Sirivennela Seetharama Sastry: నా ఉచ్ఛ్వాసం కవనం.. నా నిశ్వాసం గానం 

Sakshi Special On Sirivennela Seetharama Sastry

Sirivennela Seetharama Sastry Passed Away: నా మొదటి సినిమా ఏ ‘కుక్క’ అని అయి ఉంటే నా గతేంకాను అని నవ్వాడాయన ఒకసారి. కాని ‘విధాత తలంపు’ అలా ఎందుకు ఉంటుంది. విధాత ఆయనకు ‘సిరివెన్నెల’ రాసి పెట్టాడు. విధాత ఆయనకు తెలుగువారికి కాసిన్ని మంచి పాటలు ఇచ్చి రావోయ్‌ అని భువికి పంపాడు. విధాత ఆయనను నీ మార్గాన నడుచు శిష్యకవులను సిద్ధం చేయమని ఆదేశించాడు. ఇపుడు? ఇక చాలు నేను వినాల్సిన నీ పాటలు ఉన్నాయి... తెలిమంచు వేళల్లో మబ్బులపై మార్నింగ్‌ వాక్‌ చేస్తూ ఆ స్వర సంచారం పదసంవాదం చేద్దాం పద అని వెనక్కి పిలిపించుకున్నాడు.

‘కొండతల్లి నేలకిచ్చు పాలేమో
నురుగుల పరుగుల జలపాతం
వాగు మొత్తం తాగేదాకా తగ్గదేమో
ఆశగా ఎగిరే పిట్టదాహం’...
కవి ఊహ అది. సిరి ఉన్న కవి ఊహ.

‘గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా’..
ఓహో.. ఏమి ఇమేజరీ.

‘ఎటో వెళ్లిపోయింది మనసు’
ఇంత సరళమా పల్లవి?

‘పుట్టడానికీ పాడె కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ’
ఈ చేదు వాస్తవం పలకనివాడు కవి ఎలా అవుతాడు?

‘ఏదీ సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం’ ఈ హితం చెప్పే కవి లేని సమాజం అదేల?

సిరివెన్నెల సీతారామశాస్త్రి సినీ కవిగా చిరాయువును పొందారు.
ఆయన రాజకీయ భావాల పట్ల అభ్యంతరాలు ఉన్నవారు సైతం
ఆయన పాటను ఆనందించారు. ఆస్వాదించారు.

సిరివెన్నెల పండిత కవి. తెరపై పండు వెన్నెల కాయించిన కవి.
ఆయనకు నివాళి.

‘బటర్‌ఫ్లై’ ఎఫెక్ట్‌ అంటే?
ఇక్కడ జరిగే ఘటన ఎక్కడి ప్రతిఫలనానికో అని.
భలేవాడివే. అది విధాత తలంపు కదా.

1980.. ‘శంకరాభరణం’ రిలీజైంది. ఊరూవాడా సంబరాలు. సన్మానాలు. కాకినాడకు యూనిట్‌ వస్తోందట. సన్మానం చేయాలట. ఆ ఊళ్లో అప్పటికి ఒక బుల్లి కవి ఉన్నాడు. ప్రతి సాహిత్య సభలో ప్రారంభ గీతాన్ని పాడుతూ ఉంటాడు. ‘అతణ్ణి అడుగుదాం... విశ్వనాథ్‌ని కీర్తిస్తూ ఒక పాట కట్టమందాం’ అనుకున్నారు మిత్రులు. ‘నేను విశ్వనాథ్‌ మీద కట్టను. వ్యక్తి మీద పాట ఏమిటి? శంకరాభరణం సినిమా మీద కడతాను. తెలుగువారి కళాదృష్టి దాహార్తిని తీర్చడానికి గంగలా ఆ సినిమా అవతరించింది.

కనక గంగావతరణం పేరుతో గేయం రాస్తాను’ అన్నాడా కవి. రాశాడు. సన్మానం జరిగే రోజు వచ్చింది. యూనిట్‌ని చూడటానికి జనం విరగబడితే పోలీసులు ఈ బుల్లి కవిని లోపలికి పంపలేదు. కవికి అహం ఉంటుంది. ‘నా పాట వినే అదృష్టం విశ్వనాథ్‌కు లేదు’ అనుకుంటూ అక్కణ్ణుంచి వచ్చేశాడు. అంతేనా? ‘నా పేరు ఎప్పటికైనా అతనికి తెలుస్తుంది’ అనుకున్నాడు. నిజంగానే తెలిసింది కొన్నాళ్లకు. సిహెచ్‌.సీతారామశాస్త్రి. చెంబోలు సీతారామశాస్త్రి.

‘కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమథాలోక హిమదీపం’... అని రాశాడు వేటూరి ‘సాగర సంగమం’లో. ‘శంకరా నాద శరీరాపరా’ అని కూడా రాశాడాయన ‘శంకరాభరణం’లో. కె.విశ్వనాథ్‌కు నిజంగా తన సినిమాలో ‘గంగావతరణం’ పెట్టాల్సి వస్తే వేటూరి సంతోషంగా రాసేవాడు. విశ్వనాథ్‌ సినిమాలకు వేటూరిది సింగిల్‌ కార్డ్‌. కాని ‘జననీ జన్మభూమి’లో ఆ సింగిల్‌ కార్డ్‌కు తోడు సిహెచ్‌ సీతారామ శాస్త్రి అనే పేరు తోడయ్యింది.

ఆ సినిమాలో ‘గంగావతరణం’ అనే చిన్న డాన్స్‌ బ్యాలేకు సీతారామశాస్త్రి గతంలో రాసిన ‘గంగావతరణం’లోని కొన్ని పంక్తులను వాడారు. అలనాడు కాకినాడలో సీతారామశాస్త్రి రాసిన గేయం ఆ నోట ఈ నోట విశ్వనాథ్‌ దాకా వెళ్లి అది విని ఆయన ముచ్చటపడి సినిమాలో వాడాల్సి వచ్చింది. తెలుగు తెర మీద సీతారామశాస్త్రికి అది తొలి పాట లెక్క ప్రకారం. అంతటితో ఆ పాట ఆగిపోయేదేమో. కాని కొనసాగాల్సి వచ్చింది. ఎందుకంటే అలా కొత్త కవి చొరబాటుకు వేటూరి అలిగాడు.

‘ఇక విశ్వనాథ్‌కు పాటలు రాయను’ అన్నాడు. విశ్వనాథ్‌కు అప్పటికి సీతారామశాస్త్రి చేత రాయించాలని లేదు. సీతారామశాస్త్రి ఎవరో కూడా ఎప్పుడూ చూళ్లేదు. దాంతో ఆయన ‘స్వాతిముత్యం’ సినిమాకు సినారెను, ఆత్రేయను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ తర్వాత ‘సిరివెన్నెల’ తీయాలి. ఇటు చూస్తే తనకు అలవాటైన వేటూరి అలిగి ఉన్నాడు. అటు చూస్తే సీనియర్లు తనకు ఎక్కువ టైమ్‌ ఇవ్వలేనంత బిజీగా ఉన్నారు. ఏం చేయాలి? బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌ అంటే అదే. ఎవరో అలిగారు. సీతారామశాస్త్రికి ‘సిరివెన్నెల’ వచ్చింది.

‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం’..

1985 అక్టోబర్‌ 4న అఫీషియల్‌గా సీతారామశాస్త్రి తొలి పాట రికార్డ్‌ అయ్యింది. పాడటానికి వచ్చిన బాలూ ఆ వొత్తుజుట్టు, దళసరి కళ్లద్దాలు, పలుచటి శరీరం ఉన్న కవిని చూసి ‘మీరు కవిగా అమిత శక్తిమంతులు. రాబోయే దశాబ్దాలు మీవే’ అన్నాడు. అలాగే జరిగింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు దశాబ్దాల పాటు సీతారామశాస్త్రి పాట సాగిపోయింది. మొదటి సినిమాలోనే ప్రశంసల వెన్నెల కురిసింది. ఇంటి పేరు సిరివెన్నెల అయ్యింది.

మద్రాసులో ఈ క్షణం కోడంబాకంలో కబురు పుడితే మరునిమిషం అది తడ దాకా పాకుతుంది. ఎవరో కొత్త కవి అట. సీతారామశాస్త్రి అట. విశ్వనాథ్‌కు రాస్తున్నాడట. నిజమే. మరి మసాలా పాట రాస్తాడా? వెళ్లిన వాళ్లకు ఆ కవి చెప్పిన జవాబు.. పెట్టిన షరతులు మూడు. 1. స్త్రీలను కించ పరచను 2. సమాజానికి చెడు సందేశాలు ఇవ్వను. 3. యువతకు కిర్రెక్కించే పాట రాయను. విన్న నిర్మాతలు సడేలే అనుకుని ముఖం తిప్పుకుని పోవడం మొదలెట్టారు. కాని సుకవి సుగంధం, సత్కవి మకరందం ఎవరు వదలు
కుంటారు. ‘శృతిలయలు’ విడుదలైంది. అంతవరకూ ఎప్పుడూ వినని అన్నమయ్య కీర్తన అందులో ఉంది.

‘తెలవారదేమో స్వామి
నీ తలపుల మునకలో అలసిన దేవేరి 
అలమేలు మంగకూ’...

ఈ కీర్తనను వెతికి పట్టాడంటే విశ్వనాథ్‌ ఎంత గొప్పవాడవ్వాలి. ఆ తర్వాత ‘నంది’ అవార్డులకు ఆ పాట వస్తే జడ్జిగా ఉన్న సి.ఎస్‌.రావు ‘ఏమయ్యా... ఇప్పుడు అన్నమయ్యకు నంది అవార్డు అవసరమా’ అనంటే ‘అది సీతారామశాస్త్రి రాసిన పాటండీ’ అని చెప్పారు. అన్నమయ్య రాసేడా అనిపించేలా సీతారామశాస్త్రి రాసిన పాట. ‘నంది’ ఆయన ఇంటికి నడుచుకుంటూ వచ్చింది.

రాంగోపాల్‌ వర్మ గొప్ప టెక్నీషియన్‌. కనుక గొప్పవాళ్లే తన సినిమాకు పని చేయాలనుకున్నాడు. సీతారామశాస్త్రితో కాలేజీ పాటా?

బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది
దేనికో ఓటు చెప్పరా?

మిగిలిన సినిమా అంతా కుర్రకారు ఎంత ఉద్వేగంగా చూశారో ఈ పాటకు అంత ఉత్సాహంగా టక్కులు ఊడబెరికి గంతులేశారు. అయినా సరే.. ‘కమర్షియల్‌ సాంగ్‌’ అనేది ఒకటి ఉంటుంది. శాస్త్రిగారు ఆ ఒక్క తరహా కూడా రాసేస్తే? రాయలేడా ఆయనా? ‘బొబ్బిలి రాజా’ వచ్చింది. ‘బలపం పట్టి భామ బళ్లో.. అఆఇఈ నేర్చుకుంటా’... పాటా సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌. ఇప్పుడు... సిరివెన్నెల సీతారామశాస్త్రి ‘సమగ్ర సినీ కవి’ అయ్యాడు.

హంసలా బతకాలని నిశ్చయించుకోవాలే గాని బతకొచ్చు. కాకిలా కశ్మలంలో వాలాలనుకుంటే వాలొచ్చు. చాయిస్‌ మనదే. నిర్ణయం తీసుకుంటే అలా బతికే వీలు ప్రకృతి కల్పిస్తుంది. ‘శుభ్రమైన పాట’ రాయాలని సీతారామశాస్త్రి అనుకున్నాడు. దారిన వెళుతుంటే అదిగో ఆ మంచి పాట రాసింది అతనే అనుకోవాలి... ఏదైనా సభకు పిలవాలి... ఎదుటపడితే నమస్కారం పొందేలా ఉండాలి... ‘శాస్త్రిగారు’లా ఉండాలి... ‘గాడు’... పేరు చివర పొరపాట్న కూడా పడకూడదు.

ఆయన తన తుదిశ్వాస వరకూ ‘శాస్త్రిగారు’గానే ఉన్నాడు. పల్లవి మర్యాద. చరణం గౌరవం. కాంటెక్స్‌›్టలో పెట్టి చూపితే తప్ప సిరివెన్నెల గొప్పతనం అర్థం కాదు. గండు చీమ, బెల్లం, ఒడి, తడి, గొళ్లెం, తాళం వంటి పదాలు పాటలుగా చెలామణి అవుతున్న రోజుల్లో ‘చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి’ రాయడం కోసం కలాన్ని రిజర్వ్‌ చేసి పెట్టుకోవడం సిసలైన వ్యక్తిత్వం. అసలైన సంస్కారం.

సరే. ఈ కవి పండితుడు కదా. ఈతనికి గ్రామీణుడి పదం తెలుసా... జానపదుని పాదం తెలుసా? ‘స్వయం కృషి’ విడుదలైంది. ‘సిగ్గూ పూబంతి యిసిరే సీతామాలచ్చి’ రాశాడు. 
‘రాముడి సిత్తంలో కాముడు సింతలు రేపంగా’ అని జానపద శృంగారం ఒలికించాడు. ‘ఆపద్బాంధవుడు’లో? ‘ఔరా అమ్మకచెల్ల... ఆలకించి నమ్మడమెల్లా... అంత వింత గాధల్లో ఆనందలాల’ రాశాడు. ‘శుభసంకల్పం’లో ‘నీలాల కన్నుల్లో సంద్రవే నింగి నీలవంతా సంద్రవే’ అని బెస్తపడవలో మీన మెరుపు వంటి పదాలను అల్లాడు. సిరివెన్నెలకు రాని విద్య లేదు.

పాట వచ్చి దాని మీద కేవలం డబ్బు సంపాదించేవాడు సగటు కవి అవుతాడు. దాని ద్వారా సమాజాన్ని జాగృతం చేయాలని తపించేవాడు ఉదాత్త కవి అవుతాడు. ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ అని రాశాడు సిరివెన్నెల. సమాజంలో పాలకుల్లో ఎంత పెడధోరణి ఉన్నా ఎన్ని అకృత్యాలు సాగుతున్నా ‘మనకెందుకులే’ అని సాగిపోయే జనం ఈ పాటను విని భుజాలు తడుముకున్నారు.

తమ నిస్సహాయతకు సిగ్గుపడ్డారు. ‘ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకు అటు ఇటు ఎటో వైపు’ అని ‘అంకురం’లో రాశాడు. ఒక్కళ్లే నడవడానికి భయమా? ‘మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి’ అని చెప్పాడు. ఎంత ధైర్యం ఇలాంటి కవి పక్కన ఉంటే. ‘నువ్వు తినే ప్రతి మెతుకు ఈ సంఘం పండించింది’ అన్నాడు ‘రుద్రవీణ’లో. ‘రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా... తెప్ప తగల బెట్టేస్తావా ఏరు దాటగానే’ అని ఈసడిస్తాడు. ‘నిత్యం కొట్టుకుచచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా.. దాన్నే స్వరాజ్యమందామా’... అని ఆయన ఈ దేశపు వర్తమానాన్ని ఎద్దేవా చేస్తాడు.

ఒక్క పాట వేయి మోటివేషనల్‌ స్పీచ్‌లకు సమానం. నిరాశలో కూరుకుపోయి, నిర్లిప్తతలో కుదేలైన వారికి లే.. లేచి నిలబడు అని ఉపదేశం ఇచ్చినవాడు సిరివెన్నెల. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అన్నాడు. సిరివెన్నెలకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 40 ఏళ్ల వయసు కలిగిన తండ్రి చనిపోయాడు. ఇద్దరు తమ్ముళ్లు. ఇద్దరు చెల్లెళ్లు. జీవచ్ఛవంలా మారిన తల్లి. వారి కోసం బతికాడు సిరివెన్నెల. అందుకే–

‘నొప్పిలేని నిముషమేది జననమైన మరణమైన
జీవితాన అడుగడుగున
నీరసించి నిలిచిపోతే నిముషమైన నీది కాదు
బతుకు అంటే నిత్యఘర్షణ
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది
అంతకంటే సైన్యముండునా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’... అని రాశాడు.

‘మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు’ అని ‘శ్రీకారం’ కోసం ఆయనే రాశాడు.  ‘భయం లేదు భయం లేదు నిదర ముసుగు తీయండి... తెల్లారింది లెగండోయ్‌’ అని కోడికూతను వినిపించాడు.

‘ఒరే ఆంజనేయులు... తెగ ఆయాస పడిపోకు చాలు
మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు
కరెంటు రెంటు ఎట్సెట్రా మన కష్టాలు
కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్లు
నైటంతా దోమల్తో ఫైటింగే మనకు గ్లోబల్‌ వార్‌
భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడుకు గోలీమార్‌’... 
అని ‘అమృతం’ టైటిల్‌ సాంగ్‌. రోజూ వింటే బి.పి ట్యాబ్లెట్‌ అవసరం రానే రాదు.

‘నా మొదటి సినిమా ఏ ‘కుక్క’ అని అయి ఉంటే నా గతేంకాను’ అని నవ్వాడాయన ఒకసారి. కాని ‘విధాత తలంపు’ అలా ఎందుకు ఉంటుంది. విధాత ఆయనకు ‘సిరివెన్నెల’ రాసిపెట్టాడు. విధాత ఆయనకు తెలుగువారికి కాసిన్ని మంచి పాటలు ఇచ్చి రావోయ్‌ అని భువికి పంపాడు. విధాత ఆయనను నీ మార్గాన నడుచు శిష్యకవులను సిద్ధం చేయమని ఆదేశించి పంపాడు. ఇపుడు? ఇక చాలు నేను వినాల్సిన నీ పాటలు ఉన్నాయి... తెలిమంచు వేళల్లో మబ్బులపై మార్నింగ్‌ వాక్‌ చేస్తూ ఆ స్వర సంచారం పదసంవాదం చేద్దాం పద అని వెనక్కి పిలిపించుకున్నాడు. ఉపదేశం ఇచ్చే కవి ఊరికే ఉంటాడా? ‘దేవుడా.. ఈ లోకాన్ని మార్చు’ అని పాట వినిపించడూ?

అందాక ఆ కవిని గౌరవించడానికి ఆయన మంచిపాటలు పాడుకుందాం. ఈ జగత్తు మనదిగా అనుకోవాలి. జనులందరి బాగు కోరుకోవాలి. మనల్ని బాధించే మోహాల దాహాల ఒంటరి నిర్మోహత్వాన్ని సాధన చేయాలి. సిరివెన్నెల పాట చిరాయువుగా ఉండాలి.
జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదె... సన్యాసం శూన్యం నాదె...

ప్రముఖుల నివాళి
బహుముఖ ప్రజ్ఞ, సాహితీ సుసంపన్నత సిరివెన్నెల రచనల్లో ప్రకాశిస్తుంది. తెలుగు భాష ప్రాచుర్యానికి శాస్త్రి ఎంతో కృషి చేశారు. ఆయన కుటుంబసభ్యులకు, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.
– నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి 

తెలుగు పాటకు అందాన్నే గాక, గౌరవాన్ని కూడా తీసుకువచ్చారు. తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేనూ ఒకణ్ని. 2017లో గోవాలో వారికి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ అవార్డును అందజేసిన క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి. సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిసి, వైద్యులతో ఫోన్‌ ద్వారా మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితి గురించి విచారిస్తూ వచ్చాను. వారి ఆరోగ్యం కుదుటపడుతోందని, త్వరలోనే కోలుకుంటారని భావించాను. సీతారామశాస్త్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
 – ఎం.వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి 

సీతారామశాస్త్రి ఇక లేరని తెలిసి ఎంతో విచారించాను.  తెలుగు సినీ నేపథ్య గీతాల్లో సాహిత్యం పాలు తగ్గుతున్న తరుణంలో శాస్త్రి ప్రవేశం పాటకు ఊపిరులూదింది.  నలుగురి నోటా పది కాలాలు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు సీతారామశాస్త్రి.  సాహితీ విరించి సీతారామశాస్త్రికి నా శ్రద్ధాంజలి.  వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు నా సానుభూతి.
– ఎన్‌.వి.రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి 

తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాల ద్వారా తెలుగు వారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులుగా ఉంటారు. ఆయన మరణం తెలుగు వారికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
– వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి 

ఎలాంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల పండిత, పామరుల హృదయాలను గెలిచారు. ఆయన సాహిత్య ప్రస్థానం సామాజిక, సంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగింది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మరణం తెలుగు చలన చిత్ర రంగానికి, సాహిత్య అభిమానులకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 
–  కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు స్వర్గస్తులు కావడం నాకు, తెలుగు సినిమా రంగానికి, జాతీయ భావజాలంతో కూడిన కవులు, కళాకారులకు ఎంతో లోటు. దేశభక్తిపై ఆయన రాసిన పాటలను సీడీ రూపంలో 15రోజుల క్రితం నన్ను కలిసి ఇచ్చారాయన. కోలుకుంటున్న సమయంలో స్వర్గస్తులు కావడం చాలా దురదృష్టకరం. నా భావజాలం జాతీయ భావజాలం అని స్పష్టంగా చెప్పేవారు ఆయన.  
– కిషన్‌ రెడ్డి, కేంద్ర మంత్రి

బాలసుబ్రహ్మణ్యం మృతి చెందినప్పుడు కుడి భుజం పోయిందనుకున్నాను. సిరివెన్నెల మృతితో ఎడమ భుజం కూడా పోయింది. ఎంతో సన్నిహితంగా మాట్లాడుకునేవాళ్లం.. ఒక్కసారిగా దూరమయ్యాడంటే నమ్మశక్యం కావడం లేదు. తన ఆత్మకు శాంతి చేకూరాలి.. తన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. 
– కె.విశ్వనాథ్, దర్శకుడు

సిరివెన్నెలగారు ఆస్పత్రిలో చేరిన తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు ఫోనులో నాతో ఎంతో హుషారుగా మాట్లాడారు. నవంబరు నెలాఖరుకల్లా వచ్చేస్తానని వెళ్లిన మనిషి ఈ విధంగా జీవం లేకుండా వస్తారని ఊహించలేదు. వేటూరిగారి తర్వాత అంత గొప్ప రచయిత సిరివెన్నెల. ఆయన సాహిత్యంలో శ్రీశ్రీగారి పదును కనబడుతుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు, సిరివెన్నెలగారు.. ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం చిత్ర పరిశ్రమకు ఎవరూ పూరించలేని లోటు. అలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప కవి మళ్లీ మనకు తారసపడటం కష్టమే.         – చిరంజీవి, నటుడు 

సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెలగారు.
– బాలకృష్ణ, నటుడు 

సీతారామశాస్త్రి నాకు అత్యంత సన్నిహితుడు, సరస్వతీ పుత్రుడు. విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.
– మంచు మోహన్‌బాబు, నటుడు 

అందమైన పాటలు, పదాలను మాకు మిగిల్చి, మీరు వెళ్లిపోయారు. వాటి రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారు.     – నాగార్జున, నటుడు

బలమైన భావాన్ని.. మానవత్వాన్ని.. ఆశావాదాన్ని చిన్న చిన్న మాటల్లో పొదిగి జన సామాన్యం గుండెల్లో నిక్షిప్తం చేసేలా గీత రచన చేసిన అక్షర తపస్వి సీతారామశాస్త్రిగారు. ఆ మహనీయుడు ఇకలేరు అనే వాస్తవం జీర్ణించుకోలేనిది.               – పవన్‌ కల్యాణ్, నటుడు

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి మరణవార్త విని దిగ్భ్రాంతి చెందాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. – మహేశ్‌బాబు, నటుడు

అలుపెరుగక రాసిన ఆయన కలం ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంతకాలం అందరికీ చిరస్మరణీయంగా ఉంటాయి.
– ఎన్టీఆర్, నటుడు

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి మరణవార్త విని షాకయ్యాను. తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకు ఆయన అందించిన సేవలు అసామాన్యమైనవి.    – రామ్‌చరణ్, నటుడు

గత శనివారం సిరివెన్నెలగారితో ఫోనులో మాట్లాడాను. ‘మీలాగ నేను కూడా ఓ పాట పరిపుష్టిగా రాయాలి’ అని ఆయనతో అంటే, ‘నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు.. నువ్వు రాయగలవు’ అన్నారు. మా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఇంత గొప్పగా రాయాలని ఓ బెంచ్‌ మార్క్‌ సృష్టించారాయన. ఇంట్లో తండ్రిని చూసి పిల్లలు నేర్చుకున్నట్లు ఆయన్ని చూసి నేను నేర్చుకున్నాను. నాలో ఆత్మ విశ్వాసాన్ని బలంగా నింపిన గురువు ఆయన.  
– రామజోగయ్య శాస్త్రి, సినీ గేయ రచయిత

1996లో ‘అర్ధాంగి’ సినిమాతో మేం సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యాన్నిచ్చి, వెన్నుతట్టి ముందుకు నడిపించినవి ‘ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి’, ‘ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి’ అన్న సీతారామశాస్త్రిగారి పదాలు. భయం వేసినప్పుడల్లా గుర్తుతెచ్చుకుని పాడుకుంటే ధైర్యం వచ్చేది. నా జీవన గమనానికి దిశా నిర్దేశం చేసిన సీతారామశాస్త్రిగారికి శ్రద్ధాంజలి.             – రాజమౌళి, దర్శకుడు

‘సాహసం నా రథం. సాహసం జీవితం’.. పాట నన్ను ఎంతో ఇన్‌స్పైర్‌ చేసింది. ఆయన కచ్చితంగా స్వర్గానికే వెళ్లి ఉంటారు.
– రామ్‌గోపాల్‌ వర్మ, దర్శకుడు

సీతారామశాస్త్రిగారు తెలుగు సినిమాకు గొప్పవరం. బాలూగారు మనకు దూరమైనా ఆయన్ను గుండెల్లో పెట్టుకుని స్మరించుకుంటున్నాం. ‘సిరివెన్నెల’గారు కూడా మన గుండెల్లో నిలిచే ఉంటారు. 
– వీవీ వినాయక్, దర్శకుడు

గుండె నిండు గర్భిణిలా ఉంది. ప్రసవించలేని దుఃఖం పుట్టుకొస్తోంది. తల్లి కాగితానికి దూరమై అక్షరాల పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నాయ్‌. మీరు బతికే ఉన్నారు. పాట తన ప్రాణం పోగొట్టుకుంది.  – సుకుమార్, డైరెక్టర్‌

∙ఇంకా అశ్వనీదత్, బీవీఎస్‌యన్‌ ప్రసాద్, ఎమ్మెస్‌ రాజు, ‘స్రవంతి’ రవికిశోర్, ‘దిల్‌’ రాజు, వైవీఎస్‌ చౌదరి, మారుతి తదితర ప్రముఖులు నివాళులు అర్పించారు. 

చదవండి: దాని ముందు తలవంచా.. స్మోకింగ్‌పై గతంలో సిరివెన్నెల కీలక వ్యాఖ్యలు

 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top