మిద్దెతోటల్లో కోకో పీట్‌తో ఇన్ని ఉపయోగాలా..?! | Sagubadi: Why is cocopeat used in terrace gardening and balcony? | Sakshi
Sakshi News home page

మిద్దెతోటల్లో కోకో పీట్‌తో ఇన్ని ఉపయోగాలా..?!

May 15 2026 5:17 PM | Updated on May 15 2026 6:31 PM

Sagubadi: Why is cocopeat used in terrace gardening and balcony?

మిద్దెతోటలు లేదా టెర్రస్‌ గార్డెన్లు లేదా పెరటి తోటల్లో కోకో పీట్‌ (కొబ్బరి పొట్టు) వాడకం మొక్కల ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. ఇది కొబ్బరి పీచు నుంచి తయారయ్యే ఒక సేంద్రియ  పదార్థం. దీని ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి:

1 కోకో పీట్‌ తన బరువు కంటే 8–10 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకొని నిల్వ ఉంచుకోగలదు. దీనివల్ల మొక్కల వేర్లకు ఎక్కువ సేపు తేమ అందుతుంది, వేసవిలో కూడా మొక్కలు త్వరగా ఎండిపోవు.

2 మట్టి కంటే కోకో పీట్‌ చాలా తక్కువ బరువు ఉంటుంది, కాబట్టి మేడపై కుండీల వల్ల భారం పడకుండా ఉంటుంది.

3 దీని నిర్మాణం గుల్లగా ఉండటం వల్ల వేర్లకు గాలి బాగా అందుతుంది. ఇది మొక్క వేర్లు బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.

4 విత్తనాలతో మొక్కలు పెంచటానికి ఇది ఒక అద్భుతమైన మాధ్యమం. ఇందులో విత్తనాలు చాలా వేగంగా మొలకెత్తుతాయి.

5 ఎర్రమట్టి లేదా ఇతర రకాల మట్టితో కలిపి వాడినప్పుడు, ఇది నేల బిగుసుకుపోకుండా చూస్తుంది.

6 ఇది కొబ్బరి వ్యర్థాల నుండి తయారవుతుంది కాబట్టి పూర్తిగా సహజమైనది, పర్యావరణానికి ఎటువంటి హాని చేయదు.

7 కూరగాయల మొక్కల వేర్లు త్వరగా విస్తరించడానికి కోకో పీట్‌ మట్టిని గుల్లగా ఉంచుతుంది. 30% కోకో పీట్‌ + 40% ఎర్రమట్టి + 30% వర్మీ కంపోస్ట్‌ లేదా పశువుల ఎరువు కలుపుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి, బెండ వంటి కూరగాయలు మొక్కలకు ఈ మిశ్రమం ద్వారా పోషకాలు, తేమ సమపాళ్లలో అందుతాయి.

8 పూలు బాగా పూయాలంటే నేలలో గాలి ప్రసరణ (ఎయిరేషన్‌) ఉండాలి. 40% కోకో పీట్‌ + 20% ఇసుక + 40% వర్మీ కంపోస్ట్‌ కలిపి మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి. మందార, గులాబీ, చామంతి వంటి మొక్కల కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా, అదనపు నీరు సులభంగా బయటకు పోయేలా కోకో పీట్‌ సహాయపడుతుంది.

9 నిమ్మ, జామ, దానిమ్మ లాంటి పండ్ల మొక్కలు ఎక్కువ కాలం కుండీల్లోనే ఉండాలి కాబట్టి మట్టి గట్టిపడకుండా ఉండటం ముఖ్యం. 25% కోకో పీట్‌ + 50% ఎర్రమట్టి + 25% కంపోస్ట్, కొద్దిగా వేప పిండి కలిపి మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఇది మొక్క వేర్లు బలంగా నాటుకోవడానికి, ఎక్కువ పండ్లు కాయడానికి అవసరమైన పోషకాలను నెమ్మదిగా విడుదల చేస్తుంది.

10 మార్కెట్లో దొరికే కోకో పీట్‌ బ్లాక్స్‌ను ఉపయోగించే ముందు.. నీటిలో నానబెట్టి, అది మెత్తగా అయ్యాక అందులోని లవణాలను పోగొట్టడానికి 2–3 సార్లు నీటితో కడిగి, తర్వాత వాడాలి.

11 కోకో పీట్‌ మట్టిని గుల్లగా ఉంచుతుంది కాబట్టి, అదనపు నీరు కుండీ అడుగున ఉన్న రంధ్రాల ద్వారా సులభంగా బయటకు పోతుంది.

12 కుండీలలో మట్టి కొన్ని రోజుల తర్వాత రాయిలా గట్టిగా మారుతుంది. కోకో పీట్‌ కలిపితే మట్టి ఎప్పుడూ మెత్తగానే ఉంటుంది, దీనివల్ల వేర్లకు ఆక్సిజన్‌ బాగా అందుతుంది.

13 కోకో పీట్‌లో సొంతంగా పోషకాలు ఉండవు. అది కేవలం ఒక మాధ్యమం మాత్రమే. కాబట్టి, తప్పనిసరిగా వర్మీ కంపోస్ట్‌ లేదా ఏదైనా సేంద్రియ ఎరువు కలిపితేనే మొక్కకు బలం అందుతుంది.

14 మిద్దె తోటలో కుండీల్లో వాడటం కోసం మట్టి మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు వరి పొట్టు, కోకో పీట్‌ రెండూ ఉపయోగకరమైనవే.

15 వరి పొట్టు మట్టిలో గాలి ప్రసరణను మెరుగుపరచడానికి, నీరు త్వరగా బయటకు వెళ్లడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది మట్టిని గుల్లగా ఉంచుతుంది, తద్వారా వేర్లకు గాలి అందుతుంది. అదనపు నీరు నిలవకుండా బయటకుపోతుంది.

16 వరి పొట్టులో సిలికా అధికంగా ఉంటుంది, ఇది మొక్కల కణజాలాన్ని దృఢపరిచి తెగుళ్లు, వ్యాధులను తట్టుకునే శక్తిని ఇస్తుంది.

17 వరి పొట్టు కోకో పీట్‌ కంటే నెమ్మదిగా కుళ్ళిపోతుంది, కాబట్టి కుండీలో మట్టి ఎక్కువ కాలం గట్టిపడకుండా ఉంటుంది. ఇది సాధారణంగా కోకో పీట్‌ కంటే చౌకగా లభిస్తుంది. 

– కొల్లి కృష్ణ కుమారి, 
మిద్దె తోటల సాగుదారు, గుంటూరు
మొబైల్‌: 9490602366

నిర్వహణ: పంతంగి రాంబాబు
సాక్షి సాగుబడిడెస్క్‌ 

చదవండి: అపురూపమైన అడవి మామిడి పండ్ల జాతులు

Advertisement
 
Advertisement
Advertisement