద దుమ్ము పడకుండా కప్పిన ఊలు కవరూ ఆమె కళానైపుణ్యమే. ఇవన్నీ  మర్ఫీ రేడియో మురిపాన్ని పెంచిన ఆసక్తులైతే.. గర్భిణిలకు కలల బిడ్డగా ముద్దొచ్చిన వాడు.. మర్ఫీ రేడియో మీది బుగ్గల బుజ్జాయి.

ఈ పిల్ల మోడల్‌ ఎంత ఫేమస్‌ అంటే మెటర్నిటీ క్లినిక్స్, ఆసుపత్రులు, బెడ్‌రూమ్స్‌లోని గోడల మీద.. ఆఖరుకు సెలూన్స్‌లో కూడా ఆ బుజ్జోడి ఫొటో క్యాలెండర్లే వేలాడేంతగా. ‘మర్ఫీ మున్నా’గా ప్రసిద్ధుడైన ఈ మోడల్‌ పేరు కాగ్యూర్‌ తుల్కు రిన్‌పోచే. మర్ఫీ యాడ్‌ కోసం నటిస్తున్నప్పుడు రిన్‌పోచే వయసు మూడేళ్లు. స్వస్థలం హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలి. నిజానికి మర్ఫీ కోసం కూడా మొదట్లో ఆడపిల్లనే మోడల్‌గా తీసుకున్నారు. అయితే ఆ అమ్మాయి చనిపోవడంతో అలాంటి పోలికలే ఉన్న పిల్లల్ని వెదుకుతున్న క్రమంలో రిన్‌పోచే కనిపించాడు. అలా రిన్‌పోచే మర్ఫీ మున్నా అయ్యాడు. అదే అతని మొదటి, చివరి వ్యాపార ప్రకటన. ఊహ తెలిసే వయసులో బౌద్ధారామంలో చేరాడు. దాదాపు 20 ఏళ్లు బౌద్ధ భిక్షువుగా ఉన్నాడు. తర్వాత ఢిల్లీకి మకాం మార్చాడు. బాలీవుడ్‌ ఒకప్పటి హీరోయిన్‌ మందాకినిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లకు ఒక పాప కూడా. రిన్‌పోచే ప్రస్తుతం కుటుంబంతో కలసి ముంబైలో ఉంటున్నాడు. 

స్కూల్‌ టైమ్‌...యాక్షన్‌ కా స్కూల్‌ టైమ్‌..
ఆ సబ్‌ హెడ్‌ చూసి అర్థమైపోయి ఉంటుంది.. ఇది యాక్షన్‌ షూ టీవీ కమర్షియల్‌ను గుర్తుకు తెచ్చే కథనం అని. స్కూల్‌ టైమ్‌.. యాక్షన్‌ కా స్కూల్‌ టైమ్‌ అంటూ సాగే పాటలో అల్లరి పిల్లాడుగా వాసికెక్కిన ఆ చైల్డ్‌ మోడల్‌ పేరు తేజన్‌ దివాన్‌జీ.  యాక్షన్‌కే కాకుండా మ్యాగీ, బ్యాండ్‌ ఎయిడ్‌కూ మోడలింగ్‌ చేశాడు 90ల చివరిదాకా. యాక్షన్‌లోని ఆ నాటీ బాయ్‌ ఇప్పుడు బాధ్యతగల డాక్టర్‌.  రేడియేషన్‌ ఆంకాలజీ నిపుణుడు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ మెడికల్‌ సెంటర్‌లో వైద్యాన్ని చదివిన తేజన్‌ అక్కడే బాల్టిమోర్‌లోని అడల్ట్‌ మెడికల్‌ సెంటర్‌లో వైద్యసేవలందిస్తున్నాడు. 

కోల్గేట్‌..
1980ల్లోని పిల్ల తరానికి ఈ కోల్గేట్‌ ప్రకటనలోని బేబీ గుడ్డు.. నచ్చిన మోడల్‌. ఎందుకంటే అందరి పిల్లల్లాగే ఆమే టూత్‌పేస్ట్‌ను టేస్ట్‌ చేస్తుంది. ఇలాంటి సహజమైన పిల్ల చేష్టలతో నాటి చాలా ప్రకటనల్లో కనిపించిన బేబీ గుడ్డు మూడవ యేట నుంచే మోడలింగ్‌ మొదలుపెట్టింది. అసలు పేరు షాహిందా బేగ్‌ అయినా బేబీ గుడ్డుగానే సుపరిచితం. వ్యాపార ప్రకటనల్లోనే కాదు రజని వంటి దూరదర్శన్‌ సీరియళ్లు, సముందర్, ఆఖిర్‌ క్యోం, ఘర్‌ పరివార్, ఇన్‌స్పెక్టర్‌ ధనుష్‌ మొదలైన సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటోంది. ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తోంది. 

గొంతులో కిచ్‌కిచ్‌ ఏం చెయ్యను..
....అనగానే విక్స్‌ బిళ్లలతో కిచ్‌కిచ్‌ పోయేను అంటూ పూర్తిచేస్తారు ఏ తరంలోని పిల్లలైనా. అంత ప్రాచుర్యం ఆ జింగిల్‌.  ఆ లిరిక్స్, ట్యూన్‌ ఎంత క్యాచీయో.. విక్స్‌ బిళ్లలదీ అంతే మజా అయిన రుచి. గొంతులో కిచ్‌కిచ్‌ లేకపోయినా కిచ్‌కిచ్‌ ఉన్నట్టు నటించి పెద్దవాళ్ల దగ్గర్నుంచి ఆ బిళ్లలను చప్పరించాలనే బాల్య చాపల్యం అది. దాన్ని చక్కగా నటించిన బేబీ మోడల్‌ ఇషితా అరుణ్‌. మోడల్‌ జయంత్‌ కృపలానీకి కూతురుగా ఆ యాడ్‌లో మూడేళ్ల ఇషితా నాటి పిల్లలను, పెద్దలను అందరినీ ఆకట్టుకుంది. ఆ ఇషితా అరుణ్‌ ఎవరో కాదు ప్రముఖ నటి, గాయని ఇలా అరుణ్‌ కూతురే. పెద్దయ్యాక ఇషితా కొన్ని మ్యూజిక్‌ ఆల్బమ్స్‌తోపాటు బాలీవుడ్, కోలీవుడ్‌ సినిమాల్లోనూ నటించింది. వైశాలీ సామంత్‌ పాడిన, ఇషితా అభినయించిన ‘ఐక దాజీబా’ అనే ఆల్బమ్‌ సూపర్‌ హిట్‌ అయింది. 

ఐ లవ్‌ యూ రస్నా..
...అంటూ పెదవులకు అంటిన రస్నాను చప్పరిస్తూ ముద్దు  ముద్దుగా పలికిన అమ్మాయిని ఎవరు మరచిపోతారు?! అప్పటి పిల్లలను అమితంగా ఆకట్టుకున్న యాడ్‌ రస్నా. ఒకరకంగా  పిల్లలే ఈ డ్రింక్‌ను ప్రమోట్‌ చేశారనొచ్చు. రస్నా బేబీగా ఫేమ్‌ తెచ్చుకున్న ఆ అమ్మాయి పేరు అంకితా ఝవేరి. తర్వాత తెలుగు, తమిళ, కన్నడభాషల సినిమాల్లో హీరోయిన్‌గానూ కనిపించింది. ‘సింహాద్రి’లోని ఇద్దరు కథానాయికల్లో ఒకరు అంకిత ఝవేరీనే. ఇప్పుడు పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడిందని సమాచారం. 

శుద్ధ్‌ ధారా..
అలిగి ఇంట్లోంచి రోడ్డు మీదకు వచ్చిన అయిదారేళ్ల పిల్లాడికి తమ ఇంటికి ఉత్తరాలు మోసుకొచ్చే పోస్ట్‌ మాస్టర్‌ తారసపడ్తాడు. ‘రామూ కాకా..’ అని పిలుస్తాడు. ‘అరే బబ్లూ ఒక్కడివే ఎక్కడికి వెళ్తున్నావ్‌?’ అని అడుగుతాడు పోస్ట్‌మాస్టర్‌. ‘నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నా’ అంటాడు బుంగమూతితో. ‘అయ్యో .. అవునా. మరి ఇంట్లో అమ్మ వేడివేడి జిలేబీలు చేస్తుందే.. నీకోసం కాదా?’ అంటాడు రాము కాకా ముసిముసిగా నవ్వుతూ. ఆ మాట వినగానే కళ్లింత చేసుకుంటూ ‘జిలేబీలా.. ’ అంటాడు బబ్లూ. ‘ఊ.. ’ అన్నట్టుగా తలూపుతాడు పోస్ట్‌ మాస్టర్‌ అదే నవ్వుతో. ‘అయితే జిలేబీలు తిని వెళ్లిపోతా’ అంటూ ఇంటిదారి పడ్తాడు బబ్లూ. ఇది ‘ధారా’ వంట నూనె వ్యాపార ప్రకటన. ఇందులోని బబ్లూలో తమ పిల్లలను ఊహించుకోని తల్లులు ఉండరు.

అమాయకమైన మొహం.. స్వచ్ఛమైన, స్పష్టమైన వ్యక్తీకరణతో బబ్లూని పోలని పిల్లలు ఉండరు. అంతలా ఆకట్టుకున్న మోడల్‌ బబ్లూ అసలు పేరు పర్జాన్‌ దస్తూర్‌. ఈ అబ్బాయి అనుకోకుండా ‘ధారా’ మోడల్‌ అయ్యాడు. ఈ ‘ధారా’ జిలేబీ యాడ్‌కు పర్జాన్‌ కన్నా కాస్త పెద్దపిల్లాడిని తీసుకుని షూటింగ్‌ కూడా పూర్తి చేశారు. కాని దర్శకుడు ఆచార్యకు ఇంకొంచెం చిన్న పిల్లాడైతే బాగుంటుంది.. ఇంకా అమాయకమైన ఎక్స్‌ప్రెషన్స్‌ వస్తాయేమో అనుకున్నాడు. షూటింగ్‌ చేసిన ఆ పెద్దపిల్లాడికి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చింది పర్జాన్‌. డైలాగులు రికార్డ్‌ చేస్తున్నప్పుడు ‘జిలేబీ’ అనగానే పర్జాన్‌ కళ్లల్లో మెరిసిన మెరుపు ఆచార్యకు గుర్తొచ్చింది.

వెంటనే పర్జాన్‌తో చేయిస్తే ఎలా ఉంటుంది? అని అనుకోవడమే కాదు పర్జాన్‌తో షూటింగ్‌ మొదలుపెట్టేశాడట. ఆచార్య ఊహించినట్టుగానే ‘జిలేబీ’ అనగానే ఆ పిల్లాడి కళ్లల్లో జిలేబీ పట్ల చవులూరే భావం కనిపించింది. 38 టేకులు చేసినా పర్జాన్‌ కళ్లల్లో అదే మెరుపుట. అలా పర్జాన్‌ .. బబ్లూ అయిపోయి అందరి గారాబాలకు పాత్రుడయ్యాడు. వ్యాపార ప్రకటనలకే పరిమితం కాలేదు బాల పర్జాన్‌ ప్రతిభ. సినిమాల్లోనూ కనిపించింది. కుఛ్‌ కుఛ్‌ హోతాహైలో సర్దార్‌ కిడ్‌గా ‘తుస్సీ జా రహే హో.. తుస్సీ నా జావో’ అనే డైలాగ్‌తో వెండితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. గుజరాత్‌ అల్లర్ల మీద వచ్చిన పర్జానియా, మొహబ్బతే, జుబేదా, సికందర్‌ మొదలైన చిత్రాల్లోనూ నటించి ఆ పబ్లిసిటీని కంటిన్యూ చేసుకున్నాడు. ఇది ఇరవై, ఇరవైరెండేళ్ల నాటి మాట.  ఇప్పుడు పర్జాన్‌కు ఇరవై ఎనిమిదేళ్లు. నటుడిగానే కాదు గాయకుడిగా, రచయితగా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తనలోని బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటున్నాడు. 

ది హెల్దీ ఆయిల్‌ ఫర్‌ హెల్దీ  పీపుల్‌ 
...అని జింగిల్‌లోని చివరి పంక్తులను చెప్పినా ఠక్కులన ‘సన్‌డ్రాప్‌ సూపర్‌ రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ఫర్‌ హెల్డీ పీపుల్‌ హెల్దీ ఆయిల్‌’ అంటూ పూర్తిచేస్తారు ఆ బాల్యపు యాదిని దాచిపెట్టుకున్న నేటి పెద్దలు. ఈ జింగిల్‌ పాడుకోగానే కొండలాగా ఉన్న పూరీల చుట్టూ అలవోకగా పల్టీలు కొడుతూ అదే పరిమాణంలోని గులాబ్‌ జామ్స్‌ పై నుంచి జంప్‌ చేస్తుండే పిల్లాడూ గుర్తొస్తాడు. చురుగ్గా.. మెరుపు వేగంతో స్టంట్స్‌ చేసే ఆ చైల్డ్‌ మోడల్‌ పేరు నిశాంత్‌ మెహ్రా. ఆ వయసులోనే అథ్లెట్‌గా రాణించిన మెహ్రా ఇప్పుడు ఫుట్‌బాల్‌ ఆటగాడు. ముంబై ఎఫ్‌సీకి కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 

సర్ఫ్‌ ఆల్ట్రా..
దూరదర్శన్‌తో అనుబంధం ఉన్న తరానికి కునాల్‌ ఖేము సుపరిచితుడు.. సీరియళ్లు, టీవీ కమర్షియల్స్‌తో. సర్ఫ్‌ ఆల్ట్రా చైల్డ్‌ మోడల్, గుల్‌ గుల్షన్‌ గుల్ఫామ్‌ వంటి ధారావాహికలు, సర్, రాజా హిందుస్తానీ, జఖ్మ్, భాయ్, హమ్‌ హై రాహి ప్యార్‌ కే మొదలైన సినిమాల్లో బాలనటుడు కునాల్‌ ఖేము. అయితే నేటి యువతకూ అంతే పరిచయం అతను. భాగ్‌ జానీ, గుడ్డు కీ గన్‌ వంటి సినిమాల్లో హీరోగానే కాదు సైఫ్‌ అలీ ఖాన్‌ చెల్లెలు సోహా అలీఖాన్‌ భర్తగా కూడా. 

ఇదీ ఒకప్పటి లిటిల్‌ స్టార్స్‌ నేటి కథ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top