breaking news
Heavy Duty Truck
-
ఇక ఒలెక్ట్రా ఈ–టిప్పర్స్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ భారత్లో తొలిసారిగా తయారు చేసిన 6్ఠ4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్స్కు హోమోలోగేషన్ ధ్రువీకరణ లభించింది. ఆటోమోటివ్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ సర్టిఫికెట్ సాధించింది. రహదారులకు టిప్పర్ అనువైనదో లేదో తెలుసుకునేందుకు పర్వత ప్రాంతాలు, ఎత్తయిన ప్రదేశాలు, మైనింగ్, క్వారీల్లో పరీక్షలు చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. దేశంలోనే మొట్టమొదటి సర్టిఫైడ్ హెవీ డ్యూటీ ఈ–టిప్పర్గా ఇది నిలిచిందని ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. 20 ఈ–టిప్పర్ల సరఫరాకై ఒక సంస్థతో చర్చలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. వివిధ వేరియంట్లలో ఈ వాహనాన్ని విడుదల చేస్తామన్నారు. నిర్మాణం, మౌలిక సదుపాయాలు, మైనింగ్, క్వారీ రంగాల్లో ఇది గణనీయమైన మార్పును తేనుందని వివరించారు. -
ట్రక్ల అమ్మకాలు బాగుంటాయ్: వోల్వో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక ఉత్పత్తి ఈ ఏడాది 4 శాతం పెరుగుతుందన్న అంచనాలున్నాయని వోల్వో ట్రక్స్ తెలిపింది. మైనింగ్, నిర్మాణ రంగ కార్యకలాపాల పునరారంభం పెద్ద ఎత్తున ఉండబోతోందని, ఈ నేపథ్యంలో వాణిజ్య వాహనాల అమ్మకాల్లో వృద్ధి ఆశిస్తున్నామని ఏబీ వోల్వో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ డివ్రీ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. 200 బొగ్గు క్షేత్రాలు తెరుచుకునే అవకాశముందని, దీంతో ట్రక్ల అమ్మకాలు గణనీయంగా ఉంటాయన్నారు. మైనింగ్ నిషేధం, బొగ్గు క్షేత్రాల కేటాయింపుల రద్దు, మందగమన ప్రభావం కంపెనీపైనా పడిందని వీఈ కమర్షియల్ వెహికల్స్ సీఈవో వినోద్ అగర్వాల్ పేర్కొన్నారు. 2011లో 1,100ల ట్రక్లు విక్రయిస్తే, 2013లో 700 ట్రక్లకే పరిమిత మయ్యామని చెప్పారు. ‘ట్రక్ యజమానులు వ్యాపారాలు లేక నెల వాయిదాలు కట్టలేకపోయారు. ఫైనాన్స్ సంస్థలు కొత్త వాహనాలకు ఫైనాన్స్ నిరాకరించాయి. ఈ కారణంగా వాహనాల అమ్మకాలు పెద్దగా నమోదు కాలేద’ని అన్నారు. 2016లో 1,000 ట్రక్ల విక్రయాలకు చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. హెవీ డ్యూటీ విక్రయాల్లో.. గతేడాదితో పోలిస్తే 2014 జనవరి-మే కాలంలో 16 టన్నులు, ఆపై సామర్థ్యంగల హెవీ డ్యూటీ ట్రక్ల విక్రయాల్లో 30 శాతం వృద్ధి చెందామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రామారావు ఏఎస్ తెలిపారు. ఈ విభాగం మార్కెట్ పరిమాణం దేశంలో 1,500 యూనిట్లుందని వోల్వో గ్రూప్ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ జీవీ రావు చెప్పారు. 150-225 టన్నులు మోయగల భారీ ట్రక్లు 500 దాకా వోల్వో విక్రయించింది. ఇంధన పొదుపు దిశగా డ్రైవర్లను ప్రోత్సహించేందుకు ఫ్యూయెల్ వాచ్ పేరుతో వోల్వో గత ఐదేళ్లుగా పోటీ నిర్వహిస్తోంది. ఈ ఏడాది పోటీలకు కొత్తగూడెం సమీపంలోని మణుగూరు సింగరేణి గనులు వేదికైంది.