ఆమె కాళ్ల కింద తారు కరుగుతోంది. నెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అయినా రాజస్థాన్ అజ్మీర్ బిడ్డ సూఫియా సూఫీ పరిగెడుతూనే ఉంది. ‘రన్ ఫర్ డ్రీమ్స్’ పేరుతో భారత సాయుధ దళాల గౌరవార్థం కన్యాకుమారి నుంచి హిమాలయాల్లోని కారకోరం రేంజ్ వరకు 5,000 కిలోమీటర్ల పరుగును 88 రోజుల్లో పూర్తి చేయడానికి బయలుదేరింది. ఒంగోలు మీదుగా సాగుతున్న పరుగులో ఆమె ప్రతి అడుగు సైనికునికి శాల్యూట్ పలుకుతోంది.
‘పరుగు నాకు ధ్యానం లాంటిది. నేను పరిగెత్తిన ప్రతి అడుగు నన్ను శక్తిమంతం చేసింది’ అంటుంది సూఫియా. భగభగలాడే ఎండల్లో, పొగలు కక్కే హైవే మీద ఆమె పరిగెడుతూ ఒంగోలు మీదుగా ముందుకు సాగుతూ కనిపించింది. సాధారణంగా అటువంటి వాతావరణంలో బయటకు రావడమే కష్టం. పరుగు తీయడం అసాధ్యం. ‘అయినా నేను ఆగను. సైనికులకు అంకితం ఇచ్చే వరకు నా పరుగు ఆపను’ అన్నారామె.
‘రన్ ఫర్ డ్రీమ్స్’ పేరుతో సూఫియా మే 12, 2026న కన్యాకుమారి వద్ద పరుగు మొదలుపెట్టింది. 88 రోజుల పాటు నిరవధికంగా పరిగెత్తి, పదకొండు రాష్ట్రాలు, యుద్ధ స్మారకాలు దాటి, 18,000 అడుగుల ఎత్తున కారకోరం పాస్ వద్ద ఆగస్టు 6న ఆ పరుగును ముగించనుంది. ఆ విధంగా సైనికులకు తన పరుగును అంకితం చేయనుంది. వారికి పాదాభివందనం చేయనుంది.
ప్రశాంతత కోసం పరుగు
సూఫియా సూఫీది రాజస్థాన్‌లోని అజ్మీర్. పదహారేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. ఢిల్లీ విమానాశ్రయంలో బ్యాగేజ్ హ్యాండ్లింగ్ ఆఫీసర్‌గా పదేళ్లు పనిచేసింది. ‘మరబొమ్మలాంటి ఆ జీవితం నా ఆరోగ్యాన్ని నాశనం చేసింది’ అంటుందామె. ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి, ప్రశాంతత కోసం పార్కులో రోజూ మూడు కి.మీ. పరుగు మొదలుపెట్టింది. అది కాస్తా అలవాటుగా, అలవాటు ఫ్యాషన్ గా,ఫ్యాషన్ జీవిత లక్ష్యంగా మారిపోయింది. ఉద్యోగాన్ని వదిలేసి, 2019లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 4,000 కి.మీ పరిగెత్తి మొదటి గిన్నెస్ రికార్డ్ కొట్టింది. ఆ తర్వాత ఆల్ట్రా మారథాన్ రన్నర్‌గా పరిగెడుతూనే
ఉంది.
ప్రజల తోడు
‘నేను రోజుకు అరవై నుంచి అరవై అయిదు కిలోమీటర్లు పరిగెత్తుతున్నాను. మొదటి పది రోజులు ఎండల వల్ల చాలా కష్టంగా గడిచింది. తమిళనాడు, ఆంధ్రలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల తెల్లవారుజాము నాలుగు నుంచి ఉదయం 9.30 వరకు.. సాయింత్రం నాలుగున్నర నుంచి రాత్రి 9 వరకు పరుగు పెడుతున్నాను. రోజురోజుకూ వేగాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాను. దారి మధ్యలో కొందరు రన్నర్లు నాపై అభిమానాన్ని చూ పారు. సంఘీభావంగా నాతో పరిగెత్తారు. చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, వృద్ధులు నాతో పరిగెత్తారు. ఇంతకు మించి ఏం కావాలి’ అంటుంది సూఫియా.
శరీరానికి నచ్చ చెప్తూ...
‘రోజుకు 15 గంటల పాటు పరిగెడుతుండటంతో నా శరీరం హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. అయినా దానిని సముదాయిస్తూ ఓర్పుగా ముందుకు కదులుతున్నాను. నేను ఐదు గిన్నిస్ రికార్డులు సాధించడానికి నా భర్త వికాస్ సహకారం మరువలేనిది. అనుక్షణం నన్ను నా పరుగులో జాగ్రత్తగా గమనిస్తూ ఆహారంలో, పరుగులో సూచనలు, సలహాలు ఇస్తుంటాడు. మహిళలు ఏమీ చేయలేరు, వాళ్లందరూ శక్తిహీనులేనని చాలామంది అంటుంటారు. స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించదలచుకున్నాను. ఈ ఆధునిక సాంకేతిక యుగంలో మహిళలకు అన్ని అవకాశాలు లభిస్తున్నాయి. స్త్రీలు తాము అనుకున్న లక్ష్యాలను సాధించడానికి అన్ని అడ్డంకులను పటాపంచలు చేయాలి. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం’ అని హరిణిలా దూసుకుపోయారామె.
సైనికుల అభిమాని
సూఫియాకు పరుగు ఒక క్రీడ కాదు. దేశభక్తిని చాటే మార్గం. భారత సాయుధ దళాలు అత్యంత కఠిన పరిస్థితుల్లో దేశాన్ని కా పాడుతున్నాయని చెప్పడానికి కఠినమైన దారుల్లో సూఫియా పరుగు నిర్వహిస్తూ ఉంటుంది. 2022లో సియాచిన్ నుంచి కార్గిల్ వరకు ఎముకలు గడ్డ కట్టే స్థితిలో పరిగెత్తిన మొట్టమొదటి మహిళగా నిలిచింది. 2023లో మనాలి–లేహ్ మధ్య 480 కి.మీ దూరాన్ని 98 గంటల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ‘రన్ ఫర్ డ్రీమ్స్’లో భాగంగా సముద్ర మట్టానికి 5,540 మీటర్లు ఎత్తున లేహ్‌కు ఉత్తరంగా భారత్–చైనా సరిహద్దులో ఉన్న కారకోరం వరకూ పరిగెత్తనుంది. ‘సైనికుల కష్టం ముందు నా పరుగు నొప్పి చాలా చిన్నది’ అంటుంది సూఫియా. – కె. గంగాధర్, సాక్షి, ఒంగోలు డెస్క్


