Shruthi Nanduri: నండూరి ఇంటి అమ్మాయి నోట ఎంకిపాట | Shruthi Nanduri: shruthi nanduri in telugu indian idol 2 from nanduri enkis family | Sakshi
Sakshi News home page

Shruthi Nanduri: నండూరి ఇంటి అమ్మాయి నోట ఎంకిపాట

Published Sun, Mar 26 2023 5:30 AM | Last Updated on Sun, Mar 26 2023 5:30 AM

Shruthi Nanduri: shruthi nanduri in telugu indian idol 2 from nanduri enkis family - Sakshi

నండూరి ఎంకిపాటల సొగసుదనం.. ఆ పదాల మాధుర్యం ఈ తెలుగు నేలకు సుపరిచయమే. ముత్తాత రాసిన పాటలను తన నోట ఆలపించడానికి అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చింది మునిమనమరాలు శృతి. మెడిసిన్‌ చదువుకుంటూనే శాస్త్రీయ సంగీత సాధన చేస్తోంది. సంగీతకార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శృతి నండూరిని పలకరిస్తే ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచింది.

‘‘అమ్మ లక్ష్మి, నాన్న సుధాకర్‌ నండూరి ఇద్దరూ ముప్పై ఏళ్లుగా న్యూజెర్సీలోనే ఉంటున్నారు. నేను అక్కడే పుట్టి పెరిగాను. కర్ణాటక సంగీతం ఐదేళ్ల వయసు నుంచే నేర్చుకుంటున్నాను. లలిత సంగీతం కూడా గురువుల దగ్గరే శిక్షణ తీసుకున్నాను. సంగీతానికి సంబంధించిన వీడియోలు చేస్తుంటాను. న్యూజెర్సీలో చాలా చోట్ల ప్రదర్శనలు కూడా ఇచ్చాను.

అమెరికాలో తెలుగు మహాసభలు జరిగినప్పుడు వెళుతుంటాను. ఆ విధంగా ఇండియా నుంచి వచ్చే సింగర్స్, మ్యూజిక్‌ డైరెక్టర్లు పరిచయం అయ్యారు. వాళ్లతో కలిసి స్టేజ్‌ షోలలో పాల్గొన్నాను. అక్కడ  నా ఇంటిపేరులో నండూరి ఉండటంతో ‘నండూరి వారి అమ్మాయంట’ అని చెప్పుకునేవారు. నాతో నేరుగా ‘మీ ముత్తాత గారి గురించి తెలుసా!’ అని అడిగేవారు. దీంతో ‘నండూరి గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు ఏంటి’ అని అమ్మనాన్నలను అడిగాను. అప్పుడు తెలిసింది ముత్తాతగారి గురించి, ఆ పేరులోని ప్రత్యేకత గురించి. అప్పటి నుంచి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మా పెదనాన్న, మామయ్య, బంధువులను అడుగుతుంటాను. నాన్నను కూడా ఇంకా సమాచారం తెలుసుకొని చెప్పమని వేధిస్తుంటాను.

► ఒక్కో పదాన్ని పలుకుతూ..
అమ్మ వైపు కళాకారులు ఉన్నారు కాని నాన్నవైపు మా ముత్తాత నండూరి సుబ్బారావుగారి తర్వాత ఆర్ట్స్‌లో ఎవరూ లేరు. ఆయన రైటింగ్‌ గురించి గొప్పగా చెబుతుంటారు. కానీ, తాతగారి గురించి తెలిసిన విషయాలు అంతగా చెప్పేవారు లేరు. నాన్న ద్వారా కొద్దిగా విని ఉన్నాను. సంగీతం నేర్చుకుంటూ, చదువుకుంటూ నా ధ్యాసలో నేనుండిపోయాను. ఆయన పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి. అయితే, నాకు తెలుగు రాయడం, చదవడం రాదు. ఆయన ప్రత్యేకత తెలిశాక నాన్నను కూర్చోబెట్టి ఆ బుక్స్‌లోని ఒక్కో పదాన్ని పలుకుతూ, అర్థం తెలుసుకుంటూ ఉండేదాన్ని. కొన్ని రోజుల పాటు ఇదే పనిలో ఉన్నాను. చాలా అద్భుతం అనిపించింది.

► ఎంకిపాట నా నోట
ఎంకి పాటల లిరిక్స్‌ తీసుకొని, కొత్తగా కంపోజ్‌ చేసి, నేనే పాడాలని నిశ్చయించుకున్నాను. ఈ ప్రాజెక్ట్‌ కోసం కొందరు మ్యూజిక్‌ డైరెక్టర్లను కూడా కలిశాను. అదే సమయంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆర్పీపట్నాయక్‌ గారు ఇదే ప్రాజెక్ట్‌ చేయబోతున్నారని తెలిసింది. ఒకేసారి మా ఇద్దరిలో ఇలాంటి ఆలోచన రావడం నాకే వింతగా అనిపించింది.
‘ఎంకిపాటల్లో నుంచి కొన్ని లైన్స్‌ పాడమని అడిగారు. నేను పాడడంతో ‘నీ వాయిస్‌ ఈ పాటలకు చాలా బాగా సూటవుతుంది’ అని ఆ ప్రాజెక్ట్‌లో సింగర్‌గా నాకే అవకాశం ఇచ్చారు. ఆ విధంగా ఎంకిపాటలు నా నోట పాడించారు.  

‘‘నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు మొన్నెతిరిగొస్తనన్నాడే...’’ ఎంకిపాట ఆర్పీనోట అనే మ్యూజిక్‌ ఆల్బమ్‌లో పాడాను. ఆ పదాలను వింటూ అర్థం చేసుకుంటూ వాటికి తగిన న్యాయం చేయాలనుకున్నాను.

► చదువు.. సంగీతం
అమెరికాలో మెడిసిన్‌ చేస్తున్నాను. ఫిజికల్‌ మెడిసిన్‌లో రిహాబిలిటేషన్‌ అనేది నా స్పెషలైజేషన్‌. బ్రెయిన్‌ ఇంజ్యూరీ, స్పోర్ట్స్‌ మెడిసిన్‌.. వంటి వాటిలో మ్యూజిక్‌ థెరపీ కొంత ఫిట్‌ అవుతుంది. అందుకే ఈ రెండింటీని బ్యాలెన్స్‌ చేస్తున్నాను. నా బ్రాండ్, డ్రీమ్, లైఫ్‌ గోల్‌ అదే. రెండింటినీ ఎలా బ్యాలెన్స్‌ చేయగలుగుతున్నారు.. అని కొందరు అడుగుతుంటారు. బెస్ట్‌ డాక్టర్ని, అలాగే బెస్ట్‌ సింగర్‌ని కూడా అవ్వాలనేది నా డ్రీమ్‌. అందుకు ఎంత రిస్క్‌ అయినా చేస్తానని చెబుతుంటాను.  

► మా ఫ్రెండ్స్‌కు షేర్‌ చేస్తుంటాను
మా ఫ్రెండ్స్‌ అంతా తెలుగురానివారే. వాళ్లకు మా ముత్తాతగారి గురించి ఎంతసేపు చెప్పినా చాలా ఆసక్తిగా వింటారు. ఇంకా విషయాలు అడుగుతారు. నేను ఎంకిపాటలు పాడి, ఆడియో క్లిప్పింగ్స్‌ మా ఫ్రెండ్స్‌కు పంపిస్తుంటాను. ఆప్పటి పాటలన్నీ విలేజీ స్టైల్‌ అవడంతో ఒక్కసారిగా ఆ టైమ్‌ పీరియడ్‌ నుంచి ఈ పీరియడ్‌కు ఏదో కలిసిపోయిన  ఫీల్‌ కలుగుతుంది. ఒక్కోసారి నైన్టీన్త్‌ సెంచరీ అమ్మాయినేమో అనిపిస్తుంటుంది(నవ్వుతూ). వెస్ట్రన్‌ మ్యూజిక్‌ షోస్‌ కూడా చేస్తుంటాను. నన్ను తెలుగువారు కూడా గుర్తించాలి. అందుకే, ఇంగ్లిషు, తెలుగు రెండూ కవర్‌ చేస్తూ ఉంటాను. తెలుగు సినిమాల పాటలన్నీ పాడుతుంటాను. నిద్రలేస్తూనే ఏదో పాటతో నా డే మొదలైపోతుంది. వెస్ట్రన్, కర్ణాటిక్‌ మ్యూజిక్‌ నేర్చుకుంటున్నప్పుడే హిందీ, తెలుగు పాటలు పాడటం, స్పష్టంగా పదాలు పలకడం సాధన చేయడం అలవాటు చేసుకుంటూ వచ్చాను.

► గాయనిగా పేరు..
సింగర్‌గా బాగా గుర్తింపు తెచ్చుకోవాలని, మంచి మంచి పాటలు పాడాలనేది నా డ్రీమ్‌. అందుకోసం ఎంతదూరమైనా ప్రయాణిస్తాను. ఆ ప్రయత్నంలో ఎక్కడా ఆగకూడదు. అందుకే, ‘ఆహా వేదికగా జరిగే తెలుగు ఇండియన్‌ ఐడియల్‌ 2’ లో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చాను. ఇక్కడ ఎంతోమంది నుంచి నా వర్క్‌ని ఇంకా బెటర్‌ చేసుకుంటున్నాను. నేర్చుకోవాల్సింది చాలా ఉందని అర్ధమైంది. తెలుసుకుంటూ, నేర్చుకుంటూ ప్రయాణించడమే’’ అంటూ నవ్వుతూ వివరించింది శృతి నండూరి.  

– నిర్మలారెడ్డి
నండూరి వెంకట సుబ్బారావు రచయితగా తెలుగువారికి సుపరిచితులు. నండూరి రచించిన గేయ సంపుటి ‘ఎంకిపాటలు.’ తెలుగు సాహిత్యంలో ప్రణయ భావుకతకూ, పదాల పొందికకూ కొత్త అందాలు అద్దిన ఈ రచనను సాహిత్యకారులు గొప్పగా ప్రస్తావిస్తుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement