మీరు చోద్యం చూస్తుంటారా?

Psychologists briefing about  bystander effect - Sakshi

బైస్టాండర్‌ ఎఫెక్ట్‌

ఒకప్పుడు నడిరోడ్డు మీద ఏదైనా అన్యాయం జరుగుతుంటే చోద్యం చూస్తున్నట్టుగా ఉండటం అనాగరికం. అమానవీయం. నేడు చోద్యం చూడటం సర్వసాధారణం. మొన్న ఢిల్లీలో ఒకమ్మాయిని ఒకబ్బాయి కత్తితో ΄పొడుస్తుంటే అందరూ చోద్యం చూస్తూ నిలబడ్డారు. అదే కాదు, నేడు చాలా సందర్భాల్లో నేరం ఆపగలిగే శక్తి ఉన్నా ఆపడం లేదు. దీనిని సైకాలజిస్ట్‌లు ‘బైస్టాండర్‌ ఎఫెక్ట్‌’ అంటున్నారు. మనం చోద్య శిఖామణులుగా ఉండల్సిందేనా?

మొన్నటి ఆదివారం. సాయంత్రం. 20 ఏళ్ల సాహిల్‌ 16 ఏళ్ల అమ్మాయితో వాదనకు దిగాడు. చాలామంది ఆ దారిన పోతున్నారు. పట్టించుకోలేదు. సాహిల్‌ కత్తి తీశాడు. దారిన పోతున్నవారు చూశారు. పట్టించుకోలేదు. సాహిల్‌ ఆ అమ్మాయిని అనేకసార్లు ΄పొడిచారు. చచ్చిపోయింది. ఎవరూ అడ్డం రాలేదు. సాహిల్‌ ఆ తర్వాత ఒక బండ రాయి తెచ్చి ఆమె మీద పదే పదే విసిరాడు. దారిన పోతున్నవాళ్లు చూస్తున్నారు. పోతున్నారు. పట్టించుకోలేదు.

వీరు మనుషులా అనే సందేహం రావచ్చు. మనుషులే. ఆ ఘటనను న్యూస్‌లో చూసి ఆ సమయంలో పట్టించుకోకుండా ఆ దారిన పోతున్నవారిని ‘మనుషులా?’ అని మనం అనుకోవచ్చు. కాని ‘మనం’ అక్కడ గనక ఉండుంటే మనం ‘కూడా’ అలానే బిహేవ్‌ చేస్తాం. అప్పుడు మనల్ని ఇంకెవరో ‘వీళ్లు మనుషులా’ అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి తీవ్రమైన ఘటనలో కూడా మనుషులు ఎందుకు అలా ఉన్నారు అనంటే దానిని మానసిక శాస్త్రంలో ‘బైస్టాండర్‌ ఎఫెక్ట్‌’ అంటారు. సింపుల్‌గా చె΄్పాలంటే ‘దారిన పోయే దానయ్య స్వభావం’ అనొచ్చు.

బైస్టాండర్‌ ఎఫెక్ట్‌ అంటే?
‘నేను కాకుండా ఇంకెవరో సాయం చేస్తారులే’ అనుకోవడమే బైస్టాండర్‌ ఎఫెక్ట్‌ అంటే. దీనినే ‘డిఫ్యూజన్‌ ఆఫ్‌ రెస్పాన్సిబిలిటీ థియరీ’ అని కూడా అంటారు. ఎక్కువమంది ఉన్న చోట ఈ ‘నాకెందుకులే... ఇంకెవరైనా చేస్తారులే’ అనే స్వభావం ఎక్కువ అవుతుందని మానసిక శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ‘ఒక అర్ధరాత్రి ఒక అమ్మాయిని ఒకతను ఇబ్బంది పెడుతుంటే, ఆ దారిన కేవలం ఇద్దరు వ్యక్తులు వస్తుంటే, వారిని చూసి సాయం కోసం కేకలు వేస్తే, ఆ ఇద్దరూ లేదా వారిలో ఒకరు స్పందించే అవకాశం ఎక్కువ.

అదే వంద మంది మధ్యలో సాయం కోసం అరిస్తే ఎవరూ సాయానికి రాకపోయే అవకాశం ఎక్కువ. ఇదే బైస్టాండర్‌ ఎఫెక్ట్‌ అంటే’ అని మానసిక శాస్త్రజ్ఞులు తెలియచేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎవరి మీదైనా ట్రోల్‌ జరుగుతుంటే చోద్యం చూడటం, పక్కింట్లో భార్యను భర్త చితకబాదుతుంటే చోద్యం చూడటం కూడా  ‘బైస్టాండర్‌ ఎఫెక్ట్‌’ కిందకే వస్తుంది.

ఎందుకు సాయానికి రారు?
ఒకటి... అందులో రిస్క్‌ ఉంటుంది... రెండు టైమ్‌ వేస్ట్‌.. మూడుప్రాణాలకు ముప్పు రావచ్చు... నాలుగు ఆ తర్వాత ఏదైనా లంపటం చుట్టుకోవచ్చు... అన్నింటి కంటే ముఖ్యం ఇంతమంది ఉన్నారు నేనే దొరికానా అనుకోవడం. ఇదే సమయంలో సామాజిక శాస్త్రవేత్తలు ఏమంటా రంటే ‘ఆ ఎదురుగా దాడికో హత్యకో గురవుతున్నది మీ రక్తసంబంధీకులు అయితే ఇలాగే వ్యవహరిస్తారా?’ అని. ఎదుట ఉన్నది రక్తసంబంధీకులు అయినప్పుడుప్రాణాలకు తెగిస్తాం. కాని సంబంధం లేనివారైతే దూరం జరుగుతాం. బాధితుడు ఎవరైనా బాధితుడే కదా అని  సామాజిక శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తారు.

ప్రతి ఒక్కరూ ఎంతో కొంత చేయొచ్చు
‘సరే... సాయానికి వెళితే లేనిపోని ముప్పు రావచ్చు అనుకున్నా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాయం చేసే వీలు ఉంటుంది.. అదన్నా చేయాలి’ అంటారు మానసికవేత్తలు. కనీసం పోలీసులకు, అంబులెన్స్‌కు ఫోన్‌ చేయడం, దాడి చేస్తున్నవాడిని అదిలించడం, ధ్యాస మరల్చడం, రాళ్లు విసిరి గోల చేయడం... ఇలా ఏవైనా చేయొచ్చు.

వీటిని చేయడం వల్లప్రాణం పోదు. ఏదో ఒక స్పందన చూపాం అనే సంతృప్తి దొరుకుతుంది. ‘భయాన్ని దాటితే మనిషిగా పాటించాల్సిన విలువలను గుర్తు చేసుకుంటే సాయానికి దిగాలన్న తక్షణ స్పందన కలుగుతుంది’ అని సామాజిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

‘ఏం చేసినా జనం పట్టించుకోరు’ నుంచి ‘జనం పట్టించుకుంటారు’ అనిపించే సామాజిక మార్పుకు జనమే ఉదాహరణగా నిలిస్తే ఈ స్థితి మారుతుంది.  స్త్రీలు, యువతులు, బాలికలు నిత్యం బయటకు తిరగాల్సిన ఈ రోజుల్లో సమాజం వీలైనంత తొందరగా ఈ చోద్యం చూసే స్వభావాన్ని వదులుకుంటే సమాజానికి రక్షణ దొరుకుతుంది.

ఒకరినే ఎంచుకోవాలి
‘మీ మీద దాడి జరుగుతోంది. చుట్టూ చాలామంది చోద్యం చూస్తున్నారు. మీరు సాయం కోసం అడుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. అప్పుడు గుంపులో ఎవరో ఒకరిని ఎంచుకోవాలి. వారి కళ్లల్లో కళ్లు కలిపి సాయం అడగాలి. మీరు పర్టిక్యులర్‌గా ఒక వ్యక్తిని సాయం అడిగినప్పుడు ఆ వ్యక్తికి తాను స్పందించక తప్పని బాధ్యత వస్తుంది. స్పందిస్తాడు’ అని తెలియచేస్తున్నారు మానసిక శాస్త్రవేత్తలు. అంటే గుంపు నుంచి విడగొట్టి అతణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేయాలన్న మాట. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top