Shatabdi: ఇలాంటి కూతురు చచ్చినా పర్లేదు అన్నారు.. కానీ ఇప్పుడు

Shatabdi: Incredible Inspirational Story Of Gold Medalist Woman - Sakshi

ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం తలవంచక తప్పదు అంటున్నారు శతాబ్ది. దివ్యాంగురాలిగా మారిన తాను సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని సగర్వంగా చెబుతున్నారు. బ్యాంక్‌ మేనేజర్‌గా, క్రీడాకారిణిగా, సామాజిక కార్యకర్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ‘శతాబ్ది’ జీవన ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం.

అందుకే ఆ పేరు పెట్టారు..
చిన్నతనం నుంచే హైపర్‌ యాక్టివ్‌. ఒక్కచోట కూడా కాలు నిలవనే నిలవదు. ఎల్లప్పుడూ ఉరుకులూ.. పరుగులే. అందుకే.. వేగంగా ప్రయాణించే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌(రైలు) పేరిట.. తమ అమ్మాయికి శతాబ్ది అని నామకరణం చేశారు ఆ తల్లిదండ్రులు. గెంతులు వేస్తూ ఎప్పుడూ సందడి చేసే తమ బిడ్డను చూసుకుంటూ మురిసిపోయారు. కానీ... 21 ఏళ్ల వయస్సులో శతాబ్దికి జరిగిన ప్రమాదం వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. మేడ మీది నుంచి జారిపడ్డ శతాబ్ది.. శాశ్వతంగా చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సిన పరిస్థితి.

నా ప్రపంచం మొత్తం కుప్పకూలిపోయింది..
‘‘ఆరోజు నా కేక విని అమ్మానాన్న పరిగెత్తుకుని వచ్చారు. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సుమారు 5 గంటల తర్వాత నాకు స్పృహ వచ్చింది. నడుము కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. ఇక జీవితంలో నేను నడవలేనని డాక్టర్లు చెప్పారు. అప్పుడే నా ప్రపంచం మొత్తం కూలిపోయినట్లు అనిపించింది. పూర్తిగా విషాదంలో మునిగిపోయాను. ఇతరుల సాయం లేకుండా కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థితి. సిగ్గు అనిపించేది. భయం వేసేది. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. అలాంటి సమయంలో బంధువులు తమ మాటలతో మరింత చిత్రవధ చేసేవారు.


ఫొటో: హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే

చచ్చిపోవడమే మేలు అనేవారు..
‘‘ఇలాంటి కూతురి వల్ల ఏం ప్రయోజనం. ఇంత ఘోరమైన పరిస్థితి అనుభవించే కంటే చచ్చిపోవడమే మంచిది’’ అని అమ్మానాన్నలను మరింతగా బాధపెట్టేవారు. అయితే, నా కుటుంబం నాకు అండగా నిలిచింది. ‘‘నా కూతురు కచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తుంది. తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని నాన్న వాళ్లకు సమాధానమిచ్చేవారు. ఆరేళ్లపాటు ఆస్పత్రే నాకు ఇల్లు. నాకు వైద్యం చేయించడానికి నా కుటుంబం చాలా కష్టపడింది. అమ్మ తన పెన్షన్‌ డబ్బుతో బిల్లు కట్టేది. ఇవన్నీ చూస్తూ నా మీదే నాకే జాలివేసేది. అప్పుడే బలంగా నిర్ణయించుకున్నాను. ‘‘ఈ దుర్ఘటనకు నా జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఇవ్వకూడదు. నాకంటూ గుర్తింపు కావాలి’’ అని అనుకున్నాను.

మొదటి ప్రయత్నంలోనే...
అందుకు అనుగుణంగానే బ్యాంకు ఉద్యోగం సాధించేలా అహర్నిశలు కృషి చేశాను. మొదటి ప్రయత్నంలోనే ఎగ్లామ్‌ పాసై జాబ్‌ తెచ్చుకున్నాను. ‘‘మేనేజర్‌ తండ్రిని’’ అంటూ నాన్న నన్ను చూసి గర్వపడేవారు. అప్పుడు నా ఆనందం అంతా ఇంతాకాదు. ఎవరైతే నన్ను చచ్చిపో అన్నారో వారికి గట్టిగా సమాధానం ఇచ్చినట్లయింది. కానీ విధికి నా సంతోషం చూడబుద్ధికాలేదేమో! ఆరు నెలల్లోనే నాన్న చనిపోయారు. నా గుండె పగిలింది. నేను మేడ మీది నుంచి కిందపడిపోయినపుడు కూడా అంతటి బాధను అనుభవించలేదు.ఆ బాధాకరమైన ఘటన నుంచి బయటపడేందుకు సామాజిక కార్యక్రమాల్లో భాగమవడం అలవాటు చేసుకున్నాను. ఆర్మీ ఆఫీసర్‌ అయి దేశానికి సేవ చేయాలన్న చిన్ననాటి కల ఎలాగో నెరవేరలేదు కాబట్టి... సమాజ సేవ చేయాలని ఫిక్సయ్యాను. 


ఫొటో: హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే

31 వయస్సులో మళ్లీ
అయితే, పారాలింపిక్స్‌లో దీపా మాలిక్‌ను చూసిన తర్వాత నాకు కూడా క్రీడల్లో పాల్గొనాలనిపించింది. 31 ఏళ్ల వయస్సులో కోచ్‌ సహాయంతో షాట్‌పుట్‌, జావెలిన్‌ త్రో, డిస్కస్‌త్రో ప్రాక్టీసు చేశాను. బరువులు ఎత్తిన ప్రతీసారీ ప్రాణం పోయినట్టు అనిపించేది. క్రమేణా.. అలవాటైపోయింది. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మూడు విభాగాల్లోనూ స్వర్ణం సాధించాను. అమ్మ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. నాన్నే గనుక ఉండి ఉంటే ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యేవారు.

న్యూస్‌ పేపర్లలో నా గురించి కథనాలు చూసిన ప్రతిసారి నాన్నే గుర్తుకువస్తారు. ఇలాంటి కూతురి వల్ల ఏం ప్రయోజనం అన్న వారికి వీటిని సమాధానంగా చూపేవారు అనిపిస్తుంది. ప్రస్తుతం కామన్‌వెల్త్‌ క్రీడల కోసం సన్నద్ధమవుతున్నాను. కచ్చితంగా పసిడి సాధిస్తాను. ఆరేళ్ల పాటు నరకం అనుభవించిన నేను.. విధిరాత అని సరిపెట్టుకోకుండా ముందడుగు వేశాను కాబట్టే.. వీల్‌చైర్‌లో కూర్చునే నా కలలు నెరవేర్చుకున్నాను’’ అని తన జీవితంలోని విషాదాలు, వాటి నుంచి తేరుకుని ఎదిగిన విధానాన్ని హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శతాబ్ది పంచుకున్నారు.

-వెబ్‌డెస్క్‌
చదవండి: Shana Parmeshwar: అలాంటప్పుడు నాకు ఎదురయ్యే ప్రత్యేక సవాళ్లు ఏముంటాయి?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top