Shabnam: పవర్‌ ఆఫ్‌ ఉమెన్‌

Shabnam: Woman electrician doing door to door electrical fitting work in Jammu - Sakshi

ఆత్మవిశ్వాసం, అంకితభావంతో ముందడుగు: షబ్నమ్‌

జమ్మూలోని  దోడా జిల్లాలో ‘ఎలక్ట్రిషియన్‌’ అంటే మగవాళ్లు మాత్రమే గుర్తుకు వస్తారు. ‘మహిళా ఎలక్ట్రిషియన్‌’ అనే మాట, దృశ్యం ఊహకు కూడా అందనిది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిషియన్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన షబ్నమ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది...

జమ్మూ దోడా జిల్లాలోని మారుమూల గ్రామం కహరకు చెందిన షబ్నమ్‌ పదవ తరగతి పూర్తయిన తరువాత శ్రీనగర్‌లోని పాలిటెక్నిక్‌ కాలేజీలో ఎలక్ట్రిషియన్‌ కోర్సులో డిప్లొమా చేసింది. తండ్రి చనిపోవడంతో ఆ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ఆర్థికంగా అండ లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఆమె ఎలక్ట్రిషియన్‌గా పని మొదలు పెట్టింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది. కొద్ది కాలంలోనే షబ్నమ్‌కు ఎలక్ట్రీషియన్‌గా మంచి పేరు వచ్చింది.

‘తప్పనిసరి పరిస్థితుల్లో ఎలక్ట్రిషియన్‌ వృత్తిలోకి వచ్చాను. అయితే నా పనితీరును చాలామంది మెచ్చుకోవడంతో ఉత్సాహం వచ్చింది. నాపై నాకు నమ్మకం పెరిగింది. ఈ ఫీల్డ్‌లోనే పనిచేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను’ అంటుంది షబ్నమ్‌. నిజానికి దోడా ప్రాంతంలో ఎలక్ట్రిషియన్‌ అంటే మగవాళ్లు మాత్రమే.

‘అమ్మాయిలు ఎలక్ట్రిషియన్‌గా  పని చేయడం ఏమిటీ!’ అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసేవాళ్లే. ఈ విషయం తెలిసి కూడా ఎలక్ట్రిషియన్‌గా అడుగులు మొదలుపెట్టింది షబ్నం.
‘ఇది మగవాళ్లు మాత్రమే పనిచేయాల్సిన రంగం. ఇది ఆడవాళ్లు మాత్రమే పనిచేయాల్సిన రంగం అంటూ ఏదీ లేదు’ అంటుంది షబ్నమ్‌.

ఎంటెక్‌ చదువుకున్న రషీద్‌ఖాన్‌ జమ్మూలో నిపుణులైన ఎలక్ట్రిషియన్స్‌తో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఒక వెబ్‌సైట్‌ కూడా లాంచ్‌ చేయనున్నాడు. ఖాన్‌ బృందంలో ఉన్న ఒకే ఒక మహిళ షబ్నమ్‌. ‘వీరితో ఎలాంటి భయం లేదు. మేమందరం ఒక కుటుంబం’ అంటుంది షబ్నమ్‌. చాటుమాటుగానే కాదు... ‘అమ్మాయిలు ఎలక్ట్రిషియన్‌ వర్క్‌ చేయడం ఏమిటి!’ అని ముఖం మీదే అన్నవాళ్లు ఉన్నారు. అయితే అలాంటి మాటలను షబ్నమ్‌ ఎప్పుడూ పట్టించుకోలేదు.

‘ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను నిరూపించుకోవాలి. ఇది మహిళలు పనిచేసే రంగం కాదు అనే భావన నుంచి బయటికి రావాలి. ప్రతి రంగంలోనూ మంచి, చెడు ఉంటాయి. చెడును మాత్రమే చూస్తే ఉన్నచోటే ఉండిపోతాం. ప్రతి కొత్త అడుగులో కించపరిచే విధంగా మాట్లాడేవాళ్లు, ప్రతికూలంగా మాట్లాడే వాళ్లు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారికి మన పనితోనే సమాధానం చెప్పాలి’ అంటున్న షబ్నమ్‌ ఎలక్ట్రిషియన్‌గా పనిచేయాలనుకునే మహిళలకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top