Busireddy Shankar Reddy: మాది సమష్టి సేవ | SAKSHI SPECIAL: Rotary Club Governor Dr Busireddy Shankar Reddy Interview | Sakshi
Sakshi News home page

Busireddy Shankar Reddy: మాది సమష్టి సేవ

Published Sat, Mar 2 2024 12:28 AM | Last Updated on Fri, Apr 26 2024 6:25 PM

SAKSHI SPECIAL: Rotary Club Governor Dr Busireddy Shankar Reddy Interview - Sakshi

రోటరీ సర్వీస్‌

ప్రభుత్వం అన్నీ చేస్తుంది... కానీ!
చేయాల్సినవి ఇంకా ఎన్నో ఉంటాయి.
సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెడుతుంది ప్రభుత్వం. చెప్పుల్లేకపోతే వచ్చే వ్యాధులను అరికట్టేదెవరు?
స్కూలు భవనం కడుతుంది ప్రభుత్వం.
ప్రహరీలు... టాయిలెట్‌లను మరచిపోతుంటుంది.
హాస్పిటళ్లను కట్టిస్తుంది ప్రభుత్వం.
వైద్యపరికరాల్లో వెనుకబడుతుంటుంది.
‘ప్రభుత్వం చేయలేని పనులు చేయడమే మా సేవ’
అంటున్నారు రోటరీ క్లబ్‌ గవర్నర్‌ డా.శంకర్‌రెడ్డి.


‘మనది పేద ప్రజలున్న దేశం. ప్రభుత్వాలు ఎంత చేసినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ముందుకు వచ్చే వాళ్లందరం సంఘటితమై చేస్తున్న సేవలే మా రోటరీ క్లబ్‌ సేవలు’ అన్నారు బుసిరెడ్డి శంకర్‌రెడ్డి. ఒక రైతు తన పొలానికి నీటిని పెట్టుకున్న తర్వాత కాలువను పక్కపొలానికి మళ్లిస్తాడు. అంతే తప్ప నీటిని వృథాగా పోనివ్వడు. అలాగే జీవితంలో స్థిరపడిన తర్వాత సమాజానికి తిరిగి ఇవ్వాలి. అప్పుడే జీవితానికి సార్థకత అన్నారు. సమాజానికి తమ సంస్థ అందిస్తున్న సేవల గురించి సాక్షితో పంచుకున్నారాయన.

‘కష్టపడడమే విజయానికి దారి’... ఇందులో సందేహం లేదు. కష్టపడి పైకి వచ్చిన వారిలో సేవాగుణం కూడా ఉంటుంది. నేను 1994లో మెంబర్‌షిప్‌ తీసుకున్నాను. అప్పటి నుంచి మా సీనియర్‌ల సర్వీస్‌ను చూస్తూ మేము ఇంకా వినూత్నంగా ఏమి చేయవచ్చనే ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. సర్వీస్‌లో ఉండే సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాను. చదువుకునే పిల్లవాడికి పెన్ను ఇవ్వడం కూడా చాలా సంతృప్తినిస్తుంది. ఆ పెన్ను అందుకునేటప్పుడు పిల్లల కళ్లలో చిన్న మెరుపు, ముఖంలో సంతోషం... ఇవి చాలు ఈ జీవితానికి అనిపిస్తుంది.

నేను స్కూళ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి కారణం కూడా అదే. మంచినీటి సౌకర్యం లేని స్కూళ్లలో ఆర్‌వో ప్లాంట్, కొన్ని స్కూళ్లకు టాయిలెట్‌లు, హ్యాండ్‌ వాష్‌ స్టేషన్‌లు, తరగతి గదుల నిర్మాణం, క్లాస్‌రూమ్‌లో బెంచీలతో మొదలైన మా సర్వీస్‌లో ఇప్పుడు పిల్లల ఆరోగ్యం ప్రధానంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో ఉండే పిల్లలకు ప్రభుత్వం కొంతవరకు సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ అప్పటికప్పుడు తీర్చాల్సిన అవసరాలకు నిధులుండవు. వాటిల్లో ప్రధానమైనది ఆరోగ్యం. వాతావరణం మారిన ప్రతిసారీ పిల్లల మీద దాడి చేయడానికి సీజనల్‌ అనారోగ్యాలు పొంచి ఉంటాయి.

మీరు ఊహించగలరా పాదాలకు సరైన పాదరక్షలు లేకపోవడం వల్ల చలికాలంలో పిల్లలు అనారోగ్యం బారిన పడతారు. నులిపురుగుల కారణంగా అనారోగ్యాల పాలవుతారు. హాస్టల్‌ ఆవరణలో కూడా చెప్పులతో తిరగాలని చెప్పడంతోపాటు మంచి బూట్లు ఇవ్వడం వరకు రోటరీ క్లబ్‌ ద్వారా చేస్తున్నాం. బూట్లు కూడా మంచి బ్రాండ్‌వే. లోటో కంపెనీ షూస్‌ మార్కెట్‌లో కొనాలంటే రెండు వేలవుతాయి. ఆ కంపెనీతో మాట్లాడి వారి సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ) ప్రోగ్రామ్‌ కింద మూడు వందల లోపు ధరకే తీసుకున్నాం.

మేము సర్వీస్‌ కోసం చేసే ప్రతి రూపాయి కూడా నేరుగా ఆపన్నులకే అందాలి. కమర్షియల్‌గా వ్యాపారాన్ని పెంపొందించే విధంగా ఉండదు. పిల్లలకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించడం వల్ల చాలామంది పిల్లల్లో కంటిచూపు సమస్యలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం కంటి సమస్యల కోసం పెద్ద ఎత్తున వైద్యశిబిరాలు నిర్వహించినప్పటికీ పిల్లల మీద దృష్టి పెట్టలేదు. రవి గాంచని చోటును కవి గాంచును అన్నట్లు... ప్రభుత్వం చూపు పడని సమస్యల మీద మేము దృష్టి పెడుతున్నాం. శంకర్‌ నేత్రాలయ, మ్యాక్సివిజన్, ఆస్టర్‌ గ్రూప్‌ వైద్యసంస్థలతో కలిసి పని చేస్తున్నాం.  

తక్షణ సాయం!
ఆరోగ్యం, చదువుతోపాటు ప్రకృతి విలయాలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులకు తక్షణ సాయం కోసం స్థానిక కలెక్టర్‌ల నుంచి పిలుపు వస్తుంది. అలా ఇల్లు కాలిపోయిన వాళ్లకు పాత్రలు, నిత్యావసర దినుసులు, దుస్తులు, దుప్పట్లు... వంటివి ఇస్తుంటాం. మా సేవలకు స్థిరమైన నిధి అంటూ ఏదీ ఉండదు.

సాధారణంగా ఇందులో సభ్యులుగా జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి సమాజానికి తమ వంతుగా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చే వాళ్లే ఉంటారు. తక్షణ సాయానికి ఆ స్థానిక క్లబ్‌ సభ్యులు సొంత డబ్బునే ఖర్చుచేస్తారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం చేపట్టే కార్యక్రమాలకు మాత్రం కచ్చితంగా ప్రాజెక్టు రిపోర్ట్, కొటేసన్‌ సిద్ధం చేసుకుని నిధుల సమీకరణ మొదలు పెడతాం. ఇందులో మూడింట ఒక వంతు క్లబ్, ఒక వంతు దాత, ఒక వంతు ఇంటర్నేషనల్‌ రోటరీ ఫౌండేషన్‌ సహకరిస్తుంది.  

ఇది సమష్టి సేవ!
రోటరీ క్లబ్‌ ద్వారా అందించే సేవలన్నీ సమష్ఠి సేవలే. ఏ ఒక్కరమూ తమ వ్యక్తిగత ఖాతాలో వేసుకోకూడదు. హైదరాబాద్‌ నగరం, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌ కలిపి మా పరిధిలో 113 క్లబ్‌లున్నాయి. ఎక్కడి అవసరాన్ని బట్టి అక్కడి సభ్యులు స్పందిస్తారు. సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం. ఇక నా వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే... మాది భద్రాచలం దగ్గర రెడ్డిపాలెం. పూర్వికులు ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా నర్సరావు పేట నుంచి భద్రాచలానికి వచ్చారు.

సివిల్‌ కాంట్రాక్టర్‌గా ఐటీసీ భద్రాచలం పేపర్‌ బోర్డ్‌కు çసర్వీస్‌ ఇస్తున్నాను. మా ఊరికి నేను తిరిగి ఇస్తున్నది నీటి వసతి. పేపర్‌ మిల్లు నుంచి వెలువడే వాడిన నీటిని మా ఊరి పంట పొలాలకు అందించే ఏర్పాటు కొంత వరకు పూర్తయింది. పైప్‌లైన్‌ పని ఇంకా ఉంది. మేము గోదావరి తీరాన ఉన్నప్పటికీ నది నుంచి మాకు నీళ్లు రావు. గ్రామాల్లో విస్తృతంగా బోర్‌వెల్స్‌ వేయించాం. బూర్గుంపాడులో నేను చదువుకున్న స్కూల్‌కి ఆర్‌వో ప్లాంట్‌ నా డబ్బుతో పెట్టించాను.

‘ఇవ్వడం’లో ఉండే సంతృప్తి మాత్రమే మా చేత ఇన్ని పనులు చేయిస్తోంది. నాకు అరవైదాటాయి. కుటుంబ బాధ్యతలు పూర్తయ్యాయి. మా అమ్మాయి యూఎస్‌లో ఉంది, అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఇక నేను సర్వీస్‌ కోసం చేస్తున్న ఖర్చు గురించి నా భార్య అన్నపూర్ణ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కొన్ని కార్యక్రమాలకు నాతోపాటు తను కూడా వస్తుంది. కాబట్టి సమాజంలో ఉన్న అవసరతను అర్థం చేసుకుంది, నన్ను కూడా అర్థం చేసుకుంది. కాబట్టే చేయగలుగుతున్నాను’’ అని వివరించారు రొటేరియన్‌ డాక్టర్‌ బుసిరెడ్డి శంకర్‌రెడ్డి.

శ్రీమంతులకు స్వాగతం!
జీవితంలో సుసంపన్నత సాధించిన వారిలో చాలా మందికి సొంత ఊరికి ఏదైనా చేయాలని ఉంటుంది. తాము చదువుకున్న స్కూల్‌ను అభివృద్ధి చేయాలని ఉంటుంది. అలాంటి శ్రీమంతులకు నేనిచ్చే సలహా ఒక్కటే. మా సర్వీస్‌ విధానంలో ‘హ్యాపీ స్కూల్‌’ కాన్సెప్ట్‌ ఉంది. ఒక పాఠశాలను హ్యాపీ స్కూల్‌గా గుర్తించాలంటే... కాంపౌండ్‌ వాల్, పాఠశాల భవనం, డిజిటల్‌ క్లాస్‌ రూములు, నీటి వసతి, టాయిలెట్‌లు ఉండాలి. అలా తీర్చిదిద్దడానికి 90 లక్షలు ఖర్చవుతుందనుకుంటే ముప్ఫై లక్షలతో ఒక దాత వస్తే, మా రోటరీ క్లట్, అంతర్జాతీయ రోటరీ ఫౌండేషన్‌ నిధులతో పూర్తి చేయవచ్చు.

గతంలో ఏపీలో కూడా మేము చాలా పాఠశాలలను దత్తత తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తోంది. అక్కడ మా అవసరం లేదు, మాకు సర్వీస్‌ చేసే అవకాశమూ లేదు. తెలంగాణలో గడచిన ప్రభుత్వం పాఠశాలల మీద దృష్టి పెట్టకపోవడంతో మేము చేయగలిగినంత చేస్తూ వస్తున్నాం. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇటీవల హైదరాబాద్‌ నగరం, మెట్రో రైల్వే స్టేషన్‌లలో 65 వాటర్‌ కూలర్‌లనిచ్చాం. నీలోఫర్, ఎమ్‌ఎన్‌జే క్యాన్సర్‌ హాస్పిటల్‌కి వైద్యపరికరాలు, స్పర్శ్‌ పేరుతో క్యాన్సర్‌ బాధితులకు పాలియేటివ్‌ కేర్, కొన్ని హాస్పిటళ్లకు అంబులెన్స్‌లు ఇచ్చింది రోటరీ క్లబ్‌. ఇక ఆలయాల్లో పూజలకు అన్ని ఏర్పాట్లూ ఉంటాయి, కానీ భక్తులకు సౌకర్యాలు పెద్దగా ఉండవు. మా భద్రాచలం, పర్ణశాలలో టాయిలెట్లు, భక్తులు దుస్తులు మార్చుకోవడానికి గదుల నిర్మాణం... ఇలా మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాం.

– వాకా మంజులా రెడ్డి
ఫొటో: గడిగె బాలస్వామి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement