ప్యాంక్రియాటైటిస్‌ వస్తే?

Role of Your Pancreas in Digestion - Sakshi

దేహంలోని జీవక్రియల్లో ప్యాంక్రియాస్‌ (క్లోమ గ్రంధి)ది కీలక పాత్ర. దీని నుంచి అవసరమైనప్పుడు రక్తంలోని గ్లూకోజ్‌నుంచి శక్తిని తీసుకుని వినియోగించుకునేలా, అలాగే అవసరం లేనప్పుడు అదే మళ్లీ అదే గ్లూకోజ్‌ను రక్తం నుంచి తొలగించి, కాలేయంలో భద్రపరచుకునేలా హార్మోన్‌లు ఉత్పత్తి అవుతాయి. అవసరమైనప్పుడు శక్తిని తీసుకునేందుకు గ్లూకగాన్, అవసరం లేనప్పుడు మళ్లీ నిల్వ చేసుకునేందుకు ఇన్సులిన్‌ అనే హార్మోన్లను ఈ ప్యాంక్రియాస్‌ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇన్సులిన్‌ లోపం వల్లనే డయాబెటిస్‌ వస్తుందన్న సంగతి తెలిసిందే. ఇది సొమాటోస్టాటిన్‌ అనే హార్మోన్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. ప్యాంక్రియాస్‌ గ్రంథి నుంచి ఓ చిన్న గొట్టం ద్వారా జీర్ణప్రక్రియకు అవసరమైన క్లోమరసం కూడా వచ్చి చిన్నపేగుల దగ్గర కలుస్తుంది.

ఏవైనా కారణాల వల్ల ఈ క్లోమరసం తాలూకు స్రావాల్లోని ప్రోటీన్లు ఉండల్లాగా మారి, క్లోమరసాన్ని తీసుకెళ్లే గొట్టానికి అడ్డుపడ్డప్పుడు ప్యాంక్రియాస్‌ గ్రంథికి ఇన్ఫెక్షన్‌ రావచ్చు. కొన్నిసార్లు ప్యాంక్రియాస్‌ గ్రంథిలోనే రాళ్లలా ఏర్పడవచ్చు. ఇలా జరగడాన్ని ‘ప్యాంక్రియాటైటిస్‌’ అంటారు. నిజానికి ఇది అంత ప్రాణాంతకం కానప్పటికీ, కొందరిలో మాత్రం తీవ్రమైన నొప్పి కలిగిస్తుంది. అలాంటి సందర్భాల్లో మాత్రమే దీనికి చికిత్స అవసరమవుతుంది.

లక్షణాలు :
► తిన్నది జీర్ణం కాకపోవడం
► ఏదైనా తిన్నవెంటనే కడుపులో తీవ్రమైన మంట, నొప్పి
► స్వల్పంగా జ్వరం
► పొట్టభాగం ఎడమవైపున పైభాగంలో లేదా మధ్య భాగంలో నొప్పి మొదలై కొన్ని సందర్భాల్లో అది వీపుకు వైపునకు పాకుతుండటం
► కామెర్లు ఠీ పొట్ట ఉబ్బరం ఠీ వాంతి అవుతున్నట్లు అనిపిస్తుండం (వికారం)
► కొందరిలో విరేచనాలు కావడం
► కడుపుపైన తాకితే భరించలేనంత బాధ (టెండర్‌నెస్‌) 
► కొందరిలో కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించడం... వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు.

కారణాలు : ఏ కారణం లేకుండానే పాంక్రియాస్‌లో రాళ్ల వంటివి రావడం జరుగుతుంది. అయితే కొందరిలో మితిమీరిన మద్యపానం చాలావరకు పాంక్రియాటైటిస్‌కు కారణమవుతుంది.

నిర్ధారణ పరీక్షలు : బాధితులకు కొన్ని రక్తపరీక్షలు, సీరమ్‌ లైపేజ్‌ పరీక్షలు, సీటీ స్కాన్‌ లేదా ఎమ్మారై స్కాన్, ఎండోస్కోపిక్‌ అల్ట్రాసౌండ్, ప్యాంక్రియాటిక్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ వంటి
పరీక్షలు చేసి, పాంక్రియాస్‌ నుంచి వచ్చే నాళం ఎంత దెబ్బతిన్నదీ, ఆ గ్రంథి ఏ మేరకు ఉబ్బి ఉంది అన్న విషయాలు తెలుసుకుని చికిత్స ప్రారంభిస్తారు.

చికిత్స : పాంక్రియాటైటిస్‌ తీవ్రత చాలా తక్కువగా ఉంటే కొన్ని రకాల మందులతో దాన్ని తగ్గించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు.  మందులతో తగ్గనప్పుడు తప్పనిసరిగా
శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటీవల ల్యాపరోస్కోపిక్‌ / కీహోల్‌ శస్త్రచికిత్సలతో కడుపుపై కత్తితో కోయకుండానే, చిన్నపాటి గాట్లతోనే శస్త్రచికిత్స చేసి, ప్యాంక్రియాస్‌ గ్రంథిలోని దెబ్బతిన్న ప్రాంతాన్ని తొలగించే అవకాశం ఉంది. దీనివల్ల హాస్పిటల్‌లో ఉండాల్సిన సమయం, ఇతర ఇన్ఫెక్షన్లు, సర్జరీ తర్వాత వచ్చే దుష్పరిణామాలు బాగా తగ్గిపోతాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top