100 మిలియన్ వ్యూస్‌తో రికార్డు
ఇది పాట కాదు.. ఒక అద్భుతం : సింగర్ జాహ్నవి శంకర్
అమ్మ ప్రేమను గుర్తు చేసే గానం
సాక్షి, సిటీబ్యూరో: ‘అమ్మ పాటే.. జోల పాట.. అమృతానికన్న తియ్యనంటా’.. అంటూ సాగే అమ్మ పాట సోషల్ మీడియాలను ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ప్రతి 2, 3 ఏళ్లకోసారి ఇలాంటి ఒక పాట వైరల్ అవ్వడం మామూలే.. అయితే అలా వచ్చిన పాటల్లో ఎక్కువ కాలం అందరినోట.. ‘అమ్మ పాట’ మెదిలింది.. అంతేకాదు.. అందరి మనసుల్లో అల్లుకుపోయింది. అమ్మ ప్రేమలోని కమ్మదనం, జానపదంలోని నాటుదనానికి అధునాతన సంగీతాన్ని జోడించి ఈ తరం సంగీత ప్రియులను అత్యద్భుతంగా అలరించింది. మిట్టపల్లి సురేందర్ రచించిన ‘అమ్మ పాట’ను గాయని జాహ్నవి శంకర్ ఆలపించారు. ఈ తెలుగు పాట దేశంలోనే కాకుండా విదేశాల్లోని తెలుగువారందరికీ చేరువైంది. ఈ పాట 100 మిలియన్ వ్యూస్ మైలురాయిని చేరిన నేపథ్యంలో ఫిల్మ్‌నగర్‌లోని శ్రీకాంత్ షూటింగ్ హౌస్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు.
చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!
ఇప్పటికీ వినిపిస్తోంది..
అమ్మపాట 100 మిలియన్ వ్యూస్ దాటిన సందర్భంగా జాహ్నవి శంకర్ తన సంతోషాన్ని పంచుకున్నారు.. ‘అమ్మ పాట’ కేవలం ఒక పాట కాదు.. ఇదొక అద్భుతమైన అనుభూతని, ప్రతి తల్లికీ అంకితం అన్నారు. తనను, తన పాటను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ఈ క్రెడిట్ దక్కుతుందని పేర్కొన్నారు. లాక్‌డౌన్ సమయంలో విడుదలైన ఈ పాట.. ఈ రోజుకీ అనేక మంది నోట వినిపిస్తోందన్నారు. ఈ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా నటి శ్వేతా వర్మ హాజరై జాహ్నవిని అభినందించారు. అమ్మ ప్రేమను మరోసారి ఈ పాట గుర్తు చేసిందని శ్వేతా అన్నారు. ఇందులో సోషల్ మీడియా క్రియేటర్లు, అభిమానులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్ ఉల్లి, తొక్కే కదా, అని తీసి వాడేస్తున్నారా?


