సరళ సుందర సునిశిత మమత

Sarala Sundara Sunishitha Mamatha Translated Book Review In Sahityam - Sakshi

అనువాదకురాలి మాట 

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సాహిత్యం, చిత్రకళ, సంగీతం మీద అపారమైన ప్రేమ. స్వయంగా కవిత్వం రాస్తారు, చిత్రాలు గీస్తారు. 1995లో ఉపలబ్ధి శీర్షికన తొలి కవితా సంపుటి వెలువరించారు. మరో సంపుటి నదీమా బెంగాలీ కవితాలోకంలో ప్రఖ్యాతి చెందింది. ఈ ఏడాదే ఆమె బృహత్‌ కవితాసంపుటి కబితా బితాన్‌ వెలువడింది. మమతా బెనర్జీ కవిత్వంలోని ఎంపిక చేసిన కవితలను ‘సరళ సుందర సునిశిత మమత’ పేరుతో వంగభాష నుంచి నేరుగా తెలుగులోకి అనువదించారు డాక్టర్‌ సామాన్య. ప్రచురించింది పాలపిట్ట బుక్స్‌. తన అనువాదం గురించి సామాన్య ఇలా చెబుతున్నారు.

‘‘చైనా తత్వవేత్త జువాంగ్జి తనకు మంత్రిపదవి ఇస్తున్నామని చెప్పడానికి వచ్చిన రాజప్రతినిధులతో ఎంతో తృణీకారంగా ఇలా అంటాడు: ‘‘తాబేలుకు బురదలో ఉండటమే ఆనందం. చచ్చి, డిప్పగా మారి పూజా మందిరంలో ధూపదీప నైవేద్యాలు పొందడం కాదు. నేను తాబేలు లాంటివాడిని, నా బురదలో నన్నుండనివ్వండి’’ అని. దీదీ తాత్వికత కూడా అచ్చంగా అదే. ఇక్కడ అనువాదంలో రాలేదు కానీ, ఆమె రాసిన కుర్చీ అనే కవిత అణువణువూ అధికారం పట్ల ఆమెకున్న నిర్లిప్త, నిరాసక్త ధోరణిని తెలియపరుస్తుంది. ఆ తాత్వికత అంత ఉచ్ఛస్థాయిలో మరింకెవరిలోనూ నాకు కనిపించలేదు. అందుకని ఈ సుధీర మమత అంటే నాకు ఎంతో ప్రేమ.

ఇక్కడ అనువదించిన దీదీ కవితలు ఆమె అనేక రచనల నుండి ఏరి కూర్చినవి. ఈ కొన్ని కవితల కోసం దీదీ ఎన్నో కవితలు చదివాను. కవితల అనువాదం పేరుతో ఆమె అంతరంగపు అణువణువులోకి ప్రయాణం చేశాను. అమ్మ కోసం ఇంకా వెదుక్కునే చిన్ని బాలికగా దీదీ ఒక చోట తటస్థ పడితే, మరో చోట ఆమె ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని ప్రశ్నించే మానవీయ. ఇంకోచోట దుఃఖం సముద్రంలా ముంచేస్తున్నా ముఖంపై కనిపించనీయకు అని బార్గబోధ చేసే సీనియర్‌ స్నేహిత. మేఘాలు, పావురాలు, గుంపునుండి తప్పిపోయిన కాకిపిల్ల, ఒంటరిగా వాహనంలో వెళ్లే శవం... ఇవన్నీ సూటిగా ఆమె సున్నిత హృదయంలోకి ప్రయాణం చేసి ఆమెను కదలించినపుడు రాలిన ఆనంద బాష్పాలు, దుఃఖాశ్రువులే ఆమె అనేక కవితలు. దీదీ నాలాగా, మా అమ్మలాగ, నా మంచి స్నేహితురాలిలాగా ఒక సాదాసీదా అమ్మాయి. అదే సమయంలో ఆమె ఏడేడు సముద్రాల అవతల మఱిచెట్టు తొర్రలో వున్న రాక్షసుడి ప్రాణపు చిలుకని పట్టి బంధించగల సరళ సుందర సుధీర. మరి ఆమెను ప్రేమించకుండా ఉండగలగటం ఎవరికయినా ఎలాసాధ్యం! అలా పీకల్లోతు ప్రేమలో మునిగి, మురిసి చేసిన అనువాదాలు ఈ కవితలు.’’ 

పుస్తకం: సరళ సుందర సునిశిత మమత
మమతా బెనర్జీ బెంగాలీ కవితల అనువాదం
తెలుగు: డాక్టర్‌ సామాన్య
ప్రచురణ : పాలపిట్ట బుక్స్‌ 
ఫోన్‌: 9848787284

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top