స్విగ్గీ చేసింది.. ఆమెకు అండగా... ఆరోజులలో సెలవు!

Swiggy to give 2-day paid monthly period leave to female delivery partners - Sakshi

గతంలో జొమాటో తన డెలివరీ విమెన్‌కు సంవత్సరంలో 10 రోజుల బహిష్టు సెలవు ప్రకటించింది. ఆ సెలవులకు జీతం స్పష్టత లేదు. కాని స్విగ్గీ తన డెలివరీ విమెన్‌కు ప్రతి నెల రెండు రోజుల వేతన సెలవు ప్రకటించింది. అసంఘటిత రంగాలలో ఎందరో స్త్రీలు డెయిలీ వేజెస్‌ మీద పని చేస్తున్నారు. వారికి బహిష్టు సమయంలో రెండు రోజుల వేతన సెలవు ఎందుకు ఇవ్వకూడదు? స్విగ్గీ చేసిన ఆలోచన ఎందుకు చేయకూడదు?

ఇంట్లో పనిమనిషిని అందరూ పెట్టుకుంటారు. రోజుకు రెండుపూట్ల రమ్మంటారు కొందరు. ఒకపూట చాలంటారు కొందరు. రోజూ పని చేయిస్తారు కొందరు. ఆదివారం రానక్కర్లేదు అంటారు మరికొందరు. పనిమనిషి అప్పుడప్పుడు పనికి రాదు. పోనీలే అని మొత్తం జీతం ఇస్తారు కొందరు. రాని రోజులకు జీతం కట్‌ చేస్తారు ఇంకొందరు. రాని రోజులకే జీతం కట్‌ చేసేవాళ్లు ఆమె బహిష్టు సమయంలో నలతగా అనిపించో, నొప్పిగా అనిపించో, చిరాగ్గా ఉండో, నీరసం వల్లో పనికి రానంటే జీతం ఇస్తారా? కాని ఇస్తే ఎంత బాగుంటుంది. ఆ ఇంటి యజమానురాలు ఏ ఆఫీస్‌లో అయినా పని చేస్తూ ఉంటే బహిష్టు సమయంలో సెలవు పెట్టుకుంటే ఆమె జీతం ఆమెకు వస్తుంది. కాని పనిమనిషికి రాదు. ఇది సబబా?

పని మనిషి వరకూ అక్కర్లేదు. ఫ్యాక్టరీల్లో డెయిలీ లేబర్‌ ఉంటారు. భవన నిర్మాణరంగంలో స్త్రీలు ఉంటారు. బట్టల షోరూముల్లో, మాల్స్‌లో పని చేసే స్త్రీలు ఉంటారు. వీరందరికీ వారానికి సగం రోజు మాత్రమే సెలవు ఇచ్చేవారున్నారు. ఇక నెలలో ఏ రోజు రాకపోయినా ఆ రోజు జీతం కట్‌. వీరందరూ బహిష్టు సమయంలో కష్టమయ్యి సెలవు పెడితే ఆ రెండుమూడు రోజుల పాటు డబ్బు నష్టపోవాల్సిందే. బహిష్టు అనేది స్త్రీ శరీరధర్మం. ప్రకృతి ధర్మం. ఆ సమయంలో వారికి విశ్రాంతినివ్వడం, ఆర్థికంగా నష్టం జరక్కుండా చూడటం మానవీయ విషయం. కాని బహిష్టు వల్ల సెలవు పెడితేనే విడ్డూరం చాలాచోట్ల. ఇక ఆ సెలవుకు డబ్బు అడిగితే ఇంకేమైనా ఉందా?

కాని ఫుడ్‌ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ రెండు రోజుల క్రితం అందరి చూపు ఆకర్షించింది. దాదాపు 45 నగరాల్లో 45,000 హోటళ్ల నుంచి నెలకు 20 లక్షల ఆహార ఆర్డర్లు సరఫరా చేసే ఈ సంస్థకు దాదాపు లక్షన్నర మంది ఫుడ్‌ డెలివరీ పార్టనర్స్‌ (బాయ్స్‌/గర్ల్స్‌) ఉన్నారు. వారిలో 1000 మంది ఫుడ్‌ డెలివరీ విమెన్‌ ఉన్నారు. ఈ సంఖ్యను 2000కు పెంచాలని స్విగ్గీ అనుకుంది కాని కరోనా వల్ల ఆ భర్తీ మందగించింది. అయితే ఇప్పుడు ఆ సంస్థ తన ఫుడ్‌ డెలివరీ విమెన్‌కు నెలలో రెండు రోజుల వేతన సెలవును ఇస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఆ రెండురోజులు వాళ్లు రెగ్యులర్‌గా కనిష్టంగా రోజువారీ ఎంత కమీషన్‌ పొందుతారో అంత కమీషన్‌ వారికి ఇస్తారు.

‘నాకు పిరియెడ్స్‌. రెండు రోజులు సెలవు కావాలి’ అని మా డెలివరీ విమెన్‌ అడిగితే ఒక్క ప్రశ్న కూడా అడక్కుండా వెంటనే మంజూరు చేసే సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం అని స్విగ్గీ వైస్‌ప్రెసిడెంట్‌ (ఆపరేషన్స్‌) మిహిర్‌ షా ప్రకటించారు. ఆ రెండు రోజులకు జీతం కూడా ఇస్తాం అని ఆయన తెలియచేశారు.

2014లో బెంగళూరులో ఆరు మంది డెలివరీ బాయ్స్‌తో మొదలైన స్విగ్గీ అనతికాలంలో మహా సంస్థగా అవతరించింది. 2016లో పూణెలో మొదటి డెలివరీ ఉమన్‌ ఉద్యోగంలో చేరితే 2019లో చెన్నైలో ఆ తర్వాత ముంబైలో డెలివరీ పార్టనర్స్‌గా చేరడం మొదలెట్టి ఇప్పుడు ఆ సంఖ్య వెయ్యికిపైగా మారింది. ‘మా మహిళా ఉద్యోగులకు ప్రత్యేక యాప్‌ ఉంటుంది. వారు దాని ద్వారా ఎమర్జన్సీ నంబర్‌కు కాల్‌ చేసే వీలు ఉంది. వారికి తక్షణం సహాయం కావాలంటే అందుతుంది. మేము వారి కోసం శుభ్రమైన టాయిలెట్లు కల్పిస్తున్నాము. షెల్‌ పెట్రోల్‌ బంకులతో ప్రత్యేకంగా చేసుకున్న ఏర్పాటు వల్ల మా డెలివరీ విమెన్‌ ఆ బంకుల్లోని టాయిలెట్లను ఉపయోగించుకోవచ్చు. డెలివరీ, ట్రావెల్‌ రంగాల్లో కేవలం బహిష్టు సమస్య వల్ల స్త్రీలు రాకుండా ఉండకూడదు. వారికి సౌకర్యాలు కల్పించాలి. అలాగే ఆ రోజులకు వేతన సెలవు ఇవ్వాలి’ అని స్విగ్గీ ప్రతినిధి ఒకరు అన్నారు.

స్విగ్గీలో పని చేస్తున్న మహిళల్లో దాదాపు 90 శాతం మంది 45 ఏళ్ల లోపువారే. వీరిలో జీవితంలో తొలి సంపాదన స్విగ్గీతో మొదలెట్టిన వారు 24 శాతం మంది ఉన్నారు. తమకు వీలున్న టైమ్‌లోనే పని చేసే అవకాశం ఉండటంతో చేరుతున్నారు. చాలామంది తమ సంపాదన ఇంటి అద్దెకు, కరెంటు బిల్లుకు ఉపయోగిస్తున్నారు. కొంతమంది యువతులు చదువుకోవడానికి.

‘మహిళా డెలివరీ పార్టనర్స్‌కు వాహనాలు లేకపోతే వారి కోసం మా సంస్థ ఎలక్ట్రిక్‌ సైకిల్‌/బైక్‌లను అద్దెకు ఏర్పాటు చేయడానికి ఆయా సంస్థలతో మాట్లాడుతున్నాం’ అని కూడా స్విగ్గీ సంస్థ ప్రతినిధి అన్నారు.

ప్రస్తుతం నగరాల్లో ఫుడ్‌ డెలివరీ సిబ్బంది తమ పెట్రోల్‌ ఖర్చులు పోను 20 వేల నుంచి 25 వేలు సంపాదిస్తున్నారు.

బహిష్టు అనేది స్త్రీ శరీరధర్మం. ప్రకృతి ధర్మం. ఆ సమయంలో వారికి విశ్రాంతినివ్వడం, ఆర్థికంగా నష్టం జరక్కుండా చూడటం మానవీయ విషయం. కాని బహిష్టు వల్ల సెలవు పెడితేనే విడ్డూరం చాలాచోట్ల. ఇక ఆ సెలవుకు డబ్బు అడిగితే ఇంకేమైనా ఉందా?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top