
ఓ తల్లి కొడుకు ఆచూకి కానరాక తల్లడిల్లింది. అది కూడా చెట్టంత కొడుకు ఆసరాగా ఉండాల్సిన వయసులో.. అతడి ఆచూకీకై నిరీక్షించడం అంటే ఆ తల్లికి అదొక శాపం. పాపం ఆ తల్లి బాధను చూడలేక ఆ దేవుడే ఇలా ఇన్‌స్పెక్టర్ రూపంలో వచ్చి కొడుకును ఆమె వద్దకు చేర్చాడేమో అన్నట్లుగా కలుసుకుంది. ఈ ఘటన ఢిల్లీలోని అమ్రోహాలో చోటు చేసుకుంది.
అమ్రెహాకు చెందిన ఇన్‌స్పెక్టర్ అశ్వని మాలిక్ కేవలం పోలీప్ ఆఫీసర్ మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. ఆయన తప్పిపోయిన వ్యక్తులను వారి కుటుంబాలతో తిరిగి కలపడానికి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విషయంలో ఫేమస్. ఒకరోజు మాలిక్ ఎప్పటిలానే తన డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా..రోడ్డు పక్కన ఒంటరిగా కూర్చున్నవ్యక్తిని గమనించాడు.
ఆ వ్యక్తి దిక్కుతోచని స్థితిలో అపరిశుభ్రంగా ఎలాంటి భావోద్వేగం లేనట్లుగా కనిపించాడు. దాంతో ఆయన తన సహచర పోలీసులు మొహ్మద్ సల్మాన్, కాషిఫ్‌ల సాయంతో అతన్ని లోపలకి తీసుకెళ్లి స్నానం చేయించి, బట్టలు శుభ్రం చేసి, ఆహారం ఇచ్చి..అతడి వివరాలను కనుక్కొన్నారు. తర్వాత ఆ వ్యక్తిని మొహమ్మద్ సలీంగా గుర్తించారు. తప్పిపోయిన వ్యక్తులను వారి కుటుంబాలతో కలిపే తన సోషల్ మీడియా సేవలో భాగంగా ఈ వ్యక్తికి సంబంధించిన వీడియోని కూడా నెట్టింట షేర్ చేశాడు.
ఆ వీడియో ముంబైలోని సలీం మేనల్లుడు మొహమ్మద్ గుఫ్రాన్ అనే వ్యక్తి దృష్టిని ఆకర్షించింది. అతను సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుండగా ఈ వీడియో కంటపడింది. వెంటనే తన 77 ఏళ్ల అమ్మమ్మ రసుమా బానోకు చూపించాడు. ఆమె వెంటనే ఆ వ్యక్తిని చాలా కాలం క్రితం తప్పిపోయిన తన కొడుకుగా గుర్తించింది. నిజానికి మొహమ్మద్ సలీం ఒకప్పుడూ ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా హరైయా గ్రామంలో నివశించేవాడు.
అతను తన భార్య మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అలా ఆ బాధలో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. సుమారు 12 ఏళ్లుగా మళ్లీ తిరిగి రాలేదు. సంవత్సరాల తరబడి ఆ తల్లి కొడుకు చనిపోయాడా లేదా బతికే ఉన్నాడో తెలియక తల్లడిల్లింది. పాపం సలీం తండ్రి కూడా అతడు ఇల్లు వదిలి వెళ్లినప్పుడే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అయితే అతడి తల్లి కొడుకు ఆచూకి కనుగొంటానని గానీ, చూస్తానని గానీ అస్సలు భావించలేదు.
నిజానికి అస్సలు ఆమె ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కూడా అనుకోలేదట. ఇన్నాళ్లు బతకాలి కాబట్టి బతుకుతున్నా అన్నట్లుగా ఆ తల్లి రోజులు నెట్టుకుంటూ వచ్చింది. ఎప్పుడైతో తన కొడుకుని ఆ వీడియోలో గుర్తించి కలుసుకుందో తన ఇన్నాళ్ల బాధకు ఒక్కసారిగా తెరపడినట్లయ్యిందని ఆవేదనగా అంటోంది ఆ తల్లి రసుమా బానో. అతడి మేనల్లుడు గుఫ్రాన్ కూడా తన అమ్మమ్మ ఇలాంటి రోజుని చూస్తుందని అస్సలు అనుకోలేదంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
(చదవండి: వాట్ పబ్లిక్ టాయిలెట్ టూరిస్ట్ స్పాటా..?! రీజన్ ఇదే..)