లోకానికే మహోదయం క్రీస్తు పునరుత్థానం

Resurrection Of Christ Is The Beginning Of The World - Sakshi

యేసుక్రీస్తుకు అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తినీ తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. 

ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్‌ పండుగను జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. యెరూషలేములోని యేసు ఖాళీ సమాధి మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జీవితం నుండి కొన్ని అమూల్య పాఠాలను ‘సాక్షి’ పాఠకులకు అందిస్తున్నాం.

తన జీవితకాలమంతా భౌతికంగా అంధురాలైనప్పటికీ క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని అయన ప్రేమతత్వాన్ని తాను రచించిన ఎనిమిదివేల పాటలతో తెలియచేసి క్రైస్తవ ప్రపంచంలో విశిష్టమైన ఖ్యాతిని ఆర్జించిన ఫ్యానీ క్రాస్బీ క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ఇలా వ్రాసింది. ‘క్రీస్తు తిరిగి లేచాడు. ఆయన విశిష్ఠ బలము ద్వారా మరణాన్ని జయించాడు. రాయి పొర్లింపబడింది, సమాధి ఆయన్ను శాశ్వతంగా బంధించలేకపోయింది. జగమంతా ఆనందంతో నిండిపోయింది. క్రీస్తు స్నేహితులారా! మీరు కన్నీళ్లు విడచుట మానండి. ఎందుకంటే ఆయన మహిమగల రాజు.’ ఈ మాటలను తన హృదయాంతరంగములో నుండి రాయడం ద్వారా తాను భౌతికంగానే అంధురాలు గాని ఆధ్యాత్మికంగా కాదు అని ఋజువుచేసింది క్రాస్బీ. 

యేసుక్రీస్తు జీవితం ఒకింత ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తీసుకు వచ్చింది. ప్రేమ, దయ, వినయ స్వభావం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. పువ్వు నుంచి పరిమళాన్ని, తేనె నుంచి మాధుర్యాన్ని, చంద్రుని నుంచి చల్లదనాన్ని, మీగడ నుంచి కమ్మదనాన్ని, అమ్మ నుంచి అనుబంధాన్ని వేరుచేయలేనట్టుగానే క్రీస్తు నుంచి ప్రేమను, కరుణ పూరితమైన మనస్సును వేరుచేయలేము. ఆయన పుట్టింది బెత్లేహేము అనే చిన్న పల్లెటూరులోనైతే ఆయన పెరిగింది ఒక వడ్లవాని ఇంటిలో. పేరుకు మాత్రం తండ్రి అని పిలువబడిన యేసేపుకి అన్ని విషయాలలో సహాయం చేశాడు. 

యేసు భూమ్మీద జీవించిన కాలంలో స్నేహం చేసింది పామరులతో, గొర్రెల కాపరులతో, చేపలు పట్టే జాలరులతో. మనిషి సమస్యలను, పేదరికాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి యేసుక్రీస్తు. అందుకేనేమో! వారందరి హృదయాల్లో రారాజుగా కొలువుంటున్నాడు. కాంతికి వేగాన్ని నియమించిన దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఎంత దూరమైనా కాలిబాటతోనే ప్రయాణించాడు. ఇవన్నీ ఆయన కారుణ్యానికి నిలువెత్తు నిదర్శనాలు.

నక్కలకు బొరియలున్నాయి, పక్షులకు గూళ్లున్నాయి, కాని తలవాల్చుకొనుటకు మనుష్య కుమారునికి చోటు లేదని చెప్పడం ద్వారా ప్రజల కోసం తానెంత కరుణామయుడిగా మారిపోయాడో తెలియచెప్పాడు. ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు దివ్య మహిమతో నిండిన ఆ మహాఘనుడు శరీరధారిగా తగ్గించుకొని వచ్చినప్పుడు కుష్ఠు వ్యాధిగ్రస్తులను కౌగలించుకున్నాడు. రోగ పీడితులను పరామర్శించి తన దివ్యస్పర్శతో స్వస్థపరచాడు. పాపంలో పట్టుబడి భయంతో సభ్య సమాజంలో తలదించుకొన్న వ్యభిచారిని సయితం అమ్మా! అని పిలిచిన పరిశుద్ధుడు క్రీస్తు. చులకనగా వ్యవహరించిన వారిని కూడా తన ప్రేమతో తన్మయుల్ని చేసిన కరుణామయుడు.

సీయస్‌ లూయీ అనే సుప్రసిద్ధ సువార్తికుడు ఒకసారి ఇలా అంటాడు. యేసు ఈ లోకానికి వచ్చి తానెవరో లోకానికి తెలియచేశాడు. ‘నేను లోకానికి వెలుగును, జీవాహారము నేనే, మార్గము సత్యమును జీవమును నేనే’ చెప్పడంలో మనిషి మనసులో ఉన్న ప్రశ్నలకు జవాబులనిచ్చాడు. క్రీస్తు ఆవిధంగా పలికాడంటే ఆయన అబద్ధికుడైనా లేదా మతిస్థిమితం లేనివాడైనా  లేదా రక్షకుడైనా అయ్యుండాలి. యేసుక్రీస్తు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు. ఆయన మతిస్థిమితం లేనివాడు కాదు. అదే వాస్తవమైతే ఆయన ఇన్ని విశిష్ఠ బోధలు చేసి ఉండేవాడు కాదు. అనేకులను స్వస్థపరచేవాడు కాదు. ఆయన రక్షకుడు గనుకనే సిలువలో మనిషి పాపముల నిమిత్తం మరణించి మూడవ రోజున తిరిగి లేచారు. 

యేసుక్రీస్తు మానవాళిని తమ పాపముల నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. యేసు జన్మ చాలా ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది, జీవన విధానం మరింత శ్రేష్ఠమైనది, విలక్షణమైనది. మరణ విధానం కూడా సాటిలేనిది. మూడవ రోజున జరిగిన ఆయన పునరుత్థానం అద్భుతమైనది. గుడ్‌ ఫ్రైడే మరియు ఈస్టర్‌ పండుగలు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. మానవ జీవితాలకు పట్టిన పాపాంధకారాన్ని తొలగించి జీవపు వెలుగునందించాడు క్రీస్తు ప్రభువు. జీవచ్ఛవాలుగా పడివున్న ఎందరికో స్ఫూర్తినిచ్చి ఉన్నత శిఖరాలపై నిలబెట్టాడు.

వాస్తవానికి క్రీస్తు మరణం, పునరుత్థానం సంభవించిన సమయంలో జరిగిన సంఘటనలు మనకు ఎన్నో విశిష్ఠమైన పాఠాలు నేర్పిస్తాయి. ‘నజరేయుడైన యేసు’ పాపులను రక్షించుటకు సిలువపై ప్రాణమర్పించారు. రోమన్‌ సైనికులు, యూదా మతపెద్దలు నిర్దాక్షిణ్యంగా యేసుక్రీస్తుకు సిలువ వేశారు. న్యాయస్థానాల చుట్టూ తిప్పారు. అన్యాయపు తీర్పు తీర్చారు. భయంకరమైన కొరడాలతో విపరీతంగా కొట్టి పైశాచికానందాన్ని పొందారు. యెరూషలేము వీధుల్లో సిలువను మోయించి, గొల్గతాపై మేకులు కొట్టి, సిలువలో వేలాడదీసి, పక్కలో బల్లెపు పోటు పొడిచి చిత్రహింసలకు గురి చేశారు. ప్రేమ, సమాధానములకు కర్తయైన దేవుడు వాటినన్నిటినీ ప్రేమతో సహించి, భరించి సిలువలో మరణించాడు.

దేవుని లేఖనాలు యేసుక్రీస్తు సిలువపై మరణించాయని ధ్రువీకరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇశ్రాయేలు దేశంలోని కైసరయ అనే ప్రాంతంలో తవ్వకాలు జరిపారు పురాతత్వ శాస్త్రవేత్తలు. ఆ తవ్వకాలలో వారికి పిలాతు రాతి పలక లభించింది. విస్తృత పరిశోధనల తదుపరి యేసుక్రీస్తు ప్రభువునకు తీర్పు తీర్చిన రోమన్‌ గవర్నర్‌ పిలాతు అని బైబిల్‌లో అతని గూర్చి వ్రాయబడిన విషయాలు వాస్తవాలని గుర్తించారు.

యేసుక్రీస్తు సిలువ మరణానికి ముందురోజు కొన్ని సంఘటనలు జరిగారు. గెత్సేమనె తోటకు ప్రభువు రాకమునుపు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. శిష్యులను వెంట బెట్టుకొని గెత్సెమనేకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థించుట మొదలు పెట్టెను. నేటికి యెరూషలేములో గెత్సేమనే తోట ఉంది. దానిలోని కొన్ని ఒలీవ చెట్లు యేసుక్రీస్తు కాలానికి సంబంధించినవే. అక్కడ ఆయన ప్రార్థించిన రాయి కూడా ఉంది. దానిమీద ఓ గొప్ప దేవాలయం నిర్మించబడింది. ఇశ్రాయేలు దేశాన్ని సందర్శించే వారందరూ కచ్చితంగా వాటిని చూస్తారు. ఆ తోటలో శిష్యులు నిద్రించుట చూసిన ప్రభువు వారిని మేల్కొల్పెను. అతి వేదనతో ప్రార్థించుట వలన చెమట రక్తపు బిందువులుగా మారెను. 

యేసుక్రీస్తుకు అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తినీ తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. ఆ తదుపరి ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. ఈనాటికీ యెరూషలేమునకు వెళితే అక్కడ వయా డొలొరిసా అనే మార్గాన్ని చూస్తాము. ఆ మార్గంలో పద్నాలుగు స్టేషన్లు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో క్రీస్తు ఏ విధంగా శ్రమపడ్డారో చరిత్రను తెలుసుకోవచ్చు.   

సిలువ మరణ శిక్ష మొదటిగా ఫోనీషియన్లు అమలు పరచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు మరియు రోమన్లు ఈ శిక్షను అమలు పరచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే ఉద్దేశంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. రోమన్‌ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ శిక్ష విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు, పరాయి దేశస్థులకు, నేరస్థులకు ఈ శిక్ష విధించే వారు.

యేసుక్రీస్తుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్లు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి భుజాలపై సిలువను మోపి కల్వరి కొండపైకి నడిపించారు. సిలువ సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. భారభరితమైన ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. కల్వరి అనగా కపాలమనబడిన స్థలము. మనిషి యొక్క పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్‌ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు. 

ఇశ్రాయేలు దేశంలో లభించిన భూగర్భ శాస్త్రవేత్తల నివేదికల ఆధారంగా ఇనుముతో చేయబడిన మేకులు సుమారు 7 అంగుళాల పొడవు ఉంటాయి. సుమారు 1 నుండి 2 సెంటిమీటర్ల మందం ఉండేవి. ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ట్యురిన్‌ వస్త్రపు పరిశోధనల ఆధారంగా మేకులను మణికట్టులో కొట్టేవారని తేలింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇశ్రాయేలు మ్యూజియంలో మొదటి శతాబ్దానికి చెందిన ఒక వ్యక్తి పాదము, ఆ పాదములో దించబడిన మేకు కనబడుతుంది. దానిని బట్టి ఆ కాలంలో సిలువ విధించబడే సమయంలో ఏవిధంగా మేకులు కొట్టేవారో అర్థం చేసుకోవచ్చు.

యేసుక్రీస్తు ప్రభువును సిలువపై ఉంచి చేతులలో కాళ్లల్లోను కఠినమైన మేకులను దించారు. తీవ్రమైన వేదన యేసు భరించాడు. మేకులతో సిలువకు దిగగొట్టిన తరువాత సుమారు ఆరు గంటలు యేసుక్రీస్తు సిలువపై వేలాడారు. ఏడు మాటలు పలికిన తరువాత పెద్దకేక వేసి తన ప్రాణమర్పించారు. అయితే విశ్రాంతి దినమున దేహములు సిలువ మీద ఉండకూడదు. కాబట్టి కాళ్లు విరుగ గొట్టడానికి సైనికులు సిద్ధపడ్డారు. వారు వచ్చి యేసుతో పాటు సిలువ వేయబడిన నేరస్థుల కాళ్ళు విరుగగొట్టారు. అయితే యేసు అంతకు ముందే మృతినొందుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు. ‘సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కలో పొడిచెను. వెంటనే రక్తమును, నీళ్లును కారెను’ అని బైబిల్‌లో వ్రాయబడింది. 

యేసుక్రీస్తు మరణించిన కొద్దిసేపటికి ఆయన దేహములో పొడవబడిన ఈటె వలన రక్తము, నీళ్లు బయటకు వచ్చాయి. రోమన్లు వాడే బల్లెము లేక ఈటె పొడవు సుమారు 1.8 మీటర్లు. ఆయన దేహములో కుడి పక్కన పొడవబడిన బల్లెపు పోటు వలన రక్తము, నీళ్లు బయటకు వచ్చాయి. ఇక్కడ బల్లెపు కొన లోతుగా గుచ్చుకొనుట ద్వారా గుండె వరకు చేరి అక్కడ ఉన్న కుడి కర్ణిక, కుడి జఠరిక నుంచి రక్తం బయటకు వచ్చింది. ఆ తదుపరి నీళ్లు అనగా దేహములో ఉన్న శ్లేష్మరసము, గుండె చుట్టూ ఉన్న పొర చీల్చబడుటను బట్టి వచ్చిన ద్రవము.                  

వాస్తవాన్ని పరిశీలిస్తే ‘యేసు గొప్ప శబ్దముతో కేకవేసి..’ అనే మాట లూకా సువార్త 23:46లో చూడగలము. ఒక వ్యక్తి చనిపోయే ముందు పెద్దకేక ఏ పరిస్థితుల్లో వేస్తాడు? ఈ విషయంపై తలపండిన వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. సిలువ వేయబడడానికి ముందు సాయంత్రం నుంచి తీవ్రవేదన అనుభవించారు. న్యాయస్థానాల యొద్దకు త్రిప్పడం వలన శరీరం బాగా అలసిపోయింది. కొరడా దెబ్బల ద్వారా చాలా రక్తము పోయింది. తలపై ముళ్లకిరీటం, భారభరితమైన సిలువ మోయడం, చేతుల్లో కాళ్లలో మేకులు కొట్టడం ద్వారా దాదాపుగా చాలా రక్తం యేసుక్రీస్తు దేహంనుంచి బయటకు పోయింది.

శరీరం రక్తము, ద్రవములు కోల్పోవుట వలన గుండె రక్తప్రసరణ చేయలేని పరిస్థితి, శ్వాసావరోధము, తీవ్రమైన గుండె వైఫల్యం. వైద్య శాస్త్ర ప్రకారం సిలువపై యేసుక్రీస్తు పెద్ద కేకవేసి చనిపోవడానికి కారణములు ఇవే. ఈ విషయంపై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అనేక మంది వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన జరిపి అనేక పుస్తకాలను కూడా వెలువరించారు. వాటిలో మెడికల్‌ అండ్‌ కార్డియోలాజికల్‌ ఆస్పెక్ట్స్‌ ఆఫ్‌ ద ప్యాషన్‌ అండ్‌ క్రూసిఫిక్షన్‌ ఆఫ్‌ జీసస్, ఎ డాక్టర్‌ ఎట్‌ కల్వరి, ద లీగల్‌ అండ్‌ మెడికల్‌ ఆస్పెక్ట్స్‌ ఆఫ్‌ ద ట్రయల్‌ అండ్‌ ద డెత్‌ ఆఫ్‌ క్రైస్ట్‌’ ప్రాముఖ్యమైనవి.    

‘దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను’ అని అపొస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి పత్రిక వ్రాస్తూ తెలియచేశాడు. క్రీస్తు సిలువలో మరణించుట ద్వారా ప్రేమ ఋజువు చేయబడింది. ప్రేమంటే తీసుకోవడం కాదు, ప్రేమంటే ఇవ్వడం అని క్రీస్తు తన ఆచరణతో మానవాళికి తెలియచేశారు. పరిశుద్ధుడైన దేవుడు మానవాళిని పాపబంధకముల నుండి, పాపశిక్ష నుండి విడుదల చేయుటకు తన్నుతానే బలిగా అప్పగించుకున్నాడు.

గుడ్‌ఫ్రైడే కేవలం యేసుక్రీస్తు మరణదినం కాదు. మానవుడు పరిశుద్ధతను పొందుకొని నూతనంగా జన్మించడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన రోజు. సిలువలో యేసుప్రభువు పలికిన సప్తస్వరాలు శిథిలమైపోయిన మానవుని జీవితాన్ని అద్భుతమైన నవకాంతులమయమైన నిర్మాణముగా మార్చివేశాయి. ప్రపంచానికి ఆయన అందించిన వెలలేని ప్రేమ, శత్రువుని కూడా కరిగించగలిగిన ఆయన క్షమాపణ, ఎంతటి దీనులనైనా అక్కున చేర్చుకోగలిగిన ఆదరణ, ఆప్యాయత, చెక్కు చెదరనవని ఆ సిలువలో ఆయన ప్రకటించిన నిత్యజీవము చిరస్థాయిగా నిలిచేదని ఋజువు చేశాయి.

దేవుని ప్రేమను రుచిచూచిన ఒక దైవజనుడు ఇలా అంటాడు. ‘అంతులేని పాపము జలరాసుల్లో నన్ను దింపగా సిలువ రక్తము నాకై కార్చితివో, క్రయధనం నాకై చెల్లించితివో! కమ్మనైన నీదు ప్రేమ నాదు కట్లు తెంపెను. నీవు పొందిన గాయము నాకు స్వస్థత నిచ్చెను. ఏమిచ్చి ఋణం తీర్తునయ్యా యేసయ్యా! నా జీవితం అంకితం నీకే.’ అప్పటికే ఆయన చెప్పినట్లు తిరిగి లేస్తాడేమోనని ఆనాటి యూదులు, రోమన్‌ సైనికులు అనేక కథనాలు రచించుకుని సిద్ధంగా ఉన్నారు. కాని ఆ కథలేవీ సత్యం ముందు నిలబడలేదు. ఆయనను సిలువ మరణం ద్వారా చంపేశామని జబ్బలు కొట్టుకునే యూదులకు, రోమన్లకు మింగుడుపడని వార్త ‘ఆయన సజీవుడై పునరుత్థానుడుగా లేచెను.’

యేసుక్రీస్తుకు సిలువ మరణం విధించిన రోమన్‌ శతాధిపతి పేరు బైబిల్‌లో లేదు గాని చరిత్రలో అతని పేరు చూడగలము. ఆ వ్యక్తి పేరు లాజినస్‌. పిలాతు ఆజ్ఞను శిరసావహించడంలో ప్రథముడు. అతని సమక్షములోనే యేసు మేకులు కొట్టబడ్డాయి. ముళ్లకిరీటం ధరించబడింది. సిలువ ప్రక్రియంతా పూర్తయ్యాక పొంతి పిలాతు ముందు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని తన భర్తకు వర్తమానం పంపిన పిలాతు భార్య క్లౌదియ ప్రొక్యులా లాజినస్‌ను కలుసుకుంది ఇలా అడిగింది సిలువలో మరణించిన ‘క్రీస్తుపై నీ అభిప్రాయం ఏమిటి?’.

ఆ ప్రశ్నలకు లాజినస్‌ ఇచ్చిన సమాధానమిది–‘క్రీస్తు మరణించినప్పుడు జరిగిన పరిస్థితులను గమనిస్తే ఆయన నిజముగా దేవుడని రుజువు చేయబడింది. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు తన ముఖాన్ని దాచుకున్నప్పుడు వచ్చిన చీకటి, సమాధులలో నుండి మనుష్యులు లేవడం, దేవాలయపు తెర పైనుండి క్రిందకు చినగడం చూస్తుంటే తాను చెప్పినట్టే ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. మరణపు మెడలు వంచి సజీవుడై బయటకు వస్తాడు. సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన విశ్వసంచారానికి బయలుదేరుతాడు. ఈసారి ఆయన్ను ఏ రోమన్‌ చక్రవర్తి, శతాధిపతి గాని, సైనికుడు గాని, యూదా మత పెద్దలైన శాస్త్రులు, పరిసయ్యులు గాని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’ అని బదులిచ్చాడు.

క్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్‌ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పునరుత్థాన పండుగను చాలా భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటారు. యేసు లేఖనాల ప్రకారం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచెను. నా విమోచకుడు సజీవుడు అని యోబు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా పలికాడు. దావీదు కీర్తనలలో కూడా క్రీస్తు పునరుత్థానమును గూర్చి ప్రవచనాలు ఉన్నాయి.

‘నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు’ (కీర్తన 16:10) అనే ప్రవచనం క్రీస్తుకు ముందు వెయ్యిసంవత్సరాల క్రితమే చెప్పబడింది. యెషయా అనే ప్రవక్త క్రీస్తును గూర్చి ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. అవన్నీ క్రీస్తుకు ముందు ఏడువందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డాయి. వాటిలో క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన ప్రవచనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో చూడగలము. అతడు తన్నుతానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. 

యేసుక్రీస్తు పునురుత్థానానికి ఎన్నో ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయి. క్రీస్తు పునరుత్థానానికి ఆయన శిష్యులే ప్రధాన సాక్షులు. ‘శిష్యులు భ్రమలో ఉన్నారు. అందుకే వారు ఎవరిని చూసినా యేసులాగే కనిపించారు అని తలచేవారు’ అని కొందరు వాదిస్తారు. నిజంగా వారికున్నది భ్రమ అయితే అది కొంతకాలమే ఉంటుంది. క్రీస్తు శిష్యులలో చాలామంది హతసాక్షులయ్యారు. తాము నమ్మిన ప్రభువు కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఒక అబద్ధం కోసం అంతమంది ప్రాణాలర్పించరు కదా! ఉదాహరణకు క్రీస్తు శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు.

క్రీస్తు సువార్త మొదటి శతాబ్దంలోనే భారతదేశంలోనికి వచ్చింది. యేసు శిష్యుడైన తోమా ఆయన తిరిగి లేచాడంటే మొదట నమ్మలేదు. నీవు అవిశ్వాసి కాక విశ్వాసివై యుండు అని ప్రభువు చెప్పిన మాటకు సానుకూలంగా స్పందించి ‘నా దేవా నా ప్రభువా’ అని పలికాడు. అప్పటి నుండి తోమా క్రీస్తు సాక్షిగా జీవిస్తూ అనేకులను సత్యంవైపు నడిపించాడు. తోమా భారతదేశానికి మొదటి శతాబ్దంలోనే వచ్చి యేసుక్రీస్తు సువార్తను అనేకులకు అందించాడు. అనేక సంఘాలను మరియు దేవాలయాలను కట్టి చివరకు బల్లెము ద్వారా పొడవబడి చనిపోయాడు.

యేసు క్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్‌ మోరిసన్‌ యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేవలేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అనేక ప్రాంతాలు సందర్శించి అనేక వివరాలు సేకరించిన తదుపరి ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలు అన్నింటిని బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి అద్భుతమైన పుస్తకాన్ని వ్రాశాడు. దాని పేరు ‘ఈ రాతిని ఎవరు కదిలించారు?’ ఆ పుస్తకంలో యేసుక్రీస్తు పునురుత్థానానికి సంబంధించి అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు. యేసు మరణాన్ని జయించి తిరిగి లేవలేదు అని చెప్పడానికి ఏవేవో సిద్ధాంతాలను చలామణీలోకి తీసుకొచ్చినా, అవేవీ వాస్తవం ముందు నిలబడలేదు. 

అరిమతయియ యోసేపు, నికోదేము అనువారు క్రీస్తు దేహాన్ని సిలువనుండి దింపి ఒక తోటలో తొలచబడిన సమాధిలో ఉంచారు. అరిమతయియ యోసేపు బహు ధనవంతుడు, యూదుల న్యాయసభలోని సభ్యుడు. తాను ఇంతకు ముందు క్రీస్తుకు రహస్య శిష్యుడు. తనకోసం తొలిపించుకున్న సమాధిని క్రీస్తుకు ఇచ్చేశాడు. నీ పరిస్థితేంటి అని ఎవరో అడిగారట. అందుకు యోసేపు ఇచ్చిన సమాధానం ‘నేను యేసుకు ఈ సమాధిని మూడు రోజులకే ఇస్తున్నాను’. నిజమే! యేసు సమాధిలో మూడు రోజులే ఉన్నాడు. తాను మరణించక ముందు తన పునరుత్థానమును గూర్చి పదే పదే మాట్లాడాడు. తాను చెప్పినట్టే క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? అని శాసిస్తూ మరణపు ముల్లును విరచి క్రీస్తు మృత్యుంజయుడైనాడు. పునః అనగా తిరిగి, ఉత్థానము అనగా లేపబడుట. 

ప్రపంచాన్ని గడగడలాడించిన ఘనులెందరో సమాధులకే పరిమితమయ్యారు. ఈజిప్టులో నేటికి ఫారోల సమాధులు (పిరమిడ్లు), వారి దేహాలు ఉన్నాయి. సూర్యదేవుని కుమారులమని చాటించుకున్న ఫారోల్లో ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు. బబులోను రాజైన నెబుకద్నెజరు మరణాన్ని ఓడించలేకపోయాడు. అలెగ్జాండ్రియాలో ఇప్పటికీ అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ సమాధి ఉంది. రోవ్‌ులో జూలియస్‌ సీజర్‌ సమాధి మూయబడి ఉంది. చరిత్రలో ఎందరో మరణాన్ని జయించలేకపోయారు. యేసు మరణాన్ని జయించుట ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదని ఋజువుచేయబడింది.  

క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది. అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధిచేయబడింది. చావు దాని రూపురేఖలను కోల్పోయింది. బంధింపబడిన వ్యక్తికి సంపూర్ణ విడుదల వచ్చింది. ఏండ్ల తరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. సమస్యలమీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం  మీద విజయం కల్గింది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కనీవినీ ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది.

క్రీస్తు పునరుత్థానం మనిషికి నిజమైన శాంతిని సమాధానాన్ని ప్రసాదించింది. డబ్బు, పలుకుబడి, ఆస్తి ఐశ్వర్యాలు ఎన్నున్నా ఈ రోజుల్లో మనిషికి ఆనందం, శాంతి కరువైపోతోంది. శాంతిగా బతకడానికి మానవుడు చెయ్యని ప్రయత్నమంటూ ఏదీ లేదు. నవ్వుతూ బతకాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా లాఫ్టర్‌ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. రోజులో కొంత సమయం అక్కడికి వెళ్ళి పగులబడి నవ్వుకుంటున్నా శాంతి సమాధానాలు దొరకని కారణాన ఈ మధ్యన క్రైయింగ్‌ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ఏడ్వడం ద్వారా బయటకు పంపిస్తే సంతోషంగా ఉండొచ్చన్నది వారి అభిప్రాయం.

ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించే మార్గాలు మాత్రమే. నిజమైన ఆనందం, శాంతి దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా లభిస్తుంది. యేసుక్రీస్తు అలసిపోయిన ప్రజలను చూచి ఇలా అన్నాడు. ‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును’. ఆయన చెంతకు వచ్చిన ఎన్నో జీవితాలు పావనమయ్యాయి. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును అనుభవిస్తు ఆనందంతో పరవశులౌతున్నారు. పునరుత్థానుడైన క్రీస్తును చూచి శిష్యులు పులకించిపోయారు. దేవుడు తమ్మును విడిచిపెట్టలేదన్న సత్యం వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నూతనోత్తేజంతో తమ లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయారు.  

జర్మనీ దేశంలో క్రీ.శ 1483లో జన్మించిన మార్టిన్‌ లూథర్‌ గురించి తెలియని వారుండరు. యవ్వనకాలంలోనే స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో నింపబడినవాడు. సంకుచితత్వానికి దర్పణాలుగా మారిపోయిన స్వార్థజీవులకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ప్రారంభించాడు. తాను జీవించిన కాలంలో అధికారం మూర్ఖుల చేతుల్లో ఉందని గుర్తించాడు. సగటు మనిషి అన్ని విషయాల్లో బానిసగానే ఉన్నాడన్న విషయాన్ని గుర్తించాడు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. మనిషి చేసే కార్యాల వలన రక్షణ రాదుగాని విశ్వాసం ద్వారానే సాధ్యమని నిరూపించాలనుకున్నాడు. రాత్రింబగళ్ళు విశేషంగా ప్రయాసపడ్డాడు. ఆనాటి మతాధికారులకు ఎదురు తిరగడమంటే మరణాన్ని కోరుకోవడమే. 

ఒకరోజు మార్టిన్‌ లూథర్‌ నిరాశ నిస్పృహతో నీరుగారిపోయాడు. ఇంటిలో ఓ బల్లపై ముఖాన్ని వాల్చి ఏడుస్తున్నాడు. భయరహిత వాతావరణం సృష్టించుకొని ముందుకు సాగడం కష్టం అనిపించింది. దుఃఖిస్తున్న తన భర్తను చూచిన కేథరిన్‌ గబగబా లోపలికి వెళ్ళి నల్లబట్టలు వేసుకొని లూథర్‌ ముందు నిలబడింది. జర్మనీ దేశంలో ఏదైనా దుర్వార్తను తెలియచేసే సందర్భంలో నల్లబట్టలు ధరిస్తారు. ‘నేను ఇప్పటికే దుఃఖములో ఉన్నాను. నీవు తీసుకొచ్చిన మరొక దుర్వార్త ఏమిటని ప్రశ్నించాడు’. ‘యేసుక్రీస్తు చచ్చిపోయాడు’ అని జవాబిచ్చింది కేథరిన్‌. నీవు చెప్పేది వాస్తవమే గానీ క్రీస్తు మరణించి తిరిగి లేచాడు గదా! లూథర్‌ కొంచెం స్వరం పెంచి అన్నాడు. 

కేథరిన్‌ లూథర్‌ భుజం మీద చెయ్యి వేసి ‘క్రీస్తు మరణాన్ని జయించి లేచాడని నమ్మే ప్రతి ఒక్కడూ ఏవిషయానికీ బెదిరిపోడు, చింతించడు. తుది శ్వాస వరకు నాభర్తలో ధైర్య సాహసాలను, దేవునిపై అచంచల విశ్వాసాన్ని మాత్రమే నేను చూడాలనుకొంటున్నాను’ అని కేథరిన్‌ మాట్లాడుతుండగానే లూథర్‌లో ఉన్న భయం పటాపంచలయ్యింది. అప్రతిహతంగా ముందుకు సాగిపోయి ఉత్తమ వ్యక్తిగా ఎదిగాడు. తాను అనుకున్న వాటిని దైవిక బలంతో, దృఢ విశ్వాసంతో సాధించగలిగాడు. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి నాంది పలికాడు.

సమాధికి, శ్మశానానికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికీ పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్లు తెరుచుకొనేలా చేసింది. మానవునికి ముగింపు లేదని ఒక అపూర్వమైన అనిర్వచనీయమైన నిత్యత్వమనేది వుందని గొంతు చించుకొని చాటి చెప్పింది. దుఃఖముతో, నిరాశతో, నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికీ ఆశా కిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడయ్యి పోయింది. ఎన్నో ఏండ్లుగా ఎన్నో కోట్లమంది సమైక్యంగా పోరాడినను మన జీవితాల్లో శత్రువై నిలిచిన దుర్వ్యసనాలు, దౌర్భాగ్యమైన శారీరక కోరికలు, పాపపు ఇచ్ఛలు, విచ్చలవిడి పాపకార్యాలు మరే నరశక్తి వలన పటాపంచలు చేయబడవు గాని, పరమాత్ముడు కార్చిన అమూల్య రక్తం ద్వారా చేసిన త్యాగం ద్వారా అందించిన పునరుత్థాన శక్తిచేత మాత్రమే సాధ్యం.

యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు కులమతాలకు అతీతమైనవి. ఇది మానవ హృదయాలకు సంబంధించినది తప్ప ఈ భౌతికానుభవాలకు చెందినది కాదని యేసుక్రీస్తును రక్షకునిగా రుచి చూచిన వారందరికీ యిట్టే అవగతమవుతుంది. లోక వినాశనానికి మూలకారకుడైన అపవాది క్రియలను లయపరచుటకే యేసు క్రీస్తు ప్రత్యక్షమాయెనని సత్యగ్రంథమైన బైబిల్‌ గ్రంథం స్పష్టపరచింది. సాక్షి పాఠకులకు ఈస్టర్‌ శుభాకాంక్షలు. డా. జాన్‌వెస్లీ, క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్, రాజమండ్రి
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top