
భువనేశ్వర్: శివ భక్తులకు శ్రావణ మాసం అత్యంత పవిత్ర ప్రదం. ఈ నెల పొడవునా ప్రతి సోమవారం ఇష్ట ఆరాధ్య దైవం మహా దేవుడు శివునికి పవిత్ర జలంతో అభిషేకించి తరించేందుకు దీక్ష బూనుతారు. తొలి శ్రావణ సోమవారం పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రాలు శివ దీక్ష భక్తులతో కిటకిటలాడాయి. కఠోర నియమ నిష్టలతో ఒక చోటులోని నదీ జలం సేకరించి వేరొక చోట పూజలందుకుంటున్న మహా దేవునికి అభిషేకిస్తారు.
నదీ తీరంలో శుచిగా స్నానం ఆచరించి దీక్ష వస్త్ర ధారణతో తీరంలో లాంచనంగా పూజాదులు నిర్వహించి పవిత్ర నదీ జలంతో నింపిన కలశాల్ని కావడికి అమర్చి పాద యాత్ర ప్రారంభిస్తారు. ఈ దీక్షకుల్ని కావడి ధారులు (కౌడియా)గా పేర్కొంటారు. పాద యాత్ర ఆద్యంతాలు దీక్ష నియమ నిబంధనల్ని కఠోరంగా అవలంభిస్తారు. సోమవారం శైవ క్షేత్రం చేరేలా యాత్ర కొనసాగిస్తారు. భోలా శంకరుని కటాక్షం కోసం బోల్ భం నిరంతర శివ నామ నినాదంతో ముందుకు సాగుతారు. బోల్ భం దీక్షకుల ఆగమనం పరిసరాల్ని శివ మయం చేస్తాయి. శైవక్షేత్రాలు ప్రత్యేకంగా అలంకరించుకుని వీరికి స్వాగతం పలుకుతాయి. దారి పొడవునా కావడిధారి పాదచారులకు ఎటువంటి అసౌకర్యం అవాంతరం కాకుండా పోలీసు, రవాణా తదితర అనుబంధ వర్గాలు అంకిత భావంతో చేయూతనిస్తాయి.
దవళేశ్వరునికి పవిత్ర జలంతో అభిషేకిస్తున్న భక్తులు
పలు స్వచ్చంధ సేవక వర్గాలు దారి పొడవునా దీక్షకు అనుగుణంగా వీరి కోసం ఏర్పాట్లు చేసి ఆదరిస్తారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి శైవ క్షేత్రాలు విద్యుద్దీపాలు, పచ్చని తోరణాలు, సుగంధిత పూల మాలల అలంకరణతో కనులు మిరమిట్లు గొలిపేలా ముస్తాబవుతాయి. ఆయా క్షేత్రాల్లో బోల్ భం దీక్షకులు సులభంగా మహా దేవునికి అభిషేకించేందుకు తాత్కాలిక బారికేడ్ల గుండా వరుస క్రమంలో దర్శన సౌకర్యం వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించి దేవస్థానం యంత్రాంగం సహకరిస్తారు. ఏకామ్ర క్షేత్రంలో లింగ రాజు, అఠొగొడొ ధవళేశ్వరుని దేవస్థానం, రాజ్‌గంగ్‌పూర్‌లోని ఘోఘరేశ్వర్, ఢెంకనాల్ కపిలేశ్వర్ మరెన్నో ప్రముఖ శైవ క్షేత్రాలు బోల్ భం దీక్షకుల ఆగమనంతో శ్రావణ శోభతో కళకళలాడుతున్నాయి. ఈ సందర్భంగా మహా నది, ఉప నదులు, బ్రాహ్మణి, వైతరణి, కువాఖాయి తదితర పవిత్ర నదుల నుంచి సేకరించిన జలాన్ని కావడి భారంతో నిష్టతో సంకల్పం మేరకు శైవ క్షేత్రం చేరుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో మహా శివునికి అభిషేకిస్తారు. ఈ దీక్షలో ఆబాల గోపాలం అత్యంత అంకిత భక్తి భావంతో పాల్గొంటారు. శివాలయంలో భక్తులు భారీగా గుమిగూడారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది భక్తులు, కౌడిలు బ్రహ్మణి నది, వేదవ్యాస్ శైవ పీఠం నుంచి నీటిని తీసుకువచ్చి ఘోఘరేశ్వర్ శివాలయానికి నీటిని సరఫరా చేశారు.
పూరీ సాగర తీరంలో శ్రావణ సోమవారం పురస్కరించుకుని మహా దేవుని ఆశీస్సులు కోరుతూ ఆవిష్కరించిన సైకత మహా శివుడు, బొడొ సింగారం అలంకరణలో కటక్ అఠొగొడొ ధవళేశ్వరుని దర్శనం