ఉమెన్‌ పవర్‌ | Singareni appointed women to operate heavy dumpers | Sakshi
Sakshi News home page

ఉమెన్‌ పవర్‌

May 16 2026 5:43 AM | Updated on May 16 2026 5:43 AM

Singareni appointed women to operate heavy dumpers

‘మైనింగ్‌ రంగంలో మహిళలు ఏమిటి?’ అనే ఆశ్చర్యం... 
మహిళా ఉద్యోగులు సునిత్నమైన పనులు మాత్రమే... 
అదీ ఆఫీసు నాలుగు గోడల మధ్యే పనిచేయాలనే నమ్మకాలు, అపోహలు...
వాటన్నింటినీ బద్దలు కొడుతూ ఉమెన్‌ పవర్‌ చాటి చూపుతున్నారు మహిళలు.

తాజా విషయానికి వస్తే... మైనింగ్‌ రంగంలో 50, 100 టన్నుల బరువులు మోసుకెళ్లే హెవీ డ్యూటీ డంపర్‌లను మహిళలు నడిపిస్తున్నారు. తొలి అడుగు ఉత్తర భారతంలోని టాటా స్టీల్స్‌ కంపెనీలో పడగా, రెండో అడుగుకు తెలంగాణలోని సింగరేణి వేదికైంది.

పదమూడు మంది మహిళా కార్మికులు సిరిసిల్లలోని ‘తెలంగాణ డ్రైవింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్కిల్స్‌’లో హెవీ ఎర్త్‌ మూవర్‌ మెషిన్‌లను నడపడంలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. త్వరలోనే ఇంటర్నల్‌ రిక్రూట్‌ ద్వారా సంస్థ పరిధిలోని పదిహేడు ఓపెన్‌ గనుల్లో విధులు నిర్వహించనున్నారు...వారిలో కొందరి హెవీ వాహన ప్రయాణం గురించి వారి మాటల్లోనే...

ఆర్మీ మిస్సైనా... 
మరుదనాయగం శిరీష
మాది మంచిర్యాల జిల్లా మందమర్రి. చిన్నప్పటి నుంచి అడ్వెంచర్స్‌ అంటే ఇష్టం. మా తాత, తండ్రులు, బాబాయ్‌లు సైతం సైన్యంలో పనిచేశారు. వాళ్ల స్ఫూర్తితో పోలీస్‌ శాఖలో చేరాలని ప్రయత్నించాను. ఎస్‌.ఐ. పరీక్షల్లో పల్టీ కొట్టినా, ఆ తర్వాత ఇంట్లోవాళ్లను ఒప్పించి కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌కు సిద్ధమయ్యాను. ఆర్మీలో జాయిన్‌ అవడమే లక్ష్యంగా ప్రయత్నిస్తున్న సమయంలో సింగరేణి కార్మికుడిగా పనిచేస్తోన్న నాన్న రఫేల్‌ అనారోగ్యం పాలయ్యారు. 

దీంతో అమ్మ విక్టోరియా కోరిక మేరకు కుటుంబంకోసం ఆర్మీ కలలను పక్కనపెట్టి సింగరేణి కార్మికురాలిగా 2024 మార్చిలో జాయిన్‌ అయ్యాను. చిన్నప్పటి నుంచి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ నడిపే అలవాటు ఉంది. ఆ తర్వాత కార్లు కూడా ధైర్యంగా నడిపించేదాన్ని. అయితే, గనుల్లో వాటికంటే పరిమాణంలో, సామర్థ్యంలో పెద్దవైన ప్రొక్లెయినర్లు, డంపర్లు, షావెల్స్‌ క్రేన్లు కనిపించేవి. కార్లు, బైకులు నడిపిన నాకు వాటిని కూడా నడిపించాలని అనిపించినా, ఎవరిని అడగాలో తెలియక ఆశను మనసులోనే దాచుకున్నాను. 

సీఎండీ బలరామ్‌నాయక్‌ 2024 చివర్లో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో నేరుగా కార్మికులతో ఇంటరాక్ట్‌ అయ్యారు. అదే అదనుగా సీఎండీ సార్‌తో మాట్లాడుతూ ‘సార్, నాకు గనిలో ఎప్పుడు తిరుగుతూ కనిపించే డంపర్లు నడపాలని ఉంది. నాకు ఆ అవకాశం ఇస్తారా’ అని అడిగాను. దానికి ఆయన ‘అవి నడపాలంటే డ్రైవింగ్‌లో అనుభవం ఉండాలి. నీకు ఉందా?’’ అని ప్రశ్నించారు. దీంతో చిన్నప్పటి నుంచి బైకులు, కార్లు నడపడంలో నాకున్న అనుభవం గురించి వివరిస్తూ.. మాకు కూడా పురుషులతో సమానంగా డంపర్లు నడిపే ఛాన్స్‌ ఇవ్వండి అని మరోసారి కోరాను. నా ఉత్సాహం చూసిన సీఎండీ సార్‌ ‘ సరే,. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాను’ అని హామీ ఇచ్చారు. నిలబెట్టుకున్నారు.

ప్రతీ చోట సవాలే.. ప్రయత్నిస్తే విజయాలే  
– తోకల త్రివేణి
మాది మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌. మా నాన్న తోకల ఎల్లయ్య సింగరేణి కార్మికుడు. నాకు పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత 2022లో సింగరేణిలో జాయిన్‌ అయ్యాను. పెళ్లికిముందు నాకున్న కార్‌ డ్రైవింగ్‌ అనుభవం తర్వాత పనికి వచ్చింది. మహిళా కార్మికులకు డంపర్‌ ఆపరేటర్‌గా అవకాశం ఇస్తామంటూ 2025 ఆగస్టులో నోటిఫికేషన్‌ వచ్చింది. దీంతో ఈ అవకాశాన్ని ఓ సవాల్‌గా తీసుకున్నాను. సిరిసిల్ల ట్రైనింగ్‌ సెంటర్‌లో మొదటి వారం థియరీ, సిమ్యులేషన్‌ మీద క్లాసులు తీసుకున్నారు. తర్వాత 16 అడుగుల పొడవైన స్కూల్‌బస్సును, 26 అడుగుల పొడవు ఉండే ట్రక్‌ (లారీ)ని నడిపించడంపై గ్రౌండ్‌లో శిక్షణ ఇచ్చారు. కానీ శిక్షణ మలిభాగంలో అవే హెవీ వెహికల్స్‌ను నేరుగా రోడ్డుపై నడపమన్నారు. మొదట్లో కొంత భయపడ్డప్పటికీ, నా ఫస్ట్‌ డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను గుర్తు తెచ్చుకుని క్లచ్‌ వదిలి, ఎక్సలేటర్‌ తొక్కి గేరు మార్చాను అంతే!

కెరీర్‌ గ్రోత్‌ కోసం...
– షేక్‌ రహమత్‌ ఉన్నీసా
మా నాన్న షేక్‌ అబ్దుల్‌ ఖదీర్‌ భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడిగా పని చేసేవారు. ‘మనది సంప్రదాయ కుటుంబం, కట్టుబాట్లు పాటించాలి’ అనే పరిధిలోనే నేను డిగ్రీ పూర్తి చేయడం. పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే. ఐటీ సర్వీసెస్‌లో పనిచేసే నా భర్త జుబేర్‌ అహ్మద్‌తో పెళ్లి తర్వాత ఆయన నా ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చారు. కొత్తగా ఆయన కారు కొనుక్కోవడమే కాకుండా నాకు పట్టుబట్టి డ్రైవింగ్‌ నేర్పించారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2022లో సింగరేణిలో బదిలీ వర్కర్‌గా జాయిన్‌ అయ్యాను. 

ఇల్లెందు ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న సమయంలో 2025 ఆగస్టులో డంపర్‌ ఆపరేటర్‌ నోటిఫికేషన్‌ వచ్చింది. అప్లై చేయాలనుకున్నప్పుడు ఎవరెన్ని విధాలుగా వెనక్కి లాగాలని చూసినా వినలేదు. సంప్రదాయ పద్దతిలో రెగ్యులర్‌ ఆఫీస్‌ జాబ్‌కే పరిమితం అవడం కంటే కెరీర్‌ గ్రోత్‌ ఉండే డంపర్‌ ఆపరేటర్‌గా వెళ్లడమే ఉత్తమం అనుకుని ముందడుగు వేశాను. కొత్త బాటలో నడిచేటప్పుడు ఎన్నో అవమానాలు, అవహేళనలు, తిరస్కారాలు ఎదురుకావచ్చు. వాటిని లెక్కచేయక ముందుకు సాగి విజయం సాధిస్తే తరువాత అదే బాటని మిగిలిన వాళ్లు అనుసరిస్తారు.

– తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement