Rutvik Lokhande: ఈ కుర్రాడు... ‘సక్సెస్‌’కు సన్నిహిత మిత్రుడు

Rutvik Lokhande: Serial Entrepreneur Believes The Future Of Digital Creators Is Blockchain - Sakshi

సక్సెస్‌ స్టోరీ

ఈ అబ్బాయికి తన వయసు వారిలాగే సినిమాలు అంటే ఇష్టం. సినిమా పాటలు అంటే ఇష్టం. ఆ పాటలకు తీన్మార్‌ డ్యాన్స్‌ చేయడం అంటే ఇష్టం. అయితే వీటితో పాటు తనకు టెక్నాలజీ అంటే కూడా ఇష్టం. ఆ ఇష్టమే ఇతడిని 14 సంవత్సరాల వయసులో కంటెంట్‌ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి కారణం అయింది. 21 సంవత్సరాల వయసులో సొంతంగా ఒక స్టార్టప్‌ స్టార్ట్‌  చేయడానికి, మరో కంపెనీలో భాగస్వామి కావడానికి కారణం అయింది...

టిక్‌టాక్‌తో ఊపందుకున్న షార్ట్‌ ఫామ్‌ కంటెంట్‌ ఆ తరువాత యూట్యూబ్‌ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌... మొదలైన మాధ్యమాల ద్వారా మరింత విస్తరించింది.
షార్ట్‌ ఫామ్‌ కంటెంట్‌ వల్ల ప్రేక్షకులకు అందే వినోదం అనేది ఒక కోణం మాత్రమే. మరో కోణంలో చూస్తే షార్ట్‌ ఫామ్‌ కంటెంట్‌ వల్ల రకరకాల జానర్‌లలో ఎంతోమంది యువప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు.

మ్యూజిక్‌ ఇండస్ట్రీలో కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తోంది. అన్ని మ్యూజిక్‌ ప్లాట్‌ఫామ్స్‌లో యాక్టివ్‌ స్ట్రీమర్స్‌ పెరిగారు.వీరిని రకరకాల బ్రాండ్స్‌ తమ మార్కెటింగ్‌కు ఉపయోగించుకుంటున్నాయి. సంప్రదాయ మార్కెటింగ్‌తో పోల్చితే ఇది తక్కువ ఖర్చుతో కూడిన వ్యవహారం.ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, బ్రాండ్లకు మధ్య వారధిగా ముంబైలో ఏర్పడిన ‘నోఫిల్టర్‌’ ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ సంస్థ వ్యవస్థాపక సభ్యులలో ముంబైకి చెందిన రుత్విక్‌ లోఖండె ఒకరు. అప్పుడు అతని వయసు 14 సంవత్సరాలు.

క్రిప్టో కరెన్సీ నేపథ్యంలో అందరిలాగే బ్లాక్‌చెయిన్‌ అనే మాటను చాలాసార్లు విన్నాడు రుత్విక్‌. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ) భద్రతకు ఉపకరించే, డేటాను జాగ్రత్తగా కాపాడే, పారదర్శకతకు వీలయ్యే బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ రుత్విక్‌ను బాగా ఆకర్షించింది. ‘ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది?’ అని ఆలోచించాడు. ‘ఇలా ఉపయోగించుకోవచ్చు’ అనే ఐడియా తట్టడంతో బ్లాక్‌చెయిన్‌ సాంకేతికత ఆధారంగా ‘బిలీవర్స్‌’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టి సూపర్‌హిట్‌ చేశాడు.

ఈ ప్లాట్‌ఫామ్‌ కళాకారులకు సహాయపడుతుంది. ఉదాహరణకు... రైటర్‌ లేదా డైరెక్టర్‌ కావాలనుకుంటున్నవారు తమ స్క్రిప్ట్‌ను షేర్‌ చేస్తే, అది ఆడియెన్స్‌(బిలీవర్స్‌)కు నచ్చితే నిధుల సమీకరణకు వీలవుతుంది. ‘షార్ట్‌ కంటెంట్‌ అనేది హోటల్స్‌ నుంచి టూర్‌గైడ్‌ల వరకు ప్రతి ఒక్కరికీ తమను తాము ప్రమోట్‌ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది’ అంటున్న రుత్విక్‌ ప్రస్తుతం ఎక్స్‌పెరిమెంటల్‌ మార్కెటింగ్‌ సంస్థ ‘కొలబ్‌ట్రైబ్‌’ భాగస్వామి.

‘ప్రస్తుతం మన దేశంలో స్ట్రీట్‌కల్చర్‌ పెరిగింది. హిప్‌ హాప్‌ టాలెంట్‌ ముందుకు వస్తుంది. మారుమూల గ్రామంలో ఎక్కడో ఉన్న కళాకారుడి ప్రతిభ ప్రపంచానికి తెలియడానికి ఎంతో టైమ్‌ పట్టడం లేదు. అయితే ప్రపంచంలోని ఎన్నో దేశాలతో పోల్చితే మన దగ్గర వీరి ప్రతిభకు సరిౖయెన ప్రతిఫలం లభించడం లేదు.
2025 నాటికి కంటెంట్‌ క్రియేషన్‌కు పెద్ద మార్కెట్‌ ఏర్పడనుంది.

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ అభిరుచుల ప్రకారం ఇన్‌ఫ్లూయెన్సర్‌ కావచ్చు, అయితే ప్రతిభ మాత్రమే సరిపోదు. తమ కంటెంట్‌ను ప్రమోట్‌ చేసుకోవడానికి మార్కెటింగ్‌ స్కిల్స్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి’ అంటున్నాడు రుత్విక్‌. కంటెంట్‌ క్రియేషన్‌లో వ్యక్తులు, సంస్థలకు సహాయపడడానికి ఏంజెల్‌ ఫండ్‌ ‘మూన్‌ క్యాపిటల్‌’ లాంచ్‌ చేసే ప్రయత్నాలలో ఉన్నాడు రుత్విక్‌.

‘ప్రతిభకు ఎలాంటి హద్దులు, అవరోధాలు లేవు. అది ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిలాంటిది’ అంటున్నాడు యంగ్‌స్టార్‌ రిత్విక్‌. తన సక్సెస్‌ స్టోరీ ఆ విషయాన్ని చెప్పకనే చెబుతుంది కదా!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top