కన్యాకుమారి.. భారతీయులకు సుపరిచిత ప్రాంతం..! తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా దక్షిణ భాగంలో ఉన్న విలవన్‌కోడ్ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇందుక్కారణం.. ఆ ప్రాంతం రబ్బరు పరిశ్రమలకు నెలవు. యాలకులు, లవంగాలు సుగంధ ద్రవ్యాల పంటలకు కేరాఫ్ అడ్రస్..! అంతేకాదు.. చారిత్రక చిత్తరల్ కొండ ఆలయం, తిక్కురిచి మహాదేవ ఆలయం, నట్టాలం శంకరనారాయణ దేవస్థానం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికలు టఫ్‌గా సాగుతున్నాయి. అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకుపోతున్నా.. గెలుపోటములను ఏమాత్రం అంచనా వేయని పరిస్థితులున్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా?
కన్యాకుమారి జిల్లాలో ప్రధాన వాణిజ్య పట్టణమైన మార్తాండంతోపాటు.. కుళితురై, కలియక్కవిలై, అరుమనై వంటి ప్రముఖ ప్రదేశాలు విలవన్‌కోడ్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. కొండప్రాంతమైన కొడియార్ కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతాల్లో రబ్బరు తోటలు సమృద్ధిగా ఉన్నాయి. రబ్బరు ప్రాసెసింగ్ పరిశ్రమలకు విలవన్‌కోడ్ అడ్డా అని చెప్పవచ్చు. జీడిమామిడి తోటలు కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. కేరళ, తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో పండే జీడిమామిడి ప్రాసెసింగ్ మిల్లులు కూడా విలవన్‌కోడ్‌లో ఉన్నాయి.
ఈ నియోజకవర్గంలో నాడర్ సామాజికవర్గం మెజారిటీగా ఉంది. వీరి తర్వాత నాయర్లు, ఈలవలు, వెల్లలార్లు, ఎస్సీలు, ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌తోపాటు.. సీపీఎం, బీజేపీలకు మంచి క్యాడర్ ఉందని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ 11 సార్లు, సీపీఎం ఐదు సార్లు విజయం సాధించగా.. బీజేపీ క్రమంగా తన ఓటుబ్యాంకును పెంచుకుంటూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు ఎక్కువ. పురుష ఓటర్ల సంఖ్య ఒక లక్షా 11 వేల 990 కాగా.. మహిళా ఓటర్లు ఒక లక్షా 13 వేల 226 మంది ఉన్నారు. ముగ్గురు థర్డ్ జెండర్లు కూడా ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.
ఈ నియోజకవర్గ ప్రజల చిరకాల డిమాండ్ అయిన.. రబ్బర్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు హామీపై అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతీ ఎన్నికల్లో ఈ హామీ పేరుతో ప్రధాన పార్టీలు తమను మోసగిస్తున్నాయనే భావన ఇక్కడి ఓటర్లలో ఉంది. దీంతోపాటు.. జీడిమామిడి మిల్లుల అప్‌గ్రేడేషన్, జీడిమామిడి కార్మికుల రోజుకూలీ పెంపు వంటి డిమాండ్లు పేద, మధ్యతరగతి వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇక్కడ అటవీ చట్టానికి సంబంధించిన సమస్యలతోపాటు.. నెయ్యర్ ఎడమగట్టు కాల్వలో నీటి విడుదల లేకపోవడం వంటి ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. తమిళనాడు అంటేనే.. అయితే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లు రాజకీయాలు కొనసాగుతాయి. ఈ నియోజకవర్గంలో మాత్రం.. ఆ రెండు పార్టీల ప్రాబల్యం కనిపించదు. అయితే.. రబ్బర్ ప్రాసెసింగ్ పార్క్ హామీని నెరవేరుస్తామంటూ బీజేపీ.. కాంగ్రెస్ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.


