Sudha Ravi: రెండ్రోజుల్లో ఫంక్షన్‌.. మూడు రోజుల్లో పెళ్లి.. సుధా రవికి చెప్పారా? ఆమె స్పెషాలిటీ ఏంటి?

Sudha Ravi Rangoli With Cream Sticks Enter Singapore Book Of Records - Sakshi

స్కూల్లో ఇంకో రెండు రోజుల్లో ఫంక్షన్‌ జరగబోతోంది... ‘సుధా రవికి చెప్పారా?’ అనే ప్రశ్న చెవులకు వినిపిస్తుంది. మూడురోజుల్లో పెళ్లి జరగబోతుంది... ‘సుధా రవికి తెలియజేశారా’ అనే ప్రశ్న ఎదురు వస్తుంది. ఇంతకీ ఎవరీ సుధా రవి?

ఒక్కమాటలో చెప్పాలంటే ‘రంగోలి స్పెషలిస్ట్‌’ ఎవరి రంగోలి ద్వారా శుభకార్యాల వేదికలకు కొత్తకళ వస్తుందో...ఆమె పేరే సుధా రవి. తాజాగా కూతురు రక్షితతో కలిసి రూపొందించిన రంగోలితో ‘సింగపూర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోకి ఎంటర్‌ అయిందామె...

సుధా రవి తన కూతురు రక్షితతో కలిసి 26,000 ఐస్‌క్రీమ్‌ పుల్లలను ఉపయోగించి రూపొందించిన రంగోలి ఆర్ట్‌ వర్క్‌ ‘సింగపూర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోకి ఎంటర్‌ అయింది. సింగపూర్‌లోని లిటిల్‌ ఇండియా షాప్‌కీపర్స్‌ అండ్‌ హెరిటేజ్‌ అసోసియేషన్‌(లిషా) ఆధ్వర్యంలో జరిగిన పొంగల్‌ వేడుకల్లో భాగంగా ఈ సిక్స్‌ బై సిక్స్‌ మీటర్‌ ఆర్ట్‌వర్క్‌కు శ్రీకారం చుట్టింది సుధా రవి. 

మూమూలుగానైతే బియ్యంగింజలు, సుద్దముక్కలు... మొదలైనవి ఉపయోగించి రంగోలి వేసే సుధా ఈసారి మాత్రం ఐస్‌క్రీమ్‌ స్టిక్స్‌ను మాత్రమే ఉపయోగించింది. ఈ రంగోలిలో తమిళ కవులు తిరువళ్లువర్, అవ్వైయార్, భారతీయార్‌ చిత్రాలు ఆకట్టుకుంటాయి. ఆశ్చర్యంగొలిపే అందమైన ఆర్ట్‌వర్క్‌లను రూపొందించడం రవికి కొత్తేమీ కాదు. 2016లో 3,200 చదరపు అడుగుల రంగోలీని రూపొందించి రికార్డ్‌ సృష్టించింది.

‘సింగపూర్‌లో తమిళ సంప్రదాయాలు, కళలను ముందుకు తీసుకువెళ్లడానికి, ఈతరానికి చేరువ చేయడానికి సుధా రవి పనిచేస్తున్నారు’ అంటున్నారు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు. బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం చేస్తున్న సుధా రవి ‘రంగోలి స్పెషలిస్ట్‌’గా పేరు తెచ్చుకుంది. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న రంగోలి కళకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించడానికి తనవంతుగా ప్రయత్నిస్తోంది.

‘అందరు పిల్లల్లాగే నాకు చిన్నప్పటి నుంచి రంగులు అంటే చాలా ఇష్టం. వాటిని చూస్తే చాలు ఎంతో సంతోషం కలిగేది. ఆ సంతోషమే నన్ను రంగోలి కళ  వైపు నడిపించింది. రకరకాల ప్రయోగాలు చేసేలా చేసింది. ఎమోషన్స్‌ విత్‌ కలర్స్‌ కాన్సెప్ట్‌తో కూడా రంగోలి రూపొందించాను.

సింగపూర్‌లో దశాబ్ద కాలంగా ఉంటున్నాము. మా జీవితంలో రంగోలి భాగం అయింది. నాలాగే నా కూతురు రక్షితకు రంగోలిపై ఆసక్తి ఉండడం సంతోషకరమైన విషయం’ అంటుంది సుధా రవి. భూమిని ప్రేమగా ముద్దాడే రంగోలిని కాన్వాస్‌పైకి కూడా తీసుకువచ్చి కనువిందు చేయడంలో ఆమె విజయం సాధించింది.
చదవండి: భార్య భర్తల మధ్య ఎంత వయసు తేడా ఉండాలి? 
హ్యాపీ జర్నీ              
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top