Pancreatic Cancer: క్యాన్సర్‌ నుంచి బయటపడొచ్చు.. సైంటిస్టులు కనిపెట్టిన కొత్త రీసెర్చ్‌

Replacing Critical Nutrient With Mimic Starves Pancreatic Cancer - Sakshi

క్యాన్సర్‌.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇదో ప్రాణాంతక వ్యాధి. సరైన సమయంలో ట్రీట్‌మెంట్‌ తీసుకోకపోతే ప్రాణాలు పోతాయి.అయితే క్యాన్సర్‌ నుంచి బయట పడేందుకు సైంటిస్టులు ఇప్పుడో కొత్త మార్గాన్ని ఆవిష్కరించారు. క్యాన్సర్‌ కణాల ఎదుగుదలకు, వ్యాప్తికి సాయపడే పోషకాల స్థానంలో ఉత్తుత్తి పోషకాలను అందిస్తే వ్యాధి వ్యాప్తి నిలిచిపోతుందని, కణితి సైజు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ బర్న్‌హామ్ ప్రీబిస్ మెడికల్ డిస్కవరీ ఇన్‌స్టిట్యూట్‌ జరిపిన ప్రయోగం ప్రకారం..ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణితి ఎదుగుదలకు, వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే పోషకాల స్థానంలో డమ్మీ పోషకాలు ఇవ్వడం ద్వారా క్యాన్సర్‌ను నియంత్రించవచ్చు. క్యాన్సర్లలో ఎన్నో రకాలుంటాయన్నది తెలిసిందే. క్లోమగ్రంథి (పాంక్రియాటిక్‌)కి వచ్చే క్యాన్సర్‌ కొంచెం ముదురుటైపు. దీని బారిన పడ్డవారు కోలుకోవడం అసాధారణమే. ఏటా దాదాపు 14 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సాధారణంగా 35-39, 85-89 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ క్యాన్సర్ ఎక్కువ. క్లోమ గ్రంథి క్యాన్సర్ వచ్చిన వారిలో మూడు-మూడున్నరేళ్లకు మించి జీవించి ఉండేవారు పది శాతానికి మించి లేరని పరిశోధనలో వెల్లడైంది. జన్యు కారకాలు, వయస్సు, జీవనశైలి కారణంగా ఈ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.

క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌లో అదే కీలకం

క్లోమగ్రంథి క్యాన్సర్‌ సాధారణంగా గ్లుటామైన్‌ అనే పోషకంపై ఎక్కువగా అధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని అందకుండా చేస్తే క్యాన్సర్‌ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. గ్లుటమైన్‌ అందుబాటులో లేనప్పుడు క్యాన్సర్‌ కణాలు ఆస్పరాజైన్‌తో సహా ఇతర పోషకాలపై కాబట్టి ఈ రెండు పోషకాలు అందకుండా చేస్తే వ్యాధిని కట్టడి చేయవచ్చు. ఇందుకోసం శాస్త్రవేత్తలు అచ్చం గ్లుటమైన్‌ మాదిరిగానే ఉండే 6-డయాజో-5-ఆక్సో-ఎల్-నార్లూసిన్ (DON)ను, ఇప్పటికే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్సకు ఉపయోగిస్తున్న L-ఆస్పరాగినేస్‌లను కలిపి ఎలుకలపై ప్రయోగాలు చేశారు.

L-ఆస్పరాగినేస్ అనేది ఆస్పరాజైన్‌ను విచ్ఛిన్నం చేసే కీమోథెరపీ ఔషధం. ఇది క్యాన్సర్‌ కణాలను వృద్ది చెందకుండా అడ్డుకుంటుంది. రెండింటినీ కలిపి వాడినప్పుడు ఎలుకల్లోని క్యాన్సర్‌ కణితి సైజు తగ్గిపోయినట్లు.. వ్యాధి వ్యాప్తి కూడా ఎక్కువ జరగనట్లు తేలింది. క్యాన్సర్‌ కణాల ప్రొటీన్‌ ఉత్పత్తికి, కొత్త కణాల తయారీకి ఆస్పరాజైన్ అవసరం. DONను ఇప్పటికే ఊపరితిత్తుల క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌లో ఉపయోగిస్తున్నారు కానీ... రెండింటినీ కలిపి వాడటం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఇదే పద్ధతిని అంటే రెండు రకాల డమ్మీ పోషకాలను కలిపి వాడటం క్లోమగ్రంథి క్యాన్సర్‌ చికిత్సకూ వాడవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సైలంట్‌ కిల్లర్‌...
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్న క్యాన్సర్లలో ఇది కూడా ఒకటి.అలసట, ఆకలి లేకపోవడం,ఉబ్బినట్లు అనిపించడం వంటి అజీర్ణం లక్షణాలు,అకస్మాత్తుగా బరువు తగ్గడం, శరీరంలో రక్తం గడ్డ కట్టడం వెన్ను నొప్పి, కామెర్లు, విపరీతంగా కడుపునొప్పి వంటివన్నీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు. ధూమపానం, మధుమేహం ఎక్కువగా సేవించడం, కుటుంబంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి.

ఇతర క్యాన్సర్‌ల మాదిరిగానే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ క్లోమ గ్రంథిలో కణాల అసాధారణ పెరుగుదల వల్ల వస్తుంది. ప్యాంక్రియాస్ (క్లోమం) కడుపులో ముఖ్యమైన భాగం. ఇది చిన్న పేగు దగ్గర ఉండే పొడవైన గ్రంథి.ఇది జీర్ణక్రియకు సహాయపడే పదార్థాలు లేదా ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో సహాయపడటమే కాకుండా, రక్తప్రవాహంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించే హార్మోన్లను విడుదల చేయడంలో కూడా సహాయపడుతుంది.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను సైలెంట్ కిల్లర్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది వ్యాధి తీవ్రం అయ్యేవరకు ఎలాంటి లక్షణాలను చూపించదు. ఈ రకమైన క్యాన్సర్‌ చాలా తొందరగా శరీరంలోని ఇతర అవయవాలకి వ్యాపిస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు తరచుగా పొత్తికడుపు, కాలేయానికి వ్యాప్తి చెందుతాయి. అంతేకాకుండా ఊపిరితిత్తులు, ఎముకలు, మెదడుతో పాటి ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top