ఆషాఢ శుక్ల ఏకాదశి బంగారు స్వామి | PURI Jagannathudi toli ekadasi celebrations | Sakshi
Sakshi News home page

ఆషాఢ శుక్ల ఏకాదశి బంగారు స్వామి

Jul 7 2025 1:26 PM | Updated on Jul 7 2025 2:36 PM

 PURI Jagannathudi toli ekadasi celebrations

భువనేశ్వర్‌: శ్రీ క్షేత్రంలో ఆషాఢ శుక్ల ఏకాదశి పుణ్య తిథి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పూరీ శ్రీ మందిరం భక్త జనంతో కిటకిటలాడింది. వేకువ జాము నుంచి ప్రత్యేక పూజాదులతో స్వామి పలుమార్లు ఆకర్షణీయమైన అలంకరణతో శోభిల్లాడు. హరి శయన ఏకాదశి పురస్కరించుకుని రథాలపై దేవుళ్లకు 2 సార్లు బొడొ సొంగారొ అలంకరణ చేయడం విశేషం. ఈ సందర్భంగా రథాలపై మూల విరాటుల్ని స్వర్ణ అలంకారంలో దర్శించుకుని భక్తులు తరించారు.  

శ్రీ క్షేత్ర వాసుడు శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్ర దాదాపు అంతిమ దశకు చేరుకుంది. స్వామి యాత్ర ఆద్యంతాలు భక్త జనాన్ని మురిపిస్తాడు. పవిత్ర ఆషాఢ శుక్ల ఏకాదశి పుణ్య తిథి పురస్కరించుకుని భక్తులకు బంగారు శోభతో దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో 3 రథాలపై దేవుళ్లని బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఈ సందర్భంగా శ్రీ మందిరం సింహ ద్వారం ప్రాంగణంలో పతిత పావనునికి బంగారు అలంకరణ చేశారు.  

రత్న వేదికపై నిత్యం అసంపూర్ణ దారు విగ్రహాలుగా దర్శనం ఇచ్చే మూల విరాటులు రథ యాత్రలో రథాలపై బంగారు తొడుగులు, ఆభరణాలతో నిలువెత్తు రూపంతో దర్శనం ఇస్తారు. కుల, మత, వర్గ, వర్ణ వివక్షకు అతీతంగా ఆరు బయట పరిపూర్ణ జగన్నాథుని దర్శించుకునే అపురూప అవకాశం స్వామి రథ యాత్రలో మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ ఏడాది రాత్రి 11 గంటల వరకు రథాలపై మూల విరాటుల పరిపూర్ణ రూపాన్ని బంగారు అలంకరణలో దర్శించుకునే అవకాశం కలి్పంచారు. ఆదివారం సాయంత్రం సుమారు 5 గంటల నుంచి ఈ దర్శనం ప్రారంభం కావడం విశేషం. 


శ్రీమందిరంలో హరి శయన ఏకాదశి 
ఆషాడ శుక్ల ఏకాదశి సందర్భంగా రథాలపై దేవుళ్ళకు హరి శయన ఏకాదశి ప్రత్యేక పూజాదులు నిర్వహించారు. నేటి నుంచి కార్తీక మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజు వరకు భగవంతుడు 4 నెలలు శయనిస్తాడు. 

వల్లభ్ల బొడొ సింగారో అలంకరణ 
పవిత్ర హరి శయన ఏకాదశి పురస్కరించుకుని రథాలపై మూల విరాటులకు వరుసగా 2 సార్లు బొడొ సింగారొ అలంకరణ చేయడం ఆచారం. నిత్యం సాగే బొడొ సింగారొ అలంకరణ తర్వాత భోగ సేవ తర్వాత అధిక భోగ సేవ నిర్వహించి మరో మారు బొడొ సింగారొ అలంకరణ చేస్తారు.దీన్ని వల్లభ బొడొ సింగారొ అలంకరణగా పేర్కొంటారు.  

ఏటా 5 సార్లు బంగారు శోభతో దర్శనం 
ఏటా రథ యాత్ర పురస్కరించుకుని మారు యాత్ర (బహుడా)లో భాగంగా ఆషాఢ శుక్ల ఏకాదశి తిథి నాడు రథాలపై బహిరంగంగా అన్ని వర్గాల భక్తులకు స్వామి బంగారు దర్శనం ఒక రోజు లభిస్తుంది. ఏడాదిలో మరో 4 సార్లు శ్రీ మందిరం లోపల మూల విరాటులు బంగారు అలంకరణతో శోభిల్లుతారు. ఏటా కార్తీక పూరి్ణమ, పౌష్య పూర్ణిమ, డోల పూర్ణిమ, అశ్విని శుక్ల దశమి పుణ్య తిథుల్లో స్వామి బంగారు శోభతో భక్తులకు మిరిమిట్లు గొలిపిస్తాడు. పుష్యాభిõÙకం సందర్భంగా పుష్య మాసం పౌర్ణమి నాడు, దసరా ఉత్సవాల్లో విజయ దశమి నాడు స్వర్ణ శోభితుడుగా దర్శనం ఇస్తాడు. శ్రీ మందిరం రత్న వేదికపై ఆయా తిథుల్లో మధ్యాహ్న ధూపం తర్వాత మూల విరాటుల్ని బంగారు ఆభరణాలతో అలంకరించడం ఆచారంగా కొనసాగుతోంది. దసరా సమయంలో విజయ రామచంద్రునిగా, కార్తీక పౌర్ణమి సమయంలో ద్వారక నాథునిగా, డోల పౌర్ణమి సమయంలో గోపేశ్వరుడిగా, పుష్యాభిషేకం సమయంలో శ్రీరామునిగా పూజిస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement