
కన్నడంలో బాను ముష్తాక్ (Banu Mushtaq) రాసిన కథా సంకలనానికి దీపా భాస్తిఇంగ్లిష్ అనువాదమైన ‘హార్ట్‌ల్యాంప్’ ఇటీవలే 2025 అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ (అనువాదాలకు ఇచ్చేది) గెలుచుకుంది. ఇప్పుడు మరో భారతీయ రచయిత్రి కిరణ్ దేశాయి రాసిన ‘ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ నవల 2025 బుకర్ ప్రైజ్‌కు (ఇంగ్లిష్ రచనలకు ఇచ్చేది) మరోమారు లాంగ్‌లిస్ట్ అయ్యింది. కిరణ్ దేశాయి (Kiran Desai) గతంలో రాసిన ‘ది ఇన్ హెరిటెన్స్ ఆఫ్ లాస్’ నవల ఆమెకు 2006లోనే అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ప్రతిష్ఠా త్మక ‘మాన్ బుకర్’ బహుమతినీ, నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ ఫిక్షన్ అవార్డునూ గెలుచుకుంది.
ప్రముఖ రచయిత్రి అనితా దేశాయి కుమార్తే కిరణ్. తన 14 ఏళ్ల వయసులో తల్లితో కలిసి ఇంగ్లండ్ వెళ్లారు. ఆ తర్వాత అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కొలంబియా యూనివర్సిటీలో సృజనాత్మక రచనలపై కోర్సు చేశారు. కిరణ్ మొదటి నవల ‘హల్లా బలూ ఇన్ ది గ్వావా ఆర్చర్డ్’ 1998లో వెలువ డింది. అది ఒక వ్యంగ్యాత్మక రచన. ఈ నవల సంపత్ చావ్లా అనే యువకుడి చుట్టూ తిరుగు తుంది. సమాజపు ఆశలు, ఆధ్యాత్మికత, మానవ స్వభావం లాంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకుని రాసిన ఈ నవల సల్మాన్ రష్దీ వంటి సాహితీ వేత్తల నుండి ప్రశంసలు అందుకోవడమే కాకుండా బెట్టీ ట్రాస్క్ అవా ర్డునూ గెలుచుకుంది. కిరణ్ రెండవ నవల ‘ది ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ లాస్’. 1980లలో న్యూయా ర్క్‌లోని వలస జీవితాలు, వారి సాంస్కృతిక గుర్తింపు, ప్రపంచీకరణ, ఫలితంగా కోల్పోయే వ్యక్తిగత స్వేచ్ఛ తదితర అంశాల్ని ఇతివృత్తంగా తీసుకుని రాశారు. వివిధ సంస్కృతుల మధ్య చిక్కుకున్న పాత్రలను చిత్రించారు. కిరణ్ రచనల్లో ధ్వనించే కథన శైలి, సజీవ చిత్రణ, సంక్లిష్ట ఇతివృత్తాల అన్వేషణ అంత ర్జాతీయ గుర్తింపును పొందాయి. ముఖ్యంగా 35 ఏళ్ల వయసులోనే బుకర్ బహుమతిని గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపును అందుకున్నారు. 2025 బుకర్ ఫైనల్ విజేతగా కిరణ్ నిలవాలని కోరుకుందాం!
– వారాల ఆనంద్ ‘ కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత