
స్ఫూర్తిగా నిలుస్తున్న దివ్యాంగులు మ్యూజిక్ ఆర్కెస్ట్రాతో ఉపాధి
ఆత్మస్థైర్యంతో ముందడుగు , ప్రతిభకు చేయూతనిచి్చన అప్పటి కలెక్టర్
జిన్నారం (పటాన్‌చెరు): ప్రతికూలతలను అధిగమిస్తూ అసమాన విజయాలు సాధించే దివ్యాంగులు అందరికీ ఆదర్శమని ఈ దివ్యాంగ జంట నిరూపించింది. మండల కేంద్రానికి చెందిన లక్ష్మి, నాగేశ్ దంపతులిద్దరూ పుట్టుకతోనే అంధులు. నగేశ్ ఇంటర్ వరకు చదవగా, లక్ష్మి పదవ తరగతి చదివింది. వీరిద్దరూ ఐదేళ్లుగా ఓ ఆర్కెస్ట్రాలో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. తమ సొంత కాళ్లపై నిలబడేందుకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు. అప్పటి కలెక్టర్ వల్లూరు క్రాంతి వారిలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ వారికి అక్షరాల రూ.లక్షా20 వేల ఆర్థిక సహాయం అందజేసింది. బయట పని చేయడం మానేసి అందిన సాయంతో సొంత ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేసుకున్నారు. మరో 10 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు సిద్ధమయ్యారు.
స్టూడియో ఏర్పాటు
దివ్యాంగ దంపతులైన లక్ష్మి, నగేశ్ తమ మదిలోని ఆలోచనలకు శ్రీకారం చుట్టి దివ్యాంగ మ్యూజిక్ స్టూడియో ఏర్పాటు చేశారు. ఈ స్టూడియో ద్వారా పలు శుభకార్యాలకు, కచేరీ కార్యక్రమాలకు సొంత ఆర్కె్రస్టాను అభివృద్ధి చేసుకునేలా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన సంగీత పరికరాలతో నిత్యం సాధన చేస్తున్నారు. వీరితో పాటు మరో 10 మంది దివ్యాంగులను జత చేసుకుని తమ కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేస్తున్నారు.
బృందంగా ఏర్పడి..
లక్ష్మి, నగేశ్ ఏర్పాటు చేసుకున్న ఆర్కెస్ట్రా బృందంలో కొంతమంది దివ్యాంగులను సభ్యులుగా చేసుకున్నారు. వీరిలో కిష్టయ్యపల్లికి చెందిన సుమలత పాటలు పాడుతోంది. రవి కాంగో వాయిస్తాడు. సువర్ణ, నాగమణి, భాగ్యలక్ష్మి కోరస్‌కు సహకారం అందిస్తున్నారు. వీరందరూ కలిసి ఒకే చోట శిక్షణ కొనసాగిస్తూ ఉపాధి అవకాశాలను సృష్టించుకుంటున్నారు. ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసుకున్న వారిని చూసి మండలవాసులు కొనియాడుతున్నారు. జీవితాన్ని సాఫీగా సాగించేందుకు శాయశక్తులా కృషిచేస్తున్న వారి పోరాట పటిమను పలువురు అభినందిస్తున్నారు.