మురికి వాడ నుంచి ఏకంగా రూ. 900 కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా! | Who Came From Living In A Slum To Setting Up An Empire Worth $112 Million - Sakshi
Sakshi News home page

మురికి వాడ నుంచి రూ. 900 కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా! రియల్‌ స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌!

Published Wed, Dec 27 2023 5:36 PM

She Living In A Slum To Setting Up An Empire Worth 900 Crores - Sakshi

ఆమె ఎలాంటి డిగ్రీలు చేయలేదు. మురికి వాడల్లో పెరిగింది. అడుగడుగున అవమానాలు, కష్టాలు కడగళ్లే. అన్నింటిని ఓర్చుకుని మెరుగుపడుతుందనుకునే లోపే ఓ పెనువిషాదం అగాధంలో పడేసింది. ఒకరకంగా అదే ఆమెలో కసి పెంచి చిన్న చితక ఉద్యోగాలు కాదు వ్యాపారవేత్తగా కోట్లు గడించాలనుకునే ఆలోచనకు తెరతీసింది. అదే ఆమెను నేడు 900 కోట్ల సామ్రజ్యానికి అధిపతి చేసింది. పైగా రియల్‌ స్మమ్‌డాగ్‌ మిలియనీర్‌గా ప్రశంసలుందుకునేలా చేసింది కూడా.

ఆమె పేరు కల్పనా సరోజ్‌. మహారాష్ట్రలోని విదర్భలో దళిత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి కానిస్టేబుల్‌ కావడంతో పోలీస్‌ క్వార్టర్స్‌లోనే ఆమె కుటుంబ నివశించేది. అయితే దళిత కుటుంబం కావడంతో సమాజంలో దారుణమైన వివక్షణు ఎదుర్కొంది. ఆమెకు మగ్గురు సోదరీమణలు, ఇద్దరు సోదరులు ఉన్నారు. చిన్నతనంలో పాఠశాలల్లో జరిగే ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేకుండా నిషేధించారు టీచర్లు. కనీసం తోటి విద్యార్థులతో కూర్చోకూడదు, తినకూడదు. అందుకు పాఠశాల టీచర్లు, తోటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేవారు కాదు. అయినప్పటికీ తనను చదువుకోడానికి అంగీకరించడమే గొప్ప బహుమతిగా భావించింది కల్పనా సరోజ్‌.

ప్రతిభావంతురాలైనప్పటికీ దళితురాలు కావడంతో చిన్నతనంలోనే పెళ్లి చేసేశారు ఆమె కుటుంబ సభ్యులు. భర్తతో కలిసి ముంబైకు చేరుకుంది. అక్కడ అత్తారింట్లో మొత్తం పదిమంది వ్యక్తులు ఉండే కుటుంబంలో ఆమె గొడ్డు చాకిరీ చేయాల్సి వచ్చేది. దీంతో ఆమెకు పోషకాహరం లోపం తలెత్తి నీరసించిపోయింది. ఆమె స్థితిని చూసి చలించిపోయినన తండ్రి అక్కడ నుంచి ఆమెను తీసుకొచ్చేశాడు. అయితే చుట్టుపక్కల వాళ్లు కూతుర్ని పుట్టింట్లో పెట్టుకుంటారా! అని ఈసడించడం మొదలుపెట్టారు. ఈ అవమానాలను తట్టుకోలేక ఏకంగా రెండు బాటిళ్ల ఎలుకల మందు తాగేసింది కల్పనా సరోజ్‌.

ఆమె అత్త దీన్ని గమనించడంతో కొద్దిలో ప్రాణాపాయం తప్పింది. దేవుడిచ్చిన ఈ రెండో అవకాశాన్ని ఆత్మనూన్యతతో వృధా చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. మళ్లీ ముంబైకి తిరిగొచ్చి తన మేనమామతో కలిసి ఉండాలని నిశ్చయించుకుంది. అప్పుడే అసిస్టెంట్‌ టైలర్‌గా పనిచేస్తూ ఆ వృత్తిలో మంచిగా రాణించింది. దీంతో ఒక గదిలో గడిపే ఆమె కుటుంబం కాస్త ఫ్లాట్‌లోకి వెళ్లింది. పరిస్థితి మెరుగుపడుతుందని అనుకునేలోపు చెల్లి అనారోగ్యం ఆమె కుటుంబాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ఆమె వైద్యానికి సరిపడా డబ్బులు లేకపోవడంతోనే మరణించిందన్న విషయం ఆమెలో గట్టి కసిని పెంచింది. ఏదో చిన్నా చితకా ఉద్యోగాలతో సరిపెట్టకూడదు తాను వ్యాపారవేత్తగా ఎదగాల్సిందేనని గట్టిగా డిసైడ్‌ అయ్యిపోయింది కల్పనా సరోజ్‌.

ఊహించని ములుపు..
అప్పుడే ప్రభుత్వం అందించే పథకాల గురించి తెలుసుకుంది.  వెంటనే లోన్‌కి అప్లై చేసి చిన్న ఫర్నీచర్‌ వ్యాపారాన్ని ప్రారంభించింది. అత్యాధునిక ఫర్నిచర్లను చాలా చౌక రేటుకే విక్రయిస్తు లాభాలు గడిస్తుంది. ఓ పక్క టైలరింగ్‌ కూడా కొనసాగించింది. అలా రోజుకి దాదాపు పదహారు గంటలు పనిచేసేది. సరిగ్గా ఆ టైంలో రియల్‌ ఎస్టేట్‌ వివాదంలో చిక్కుకుంది. రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేసి భూమికి సంబంధించిన లిటిగేషన్‌ను పరిష్కరించింది. ఇదే ఆమెకు అప్పులో ఊబిలో చిక్కుకున్న మెటల్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ కమానీ ట్యూబ్స్‌ కార్మికులు బాధ్యతను స్వీకరించే అవకాశం తెచ్చిపెట్టింది.

ఇది ఆమె తన తొలి ఆరర్డర్‌గా భావించి పదిమంది సభ్యులతో కూడిన బృందంతో ఆ కంపెనీని మళ్లీ లాభాల బాట పట్టించింది. ఆ తర్వాత ఆ కంపెనీకే చైర్‌ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టింది. అలా ఇవాళ సుమారు 900 కోట్ల సామ్రాజ్యాని అధిపతి అయ్యింది కల్పనా సరోజ్‌. పైగా డిగ్రీలు, ఎంబీయేలు నన్ను ఈ స్థితికి తీసుకురాలేదని, కేవలం పట్టుదల, ఆత్మవిశ్వాసమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని సగర్వంగా చెబుతోంది కల్పనా సరోజ్‌.  ఆమె స్థైర్యానికి, తెగువకు హ్యాట్సాఫ్‌ అనాల్సిందే కదూ!.

(చదవండి: మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన పది సేఫ్టీ యాప్‌లు ఇవే..!)

Advertisement
 
Advertisement
 
Advertisement