హ్యాపీ జర్నీ

Solo Traveller Neelima Reddy Special Story - Sakshi

సంక్రాంతి సెలవులు పూర్తయ్యాయి. స్కూళ్లు తిరిగి మొదలయ్యాయి. వేసవి సెలవుల కోసం ఎదురు చూపులూ మొదలయ్యాయి. పరీక్షలు పూర్తవడమే తరువాయి, ఓ వారమైనా ఎటైనా వెళ్లి వస్తే తప్ప మనసు రీచార్జ్‌ కాదు. కొత్త ఏడాదికి సిద్ధం కాదు. ఇదిలా ఉంటే కరోనా వచ్చింది, వెళ్లింది, మళ్లీ వచ్చింది, వెళ్లింది. వేవ్‌ల నంబరు పెరుగుతోంది. మరో వేవ్‌కి సిద్ధంగా ఉండమనే సూచనలు షురూ అవుతున్నాయి. ఇలాంటప్పుడు ‘క్షేమంగా వెళ్లి, సంతోషంగా రావాలి’ అంటే ఏం చేయాలి? దేశవిదేశాల్లో విస్తృతంగా పర్యటించిన హైదరాబాద్, సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పర్ట్‌ నీలిమ... కరోనా జాగ్రత్తల గురించి సాక్షితో పంచుకున్న వివరాలివి.

వర్క్‌ ఫ్రమ్‌ వెకేషన్‌!
‘‘కరోనా నా ట్రావెల్‌ లైఫ్‌ను పెద్ద మలుపు తిప్పింది. నేను 2015 నుంచి కరోనా లాక్‌డౌన్‌ వరకు 60 దేశాల్లో పర్యటించాను. ఇండియా టూర్‌ వార్ధక్యం వచ్చిన తర్వాత అనుకునేదాన్ని. లాంగ్‌ వీకెండ్‌ వస్తే ఏదో ఒక దేశానికి వెళ్లిపోయేదాన్ని. కరోనాతో విదేశాలకు విమాన సర్వీసులు నిలిపి వేయడంతో మనదేశంలో పర్యటించడం మొదలుపెట్టాను. ఈశాన్య రాష్ట్రాలు, రాజస్థాన్‌ మినహా ఇండియాని దాదాపుగా చూసేశాను. ఈ సంక్రాంతికి కూడా ఓ వారం అనుకుని వెళ్లిన పాండిచ్చేరి వెకేషన్‌ని నెలకు పొడిగించుకున్నాను. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ని వర్క్‌ ఫ్రమ్‌ వెకేషన్‌గా మార్చుకున్నాను.

నేను చూసినంత వరకు జనంలో కరోనా భయం దాదాపుగా పోయిందనే చెప్పాలి. దేశంలో 99 శాతం వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. కో మార్బిడ్‌ కండిషన్‌ ఉన్న వాళ్లు డాక్టర్‌ సలహా తీసుకుని బూస్టర్‌ డోస్‌ కూడా వేయించుకున్న తర్వాత మాత్రమే టూర్‌లు ప్లాన్‌ చేసుకోవడం మంచిది. ఈ సమస్యలు లేని వాళ్లయితే ఏ మాత్రం సందేహం లేకుండా పర్యటనలు చేస్తున్నారు. అనేక పర్యాటక ప్రదేశాల్లో మాస్క్‌ లేకపోతే ప్రవేశం లేదనే బోర్డులున్నాయి, కానీ మాస్క్‌ నిబంధన మీద పట్టింపుగా కనిపించలేదు. అలాగని నిర్లక్ష్యం చేయకుండా రద్దీ ఉన్న చోట్ల తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల్సిందే.

ప్రకృతి పిలుస్తోంది!
కరోనా భయం ఓ పక్క వెంటాడుతూనే ఉంది, కాబట్టి పర్యటనలకు ప్రకృతి ఒడినే ట్రావెల్‌ డెస్టినేషన్‌గా మార్చుకోవడం మంచిది. జలపాతాలు, సముద్ర తీరాలు, నదీతీరాలు, ట్రెకింగ్, స్కీయింగ్‌ జోన్‌లను ఎంచుకోవాలి. ఈ ప్రదేశాల్లో మనుషుల రద్దీ తక్కువగా ఉంటుంది. మాస్కు లేకుండా హాయిగా విహరించగలిగిన ప్రదేశాలివి. హిమాలయాల్లో ట్రెకింగ్‌కి మంచి లొకేషన్‌లున్నాయి. స్పితి వ్యాలీ, త్రియుండ్‌ కుండ్, కీర్‌గంగ, రూప్‌కుండ్, బ్రిబ్లింగ్, థషర్‌ మషర్‌ ట్రెక్, బ్రమ్‌తాల్, పిన్‌ పార్వతి, హమ్‌తా పాస్‌ ట్రెక్‌లను దాదాపుగా అందరూ చేయవచ్చు.

యూత్‌కి హిమాలయాల్లో పన్నెండు రోజులపాటు సాగే సర్‌పాస్‌ ట్రెక్‌ మంచి థ్రిల్‌నిస్తుంది. నేను కశ్మీర్‌– గుల్‌మార్గ్, ఉత్తరాఖండ్‌– ఔలిలలో ఐస్‌స్కీయింగ్, ఆరోవిల్లెలో సర్ఫింగ్‌ కరోనా విరామాల్లోనే చేశాను. చార్‌థామ్‌ యాత్రలో నాకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు, కానీ యాత్ర ముగించుకుని ఫ్లయిట్‌ ఎక్కిన తర్వాత భయం వేసింది. ఆ టూర్‌ అంతటిలో తుమ్ములు, దగ్గులు వినిపించింది ఫ్లయిట్‌లోనే.

శాంతియాత్ర
లాక్‌డౌన్‌ విరమించిన తర్వాత నా ట్రావెల్‌ లిస్ట్‌లో ఈజిప్టు, టర్కీ దేశాలు చేరాయి. పాండిచ్చేరి బీచ్‌లో సర్ఫింగ్, ఆరోవిల్లెలో మెడిటేషన్‌ నాకు అత్యంత సంతోషాన్నిచ్చాయి. జీవితంలో శాంతికంటే మరేదీ ముఖ్యంకాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అందుకే అరోవిల్లెకి మరో లాంగ్‌ వెకేషన్‌ ప్లాన్‌ చేస్తున్నాను. ఆ తర్వాత యూఎస్‌కి వెళ్లి నా వందదేశాల టార్గెట్‌ని పూర్తి చేయాలనేది కోరిక’’ అని చెప్పారు గమనంలోనే గమ్యాన్ని వెతుక్కుంటున్న నీలిమ. వర్క్‌ చేస్తూ వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారామె. ఇలాంటి పర్యాటక ప్రియుల వల్లనే ‘వర్కేషన్‌’ అనే పదం పుట్టింది.
 

కేర్‌ఫుల్‌గా వెళ్లిరండి!
కరోనా జాగ్రత్తలు పాటిస్తూ చేతులను తరచు శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటూ, ఆహారపానీయాల పరిశుభ్రత పాటిస్తూ హాయిగా పర్యటించవచ్చనేది నా అభిప్రాయం. అయితే పర్యాటక ప్రదేశాల్లో షాపింగ్‌ కోసం మార్కెట్‌లలో ఎక్కువ సేపు గడపకపోవడమే శ్రేయస్కరం. నేను గమనించిన ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే... కాశీ అనగానే అది అరవై దాటిన తర్వాత వెళ్లే ప్రదేశం అనుకునే దాన్ని, ఇటీవల అది యూత్‌ ట్రావెల్‌ డెస్టినేషన్‌ అయింది. అక్కడ డిఫరెంట్‌ వైబ్స్‌ ఉన్నాయి.
– పొనుగోటి నీలిమారెడ్డి, ట్రావెలర్‌

– వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top