పిల్లలూ..ఈ సమ్మర్‌ ఈ సినిమాలు చూస్తున్నారా..? | Summer Holidays: Childrens Donot Miss These Movies | Sakshi
Sakshi News home page

పిల్లలూ.. ఆ పురాణాల గురించి తెలుసుకోవాలంటే..ఈ సినిమాలు చూడాల్సిందే..!

May 23 2025 9:21 AM | Updated on May 23 2025 9:24 AM

Summer Holidays: Childrens Donot Miss These Movies

పిల్లలూ...భారతం తెలుసా మీకు? రామాయణ, మహాభారతాలుమన తొలి పాఠ్యపుస్తకాలు. మీకు పదేళ్లు దాటితే ఈ రెండూ ఏదో ఒక మేరకు తెలిసుండాలి. వినడం, చదవడం ద్వారా మాత్రమే కాక చూడటం వల్ల కూడా భారతం తెలుసుకోవచ్చు. స్కూళ్లు తెరవడానికి ఇంకా రెండు వారాలుంది. భారతం మీద వచ్చిన సినిమాలు వరుసపెట్టి చూడండి చాలు. ఆ లిస్టు ఇవాళ ఇస్తున్నాం. రేపు రామాయణం సినిమాల లిస్ట్‌ ఇస్తాం. 

పిల్లలూ...మహాభారతం అంటే పాండవులకు కౌరవులకు మధ్య వార్‌ అని మాత్రమే అనుకుంటున్నారా మీరు? మహాభారతంలో ఎన్నో ఎపిసోడ్స్‌ ఉన్నాయి, క్యారెక్టర్స్‌ ఉన్నాయి, వీరత్వాలూ శూరత్వాలూ ఉన్నాయి, చీటింగ్‌ ఉంది, నిజాయితీ ఉంది, ట్రూత్‌ కోసం నిలబడిన వారు ఉన్నారు, గొప్ప విమెన్‌ ఉన్నారు, ఆటవిక వీరులున్నారు... వీరందరినీ మీరు తెలుసుకోవాలి.

మహాభారతంలో పాండవులు రాజ్యం కోల్పోయి అరణ్యవాసం చేస్తారు. అజ్ఞాతవాసం కూడా చేస్తారు. కొన్ని సందర్భాల్లో లైఫ్‌లో ఇలాంటి సవాళ్లు వస్తాయి. పాండవులు భయపడలేదు. అరణ్యవాసం చేసి, అజ్ఞాతవాసం చేసి మళ్లీ యుద్ధం చేసి గెలిచారు. అరణ్యవాసం అంటే అడవుల్లో ఉండటం, అజ్ఞాతవాసం అంటే ఐడెంటిటీని దాచి బతకడం.

ఇవాళ ప్రపంచంలో చాలా చోట్ల వార్స్‌ జరుగుతున్నాయి. వార్‌ను ప్రజలు కోరుకోరు. పాలకులే కోరుకుంటారు. వాళ్లకు కావాల్సినదాని కోసం కొట్లాడుకుంటారు. కాని వార్‌ని ఆపడానికి కొంతమంది ట్రై చేస్తారు. పీస్‌ అంబాసిడర్స్‌గా మారి వార్‌ వద్దని మంచి మాటలు చెబుతారు. భారతంలో కృష్ణుడు అలా పాండవులకు, కౌరవులకు రాయబారం చేయాలని చూశాడు. 

కాని కుదరలేదు. మహాభారతంలో ద్రోణుడు వంటి గొప్ప టీచర్‌ ఉన్నాడు. శకుని వంటి విలన్‌ ఉన్నాడు. మాట వినని, మొండికేసే దుర్యోధనుడున్నాడు. వీళ్లందరి నుంచి మనం నేర్చుకోదగ్గ లెసన్స్‌ ఉంటాయి.  అలాగే మహాభారతంలో కుంతి, ద్రౌపది, సుభద్ర... వంటి గొప్ప స్త్రీ పాత్రలను మనం తెలుసుకోవాలి.

మహాభారతాన్ని పిల్లల కోసం సులభంగా అర్థమయ్యేలా కొన్ని పుస్తకాలు రాశారు. అవి తెప్పించుకుని చదవండి. లేదా సినిమాలు చూసి కూడా భారతాన్ని తెలుసుకోవచ్చు. ఎంజాయ్‌ చేయొచ్చు. సెలవులు కొన్నాళ్లే మిగిలాయి. ఈ సినిమాలు చూసేయండి మరి. అన్నీ యూట్యూబ్‌లో ఉన్నాయి.

1. బాలభారతం: ఇది 1972లో వచ్చిన తెలుగు సినిమా. పాండవుల, కౌరవుల చైల్డ్‌హుడ్‌ ఇందులో ఉంటుంది. అందరూ పిల్లలే నటించారు.

2. మాయాబజార్‌: ఇది తప్పకుండా చూడాల్సిన క్లాసిక్‌. ఇందులో ఘటోత్కచుడు స్పెషల్‌ అట్రాక్షన్‌. ఈ కథ భారతంలో లేదుగానీ ఇందులో ఉన్నవన్నీ భారతంలోని క్యారెక్టర్లే. దుష్ట చతుష్టయం అనే నలుగురు ఎవరో ఈ సినిమాలో చూడొచ్చు. చెడు ఆలోచనలు చేస్తే చెడు ఫలితమే వస్తుందని తెలుసుకుంటారు.

3. భీష్మ: మహా భారతంలో భీష్ముడు చాలా ముఖ్యమైన పాత్ర. మహాభారతంలో ఆది నుంచి అంతం వరకూ ఆయన ఉంటాడు. ఆయన మీద తీసిన సినిమా ఇది. పెద్దవాళ్లను తోడు చేసుకుని డౌట్స్‌ అడుగుతూ ఈ సినిమా చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి.

4. నర్తన శాల: ఇది పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు జరిగిన కథ. పాండవుల్లో భీముడు ఎంత బలం కలిగినవాడో ఈ సినిమాలో చూడొచ్చు. అలాగే కీచకుడు అనే క్యారెక్టర్‌ ఉంటుంది. బ్యాడ్‌ క్యారెక్టర్‌. ఉమెన్‌తో మిస్‌ బిహేవ్‌ చేసి తగిన పనిష్మెంట్‌ పొందుతాడు. తప్పకుండా చూడండి.

5. వీరాభిమన్యు: భారతంలో అభిమన్యుడు అద్భుతమైన పాత్ర. పద్మవ్యూహంలోకి చొచ్చుకు వెళ్లి గొప్పగా పోరాడుతాడు. కాని తిరిగి రావడం తెలియక మరణిస్తాడు. అతని మీద తీసిన సినిమా ఇది.

6. పాండవ వనవాసము: పాండవులు వనవాసం చేసినప్పుడు అంటే అడవుల్లో ఉన్నప్పుడు ఏమేమి ఘటనలు జరిగాయో ఈ సినిమా చూపిస్తుంది.

7. దానవీరశూర కర్ణ: మహాభారతాన్ని ఒక్కొక్కరు ఒక్కో పర్స్‌పెక్టివ్‌లో చూస్తారు. ఈ సినిమా కర్ణున్ని ఒక వీరుడుగా, శూరుడుగా చూపుతుంది. అతను దానం ఇవ్వడంలో మేటి అట. అలాగే అతను పొందిన అవమానాలను ఎలా తట్టుకున్నాడో కూడా ఈ సినిమా చూపుతుంది. కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చేస్తాడు. వాళ్లిద్దరూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. యుద్ధ సమయంలో ఫ్రెండ్‌ పక్షాన నిలవడం అతని ధర్మం. ఈ సినిమా తప్పక చూడండి.

8. ఏకలవ్య: ఏకలవ్య శిష్యరికం అని మీరు సామెత వింటూనే ఉంటారు కదా... ద్రోణుడి బొమ్మ పెట్టుకుని విలువిద్య నేర్చుకుంటాడితను. అర్జునుడిని మించిన విలుకాడితను. ద్రోణుడు గురుదక్షిణ అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా బొటనవేలు కోసి ఇచ్చేస్తాడు. 

అన్నట్టు పిల్లలూ... ఈ సినిమాల్లో భాష మీకు పూర్తిగా అర్థం కాక΄ోవచ్చు. ఇందులో గ్రాంథిక తెలుగు ఉంటుంది. అయినా సరే చూస్తూ ఉంటే భాష కూడా మీకు తెలుస్తుంది. తెలుగు గొప్ప భాష. అందులో ఎన్నో స్థాయులు ఉన్నాయి. అన్నింటితో మనకు పరిచయం ఉండాలి. ఇంకెందుకు ఆలస్యం. మీ అమ్మతోనో నానమ్మతోనో కలిసి భారతం సినిమాలు చూడటం మొదలుపెట్టండి. 

(చదవండి: చిన్నారులు పజిల్స్‌ ఎందుకు చేయాలో తెలుసా..!)
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement