స్పోర్ట్స్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌! ఆటకు సాంకేతికతను జోడించి.. | Sports Entrepreneur Megha Gambhir Analytics Uses Tech To Help Players | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌! ఆటకు సాంకేతికతను జోడించి గెలిచింది!

Nov 24 2023 9:19 AM | Updated on Nov 24 2023 10:03 AM

Sports Entrepreneur Megha Gambhir Analytics Uses Tech To Help Players  - Sakshi

ఆటలు, సాంకేతిక పరిజ్ఞానం వేరు వేరు విషయాలు కాదు. సాంకేతికత సహాయంతో ఆటల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు... అనే లక్ష్యంతో హరియాణాలోని గురుగ్రామ్‌ కేంద్రంగా ‘స్తూప స్టోర్స్‌ ఎనలటిక్స్‌’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టి విజయపథంలో దూసుకుపోతోంది మేఘా గంభీర్‌. ఎలాంటి ప్లాన్‌ లేకుండానే పెద్ద కార్పొరేట్‌ కంపెనీలో తాను చేస్తున్న ఉద్యోగానికి గుడ్‌బై చెప్పింది మేఘా గంభీర్‌. అదే సమయంలో ఆమె భర్త, టేబుల్‌ టెన్నిస్‌ కోచ్‌ దీపక్‌ మాలిక్‌ ‘టెక్నాలజీ సహాయంతో ట్రైనీల పెర్‌ఫార్మెన్స్‌ను ఎలా మెరుగుపరచవచ్చు...’ అనే అంశంపై ఆలోచిస్తున్నాడు.

మేఘకు వెంటనే స్టార్టప్‌ ఐడియా తట్టింది. డేటా, ఎనలటిక్స్‌ సహాయంతో ప్లేయర్స్‌ తమ ఆటతీరును మెరుగు పరుచుకోవడానికి రెండు సంవత్సరాల క్రితం ‘స్తూప స్పోర్ట్స్‌ ఎనలటిక్స్‌’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది. దీనికిముందు అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్, పెప్సికో... మొదలైన కంపెనీలలో పదిహేను సంవత్సరాల పాటు టెక్‌ కన్సల్టెంట్, ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పనిచేసింది. మేఘకు ఆటలు అంటే చాలా ఇష్టం. బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కూడా. ఆటలలో నిపుణుౖలైన ఎంతోమందితో మాట్లాడిన తరువాత తన స్టార్టప్‌ ఐడియాను పట్టాలకెక్కించింది.

డేటాను కాప్చర్‌ చేసే ఆటోమేటెడ్‌ ఇంజిన్‌ను తయారు చేయడానికి సంవత్సరానికి పైగా టైమ్‌ పట్టింది. ఆటలో ప్రతి కోణాన్ని విశ్లేషించుకునేలా కోర్టులో 8–10 కెమెరా సెటప్‌కు రూపకల్పన చేశారు. కంపెనీకి సంబంధించి ప్రత్యేక టెక్నాలజీకి పేటెంట్‌ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీకి పదిహేనుకు పైగా గ్లోబల్‌ క్లయింట్స్‌ ఉన్నారు. ‘టెక్నాలజీ  వైపు నుంచి స్పోర్ట్స్‌ ఎనలటిక్స్‌ వైపు మేఘ రావడానికి కారణం ఏమిటి?’  జవాబు ఆమె మాటల్లోనే... ‘ఒక పెద్ద కంపెనీలో పెద్ద జీతంతో పనిచేస్తున్నప్పటికీ నేను చేస్తున్న ఉద్యోగంతో సంతోషంతో లేను. ఉద్యోగం కాకుండా నెక్ట్స్‌ ఏమిటి... అని ఆలోచించడానికి గ్యాప్‌ తీసుకోవాలనుకున్నాను. ఆ సమయంలో నా భర్త వల్ల స్టార్టప్‌ ఆలోచన వచ్చింది. స్పోర్ట్స్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో నా కాన్సెప్ట్‌ను ప్రెజెంట్‌ చేస్తే మంచి స్పందన వచ్చింది.

జూనియర్స్, యూత్, సీనియర్స్‌... ఇలా రకరకాల విభాగాలు ఆటలో ఉంటాయి. ప్రతి మ్యాచ్‌కు, ప్రతి ప్లేయర్‌కు సంబంధించిన సమాచారాన్ని కాప్చర్‌ చేయడం కోచ్‌లకు కష్టం అవుతుంది. ట్రైనింగ్‌ సెషన్స్‌ ప్రారంభించడానికి వారి దగ్గర తగిన సమాచారం ఉండాలి. ఒక ప్లేయర్‌ టోర్నమెంట్‌కు సంబంధించి అయిదు లేదా పది మ్యాచ్‌లు చూడాల్సి వస్తే డేటా రాయడానికి రెండు మూడు వారాల సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లేయర్స్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఎనలటిక్స్‌కు ఉపయోగపడే ఏఐ ప్రాడక్ట్‌ను తీసుకువచ్చాం. దీనిద్వారా ప్లేయర్స్‌ తమ మ్యాచ్‌ వీడియోలను అప్‌లోడ్‌ చేసి విశ్లేషణ రిపోర్ట్‌ను తీసుకోవచ్చు.

ఇదే సమయంలో కామెంటర్స్‌కు ఉపయోగపడే ఏఐ ప్రాడక్ట్స్‌ రూపొందించాం. టేబుల్‌ టెన్నిస్‌తో మొదలుపెట్టాం. బ్యాడ్మింటన్‌లాంటి ఇతర ఆటల్లోకి కూడా విస్తరించే ప్రణాళికలతో ఉన్నాం’ అంటుంది మేఘా గంభీర్‌. నాణ్యతతో కూడిన వర్చువల్‌ కోచింగ్, ప్లేయర్స్‌కు ఉపయోగపడే సెన్సర్‌–బేస్డ్‌ టెక్నాలజీపై ప్రత్యేక కృష్టి పెట్టింది కంపెనీ. యూరప్‌ మార్కెట్‌లో పట్టు సంపాదించిన ‘స్తూప’ ఆసియా, యూఎస్‌ మార్కెట్‌లోకి కూడా విస్తరించడానికి తగిన ప్రణాళికలు రూపొందించుకుంది. ‘మహిళా స్పోర్ట్స్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌లు తక్కువగా కనిపిస్తారు. చాలామంది లైఫ్‌స్టైల్, ఫ్యాషన్, ఫుడ్‌లాంటి రంగాలను ఎంపిక చేసుకుంటారు. స్పోర్ట్స్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను విజయం సాధించడానికి కారణం చక్కని సలహాలు ఇచ్చిన అనుభవజ్ఞులు, విషయ నిపుణులు, ప్లేయర్స్, కోచ్‌ల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌’ అంటుంది మేఘా గంభీర్‌. 

(చదవండి: ఈ 'వెడ్డూరం' చూశారా? పెళ్లిని సొమ్ము చేసుకునే ట్రెండ్‌! వెడ్డింగ్‌ విత్‌ టికెట్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement