మోకాళ్ల నొప్పులా.. ఈ పనులు చేయకండి

Suffering With Knee Pain Here Are Solutions - Sakshi

మోకాళ్ల నొప్పులతో బాధపడేవారిలో చాలామంది తాము ఎక్కువగా నడుస్తూ ఉంటే మోకాళ్ళు మరింతగా అరిగిపోతాయేమోనని, దాంతో నొప్పులు మరింతగా పెరుగుతాయేమోనని అపోహపడుతుంటారు. వాస్తవానికి ఇది కేవలం అపోహ మాత్రమే. నిజానికి మన మోకాళ్ల కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే, ఆ భాగంలో అంతగా రక్తప్రసరణ జరుగుతుంది. అలా రక్తప్రసరణ పెరగడం వల్ల కీళ్లకు మంచి పోషణ అందుతుంది. 

రాబోయే కాలం అనువైన సమయం... 
కొద్దిరోజుల్లోనే చలికాలం ముగియబోతోంది. చలి క్రమంగా తగ్గిపోయి ఉదయం వేళ, సాయంత్రం పూట నడకకు ఆస్కారం ఇచ్చే వాతావరణం... అంటే... అంతగా చలీ, అంతగా వేడీ లేని మంచి వాతావరణం మరో రెండు నెలలూ ఉండబోతోంది. అందుకే వీలైతే వెంటనే  రోజుకు కొంతసేపు నడకకు కేటాయించండి. పది నిమిషాలు వ్యవధితో మొదలు పెట్టి క్రమంగా 40 – 60నిమిషాల వరకూ వాకింగ్‌ సమయాన్ని పెంచుతూ పొండి. నడక వల్ల మీ మోకాళ్లపై మీ దేహభారం పడుతుందని అనిపిస్తే...ఒకే చోట కూర్చుని చేసే  సైక్లింగ్‌ కూడా చేయవచ్చు.  

నొప్పులు తగ్గేందుకు ఉపయోగపడే ఉపకరణాలివి...
మోకాలిలో నొప్పులు లేకుండా ఉండటానికి / నొప్పులు తగ్గడానికి నీ గార్డులు, క్రేప్‌ బ్యాండేజీలు, మోకాళ్ల వద్ద బిగుతుగా ఉంచే సపోర్టింగ్‌ సాక్స్, చిన్న బ్రేసెస్‌ ఇలాంటి కొన్ని ఉపకరణాలను అవసరమైన వారికి ఆర్థోపెడిక్‌ నిపుణులు సూచిస్తారు. అయితే పనుల్లో భాగంగా మోకాలిపైన భారం పడుతున్న సమయంలో మాత్రమే వీటిని ధరించాలి. లేదా డాక్టర్‌ సూచనలకు అనుగుణంగా మాత్రమే వీటిని ఉపయోగించాలి. 

ఈ పనులు చేయకండి... 
మోకాళ్ల నొప్పులున్నవారు ఇక్కడ పేర్కొన్న పనులేవీ చేయకూడదు. అవేమిటంటే... ఒక అంతస్తు కంటే ఎక్కువగా మెట్లు ఎక్కి దిగడం వద్దు. ఎగుడు–దిగుడుగా ఉండే నేలపై నడవద్దు. నడక వ్యాయామం సమయంలోనూ సమతలంగా ఉండే నేలపైనే నడవండి. నేలపై కాళ్లు రెండూ మడత వేసుకుని కూర్చోవడం / లేవడం (స్కాటింగ్‌) చేయకండి.  గొంతుక్కూర్చొని బరువైన వస్తువలేవీ ఎత్తకండి. 

నొప్పులు తగ్గకపోతే... 
పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటున్నా... నడక మొదలుపెట్టిన వారం లేదా రెండు వారాల్లో తగ్గకపోయినా ఆర్థోపెడిక్‌ నిపుణుడిని సంప్రదించండి. వారు మీ మోకాళ్ళను ఎక్స్‌–రే తీసి, అవి ఏ మేరకు అరిగాయి అన్న విషయం తెలుసుకుంటారు. దాన్ని బట్టి మీకు ఎలాంటి వైద్య చికిత్స అవసరమో నిర్ణయిస్తారు. అవసరాన్ని బట్టి మందులతోపాటు ఫిజియోథెరపీని కూడా సూచించవచ్చు. ఫిజియోథెరపీలో కండరాలు, ఎముకలు గట్టిపడి వాటి కదలికలు మెరుగుపడతాయి.  ఫిజియో అంటే మళ్లీ వ్యాయామాలే. కాబట్టి ఈ సారి క్రమంగా మీ నొప్పులు తగ్గుతూ మళ్లీ వ్యాయామం వైపునకు మళ్లే అవకాశం ఉంటుంది.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top