చిల్డ్రన్‌–సోషల్‌ మీడియా.. చూస్తున్నారా... ఏం చూస్తున్నారో!

Smartphones exposing children to pornography and violence - Sakshi

పిల్లలు ఫోన్‌ తీసుకుని ఏం చూస్తున్నారు?
పిల్లల్ని టార్గెట్‌ చేసుకొని సోషల్‌ మీడియాలో ఏమేమి వస్తోంది?
ఎవరు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెడుతున్నారు?
ఏ గేమ్‌కు బానిసవుతున్నారు?
తెలియక ఏ పోర్నోగ్రఫీ కంటెంట్‌కు ఎక్స్‌పోజ్‌ అవుతున్నారు?
అశ్లీల చిత్రాలను సోషల్‌ మీడియా యాప్స్‌లో పెడుతున్నందుకు ఇటీవల జరిగిన బాలీవుడ్‌ అరెస్ట్‌ నేర విచారణ గురించి కంటే అలాంటి కంటెంట్‌ పిల్లల వరకూ చేరుతున్నదా అనే ఆందోళనే ఎక్కువ కలిగిస్తోంది.

తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక.
లోకంలో చాలా పనులు జరుగుతున్నాయి. మనం మాత్రం పిల్లల చేతికి ఫోన్‌లు ఇచ్చి మన పనుల్లో పడుతున్నాం. ఆన్‌లైన్‌ క్లాసుల కోసమో, తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే పిల్లలతో మాట్లాడటం కోసమో, పిల్లలతో టైమ్‌ స్పెండ్‌ చేసే వీలు లేక వారిని ఎంగేజ్‌ చేయడం కోసమో, స్టేటస్‌ కోసమో, గారాబం కోసమో ఇవాళ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల చేతికి ఫోన్లు ఇస్తున్నారు. ఇవ్వక తప్పడం లేదు. కాని వారి చేతిలో ఉన్న ఆ ఫోన్‌ వారికి చాలా మేలు చేయగలదు. చాలానే కీడు కూడా చేయగలదు. ఆ విషయం వారికి తెలిసే వరకు స్నేహంగా వారిని అలెర్ట్‌ చేస్తున్నామా? చెక్‌ చేస్తున్నామా? అంతా అయ్యాక ‘నువ్వు గేమ్స్‌కు బానిసయ్యావు.. నిన్నూ’.. అని ఫోన్లు పగలగొడితే ఆ పిల్లలు అలిగి ఆత్మహత్యలు చేసుకునేవరకు తీసుకువెళుతున్నాం. ఇప్పుడు ఫోన్‌ అనేది ఇద్దరి బాధ్యతతో ముడిపడి ఉన్న వస్తువు... తల్లిదండ్రులూ... పిల్లలూ...

ఢిల్లీలో వినూత్న కేసు
రెండు రోజుల క్రితం ఢిల్లీ మహిళా కమిషన్‌ అక్కడి పోలీసులకు ఒక మహిళ మీద ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేయమని ఆదేశాలు ఇచ్చింది. దానికి కారణం ‘ఇన్‌స్టాగ్రామ్‌’ అకౌంట్‌లో ఆ మహిళ పెట్టే వీడియోల్లో కుమారుణ్ణి నటింపచేయడమే. సాధారణంగా తగిన ఆపోజిట్‌ పార్టనర్‌ ఉంటేనే కొన్ని వీడియోలు చేయాలి. ఆ వీలు లేనివారు చిన్న పిల్లలతో పాటలకు డాన్సులు చేయడం చేస్తున్నారు. ఆ మహిళ తన కొడుకుతో కలిసి చేసిన డాన్సు ‘అశ్లీలంగా’ ఉందని మహిళా కమిషన్‌ గుర్తించింది. వెంటనే ఆ మహిళను అరెస్ట్‌ చేయమంది. పిల్లాడ్ని కౌన్సిలింగ్‌కి తీసుకువెళ్లమని చెప్పింది. పిల్లల్ని ఇవాళ విపరీతంగా ప్రభావితం చేస్తున్న సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఇన్‌స్టాగ్రామ్‌’. ఇందులో ‘రీల్స్‌ మేకర్లు’గా పిల్లలు డాన్సులు చేస్తూ పాపులారిటీ సంపాదిస్తున్నారు. కాని అవి ఒక్కోసారి శృతి మించి ఫాలోయెర్స్‌ను పెంచుకోవడానికి శరీరం కనిపించే లేదా పెద్దల్లా  శరీర కదలికలు చేసే విధంగా ఉండటం ప్రమాదంగా పరిణమించింది. కొందరు తల్లిదండ్రులు పిల్లలతో ఇలాంటి వీడియోలను చేసి మరీ పెడుతున్నారు. 30 సెకన్ల సేపు ఉండే ఇన్‌స్టా రీల్స్‌ ఇవాళ చాలామంది పిల్లలను తప్పు దోవ పట్టించడమే కాక ఇతర ‘ఉద్రేకపరిచే’ డాన్సులను, డమ్మీ సంభాషణలను వారు చూసేలా చేస్తోంది.

ఫొటోల ప్రమాదం
ఫేస్‌బుక్‌లో 18 ఏళ్ల లోపు పిల్లలు అకౌంట్లు కలిగి ఉంటున్నారు. వీరు అకౌంట్స్‌ ఓపెన్‌ చేసేలా కొంతమంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి అకౌంట్‌ ఓపెన్‌ చేశాక ఇక ఎవరెవరు ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్‌ పెడతారో చెప్పలేం. మెసెంజర్‌లో ఎవరు చాట్‌కు ఆహ్వానిస్తారో తెలియదు. అలాంటివి ఏమీ లేకపోయినా చీటికి మాటికి పిల్లల ఫొటోలు పిల్లలుగాని పెద్దలు కాని పోస్ట్‌ చేయడం క్షేమం కాదు. వాటిని సేవ్‌ చేసుకుని మార్ఫింగ్‌ చేసే వీలు ఉంటుంది. ఫేస్‌బుక్‌లో రకరకాల భావజాలాలు, వీడియోలు, యాడ్స్‌ ప్లే అవుతూ ఉంటాయి. అవన్నీ పిల్లల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో మనకు తెలిసే అవకాశం లేదు.

అడిక్షన్‌ అంటే
పిల్లలు ఫోన్‌కు అడిక్ట్‌ అయితే వారు కేవలం గేమ్స్‌ ఆడుతూ మాత్రమే అడిక్ట్‌ కారు. ఇవాళ వస్తున్న కామెడీ స్కిట్లు, డాన్స్‌ షోలు, ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్న సిరీస్‌లు... వీటన్నింటిని చూస్తూ ఫోన్‌కు అడిక్ట్‌ అవుతారు. కొన్ని రకాల గేమ్స్‌ వారిని పదే పదే ఫోన్‌ చేతిలో పట్టుకునే విధంగా ఎప్పుడెప్పుడు క్లాస్‌/తల్లిదండ్రులు చెప్పిన పని పూర్తవుతుందా ఎప్పుడు ఫోన్‌ చేతిలోకి తీసుకుందామా అని అస్థిమితం చేస్తాయి. కామెడీ పేరుతో సాగే అశ్లీల సంభాషణలు వేస్తున్న ప్రభావం తక్కువ ఏమీ కాదు. ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో చాలా సిరీస్‌ ‘18 ప్లస్‌’గా ఉంటాయి. కాని వాటిని కూడా 10–13 ఏళ్ల మధ్య పిల్లలు చూస్తున్నారు.

మార్కెట్‌
మార్కెట్‌ కూడా పిల్లల వెంట పడుతుంది. సోషల్‌ మీడియాలో ఉండే పిల్లలు వారు బ్రౌజ్‌ చేసే సైట్లు, ప్రొడక్ట్స్‌ను బట్టి వారికి యాడ్స్‌ ప్రత్యక్షమవుతాయి. స్లిమ్‌ కావాలంటే ఈ ఫుడ్‌ తినండి, అందంగా కనిపించాలంటే ఈ బట్టలు వాడండి, ఫలానా యాప్‌ ద్వారా ట్యూషన్‌ క్లాసులు వినండి, ఫలానా చోటుకు ప్రయాణాలు కట్టండి అని వారిని ఆకర్షిస్తూ ఉంటాయి. పిల్లలు అవి చూసి కావాలని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది.

పుస్తకం బెటర్‌
పిల్లలు ఏ పుస్తకం చదువుతున్నారో దాని కవర్‌ మనకు కనపడుతూ ఉండటం వల్ల తెలుస్తుంది. కాని వారు ఫోన్‌ చూస్తూ ఉంటే అందులో ఏం చూస్తున్నారో ఎదురుగా ఉన్న మనకు తెలియదు. ఎదిగే వయసులో ఉన్న పిల్లలను ఒక మాయా ప్రపంచంలో దించినట్టే... వారి చేతికి సెల్‌ ఇవ్వడం అంటే. వారిని కనిపెట్టే సమయం లేదని ఇప్పుడు ఊరుకుంటే భవిష్యత్తు సమయమంతా వారి కోసం బెంగపడాల్సి వస్తుంది. జాగ్రత్త పడదాం. ఫోన్‌ తగ్గించి పుస్తకం ఎక్కువగా పెడదాం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top