పర్యటన : రాజా అంపట్
కొన్ని ప్రదేశాలు చూడటానికి వెళ్లాలి అనుకుంటాం. కొన్ని ప్రదేశాలు మాత్రం మనల్ని రారమ్మని పిలుస్తాయి. అలాంటి కోవలోకి చెందినదే ‘రాజా అంపట్’. ఇండోనేషియాలోని సౌత్‌వెస్ట్ పాపువాప్రాంతంలో ఉన్న ఈ ‘రాజా అంపట్’ అనేప్రాంతం వేలాది చిన్న ద్వీపాల సమూహం. ప్రకృతి తన అందం మొత్తం ఒక్కసారి చూపించాలి అనుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ కనులారా వీక్షించవచ్చు. పచ్చని అడవులు, నీలి సముద్రం, తెల్లని ఇసుక తీరాలు కలిసి ఒక చిత్రకారుడి కాన్వాస్‌లా కనిపిస్తాయి. ప్రతి ప్రయాణంలో ఒక కొత్త దృశ్యం, ప్రతి అలలో ఒక కొత్త అనుభవం నిండి ఉంటుంది.
ఆసక్తికరమైన విషయాలు..
రాజా అంపట్ అంటే ఇండోనేషియా భాషలో నలుగురు రాజులు అని అర్థం.
ఇది ఇండోనేషియాలోని సౌత్‌వెస్ట్ పాపువాప్రాంతంలో ఉంటుంది.
ఈప్రాంతం మొత్తం వేలాది చిన్న ద్వీపాలతో కలిసి ఉంటుంది.
ప్రకృతి, సముద్ర జీవ వైవిధ్యం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
సముద్రం రంగుల మార్పులు ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన దృశ్యాల్లో ఒకటి.
రాజా అంపట్ చేరగానే మనకు ముందు కనిపించేది విశాల సముద్రం. అక్కడి నీటి రంగుల్లో ఆకాశంలోని మబ్బుల కదలికలను స్పష్టంగా చూడవచ్చు. కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల టార్కాయిస్, మరికొన్ని చోట్ల గాఢమైన నీలం. ద్వీపాల మధ్య వెళ్తున్న బోట్ ప్రయాణం ఒక సినిమా సీ¯Œ లా అనిపిస్తుంది. చుట్టూ చిన్న చిన్న లైమ్‌స్టోన్ ద్వీపాలు నీటి నుంచి వెలుస్తున్నట్టు ఉంటాయి. వాటిని చూస్తుంటే ప్రకృతి. సముద్రం మధ్యలో తన సంతకం పెట్టినట్టు అనిపిస్తుంది. అలలు మెల్లిగా బోట్‌ని తాకుతుంటే సమయం కూడా అక్కడ నిలిచిపోయిందేమో అనిపిస్తుంది.
సందర్శనీయ ప్రదేశాలు..
రాజా అంపట్‌లో ప్రతి ద్వీపం ఒక కొత్త కథ చెబుతుంది. ప్లేనెమో వ్యూ పాయింట్ నుంచి చూస్తే పచ్చని ద్వీపాలు నీలి సముద్రంపై విరిసిన ఆకుల్లా కనిపిస్తాయి. వాయాగ్ అనేప్రాంతంలో సముద్రం, ద్వీపాల మధ్య కనిపించే దృశ్యం ఒక కలలా ఉంటుంది. మిసూల్ దగ్గర నీటి కింద ఉన్న పగడపు దిబ్బల ప్రపంచం మరింత ఆకర్షిస్తుంది. సముద్రంపై చూస్తున్నప్పుడు ఒక అందం, నీటి కింద చూస్తున్నప్పుడు మరొక అందం కనిపిస్తుంది. కొన్ని చోట్ల సముద్రం అంతా స్పష్టంగా ఉంటుంది కాబట్టి బోట్ నుంచి కూడా నీటి కింద లైఫ్ ఎలా ఉందో కనిపిస్తుంది.
ఎక్కడ ఉండాలి?
రాజా అంపట్‌లో ఉండటం అంటే కేవలం రూమ్‌కి పరిమితం అవ్వడం మాత్రమే కాదు. సముద్రం దగ్గర కట్టిన వుడెన్ కాటేజీలు, నీటిపై నిలబెట్టిన విల్లాలు, అడవి మధ్య ఉన్న ఎకో రిసార్ట్స్ ప్రయాణాన్ని మరింత అందంగా మార్చేస్తాయి. ప్రతి ఉదయం అలల శబ్దాలతో మేలుకోవడం, సాయంత్రం సముద్రంపై పడిన సూర్యాస్తమయం చూస్తూ కూర్చోవడం అక్కడి రోజుల్లో భాగం అయిపోతుంది. నగర హడావిడి నుంచి దూరంగా ప్రకృతి మధ్య గడిపిన సమయం మనసుకి ఒక కొత్త ప్రశాంతతను ఇస్తుంది.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలైతే ముందు ఇండోనేషియా రాజధాని జకార్తా లేదా బాలీ చేరుతారు. అక్కడి నుంచి పాపువాప్రాంతం వైపు విమానం వెళుతుంది. ప్రయాణంలో నగర దృశ్యాలు తగ్గి సముద్రం, ద్వీపాల ప్రపంచం మొదలవుతుంది.
విజయవాడ నుంచి రాజా అంపట్ వెళ్లాలి అనుకుంటే హైదరాబాద్ లేదా చెన్నై నుంచి వెళ్లవచ్చు. ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో సముద్రం మధ్య చిన్న ఎయిర్‌పోర్ట్ చేరిన అనుభవమే యాత్రలో ఒక ప్రత్యేక జ్ఞాపకంగా మిగులుతుంది. ఆకాశం నుంచి కనిపించే ద్వీపాల దృశ్యం రాజా అంపట్ అందాన్ని ముందుగానే పరిచయం చేస్తుంది.
ఏం చూడాలి?
ఉదయం వేళలో సముద్రంపై పడిన సూర్యకిరణాలు రాజా అంపట్‌ని మరింత వెలుగులతో నింపేస్తాయి. బోట్‌లో ద్వీపాల మధ్య తిరుగుతుంటే ప్రతి మలుపు దగ్గర కొత్త దృశ్యం కనిపిస్తుంది. కొన్ని చోట్ల పక్షుల గానం వినిపిస్తుంది. మరికొన్ని చోట్ల సముద్రం శబ్దం మాత్రమే ఉంటుంది. నీటి కింద కనిపించే కోరల్ గార్డెన్స్, రంగురంగుల చేపలు, నిశ్చలంగా తిరిగే సముద్ర జీవులు అక్కడ ప్రకృతి వైభవాన్ని మరింత దగ్గర నుంచి చూపిస్తాయి. సూర్యాస్తమయం సమయంలో సముద్రంపై విరిసిన బంగారు వెలుగు ప్రయాణంలో మర్చిపోలేని క్షణంగా మిగిలిపోతుంది.
ఏం తినాలి?
ఇండోనేషియా రుచులను ఎంజాయ్ చేయడానికి రాజా అంపట్ మంచి చాయిస్ అని చెప్పవచ్చు. తాజా సీఫుడ్ సముద్రం దగ్గర కూర్చుని ఆస్వాదించే అనుభవం ప్రత్యేకం. కొబ్బరి ఫ్లేవర్స్, లోకల్ స్పైసెస్, సముద్రపు రుచులు కలిసిన భోజనం ప్రయాణంలో భాగం అయిపోతుంది. సాయంత్రం వేళలో సముద్రం ముందు కూర్చుని లోకల్ ఫిష్ కర్రీ, గ్రిల్డ్ సీఫుడ్ లేదా ఇండోనేషియన్ డిషెస్ ఆరగించడం అక్కడి జీవన శైలిని దగ్గరగా అనుభవించిన అనుభూతిని ఇస్తుంది.
యాత్ర, బడ్జెట్ వివరాలు
హైదరాబాద్ నుంచి రాజా అంపట్‌కి ఐదు రోజుల యాత్ర కోసం బడ్జెట్ రూ.90 వేల నుంచి రూ.1 లక్షా 20 వేల మధ్య ఉంటుంది. స్టాండర్డ్ కంఫర్ట్ యాత్ర రూ.1 లక్షా 40 వేల నుంచి రూ.2 లక్షల వరకు చేరవచ్చు.
ప్రీమియం రిసార్టులు, ఎక్స్‌క్లూసివ్ ఐలాండ్ ఎక్స్‌పీరియెన్స్ యాడ్ చేస్తే రూ.2 లక్షల 50 వేల వరకు ఉండవచ్చు.
స్టే చార్జీలు ప్రతి రాత్రికి రూ.4 వేల నుంచి రూ.25 వేల మధ్య ఉంటాయి. ఫుడ్ ఖర్చు రోజుకు సాధారణంగా రూ.1,000 నుంచి రూ.3,000 మధ్య ఉంటుంది. ఐలాండ్ హాపింగ్ బోట్ ఎక్స్‌పీరియెన్స్ మెరైన్ ఎక్స్΄్లోరేషన్ యాక్టివిటీస్ ఈ యాత్రలో ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతాయి.
ఇండోనేషియాకి భారతీయ ప్రయాణికులకు వీసా అవసరం ఉంటుంది. ట్రావెల్ ప్లాన్ ను బట్టి లేటెస్ట్ వీసా గైడ్‌లైన్స్ని ముందుగా పరిశీలించడం – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు


