
నిమ్మకాయ తొక్కించబోయి.. ఓ మహిళా కొత్త కారును ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నర్మన్ విహార్‌లోని మహీంద్రా షోరూమ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రూ.27 లక్షల విలువైన థార్ వాహనమూ(Thar Rox SUV) నాశనమైంది. అది మీడియా.. అంతకు మించి సోషల్ మీడియా దృష్టిని ఈ ఘటన ఆకర్షించింది. దీంతో ఆ కారును పడేసిన మాని పవార్ స్పందించింది.
ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్(29) తన భర్త ప్రదీప్‌తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్‌కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి షోరూమ్ ఫస్ట ఫ్లోర్ నుంచి కిందకు తీసుకురావాలని ప్రయత్నించింది. ఈలోపు..
పొరపాటును ఎక్సలేటర్‌ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్‌ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత వీడియో వైరల్ అయ్యింది, అందులో కారు తలకిందుగా రోడ్డుపై పడిపోయిన దృశ్యం కనిపించింది. అయితే..
సోషల్ మీడియాలో మాత్రం మరోలా ప్రచారం జరిగింది. ఈ ఘటనలో మాని పవార్ సహా భర్త, షోరూమ్ సిబ్బంది గాయపడ్డారని కొందరు, ఆమె ముఖం, ముక్కు పగిలిపోయానని మరికొందరు.. లేదు ఆమె చనిపోయిందంటూ ఇంకొందరు కథనాలు, పోస్టులు ఇచ్చారు. దీంతో మాని పవార్ స్పందించారు. నేను బతికే ఉన్నాను. దయచేసి ఫేక్ వీడియోలు పంచుకోవడం ఆపండి అంటూ వీడియో సందేశం ఉంచారామె.
ఘటన సమయంలో కారులో నాతో పాటు షోరూమ్ సేల్స్‌మన్ వికాస్ కూడా ఉన్నారు. ఈ ఘటన నిమ్మకాయల్ని తొక్కించే పూజ సమయంలో పొరపాటుగా ఎక్స్‌లేటర్ తొక్కడం వల్లే జరిగింది. షోరూమ్ గ్లాస్ బద్దలు కొట్టుకుని మరీ కిందపడిపోయింది. అదృష్టవశాత్తూ ఎయిర్‌బాగ్స్ తెరుచుకోవడం వల్ల మాకేం కాలేదు. సిబ్బంది సాయంతో పగిలిన ముందు భాగం నుంచి బయటకు వచ్చాం. ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఇంటికి వచ్చేశాం. మేం క్షేమంగానే ఉన్నాం. పుకార్లను, వెటకారాలను దయచేసి ఆపండి అని అన్నారామె.