గాంధీ బాటలో గానుగలు! 

Production Of Natural Essential Oils In Sagubadi - Sakshi

గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మా గాంధీ కలలు గన్నారు. అందుకు స్పష్టమైన కార్యాచరణకు ప్రజలను కదిలించారు కూడా. గ్రామ స్వరాజ్యం రావాలంటే ఆహార స్వరాజ్యం అతి ముఖ్యమని తేల్చి చెప్పారు. ఆహార స్వరాజ్య సాధనకు, పౌష్టికాహార లోపాన్ని పారదోలటంలో ఎద్దులతో నడిచే కట్టె గానుగలు గ్రామగ్రామాన నెలకొల్పుకోవటం కీలకమని గాంధీజీ నొక్కి చెప్పారు.  సహజ రూపంలో స్వచ్ఛమైన నూనెను అందించే సాంప్రదాయ సాంకేతికత ఇది. నూనె గింజలను పండించే రైతులు కట్టె గానుగలను ఏర్పాటు చేసుకొని నాణ్యమైన వంట నూనెలను ప్రజలకు అందించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

రసాయనిక అవశేషాల్లేని సహజ ఆహారానికి ప్రాధాన్యం పెరుగుతున్న ఈ రోజుల్లో గాంధీజీ 150వ జయంత్యుత్సవాల స్ఫూర్తితో కట్టె గానుగ నూనెల ఉత్పత్తి, వాడకంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను అందరూ గుర్తించాలి. అతి నెమ్మదిగా తిరిగే కట్టె గానుగల ద్వారా వెలికి తీసే నూనె(అందుకే దీన్ని ‘కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్‌’ అంటారు) అత్యంత పోషక విలువలతో కూడి ఉంటుందని, దీని వాడకం ఎంతో ఆరోగ్యదాయకమని నిపుణులు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ హయాంలోని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ కూడా పల్లెలు, పట్టణాల్లో మోటారుతో నడిచే కట్టె గానుగ నూనె ఉత్పత్తి కేంద్రాల వ్యాప్తికి సాంకేతిక పరంగా, ఆర్థికపరంగా తోడ్పడుతుండటం విశేషం. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం కింద మోటారుతో నడిచే కట్టె గానుగల ఏర్పాటుకు కె.వి.ఐ.సి. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలకు శిక్షణ, సాంకేతిక సహాయంతోపాటు సబ్సిడీని కూడా అందిస్తోంది.

ప్రజలకు స్వచ్ఛమైన నూనెలు అందిస్తున్నా!
గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్య సాధన క్రమంలో ముఖ్య భూమిక పోషించే కొన్ని అంశాల్లో ఎద్దు గానుగ ఒకటి. ఎద్దులతో తిరిగే కట్టె గానుగలు తిరగడానికి విద్యుత్తు అవసరం లేదు. ఎంత మారుమూల గ్రామంలో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎద్దు గానుగలు గ్రామంలో ఉంటే.. అక్కడ పండించిన నూనె గింజలతో ఎక్కడి వారు అక్కడే ఆరోగ్యదాయకమైన వంట నూనెలను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన నూనె అందించవచ్చు. ఎద్దు గానుగ ద్వారా గ్రామంలోనే ఇద్దరు మనుషులకు, రెండు దేశీ జాతి ఎద్దులకు పని కల్పించవచ్చు. ఎద్దులను కబేళాలకు తోలకుండా ఆపొచ్చు.

స్వాతంత్య్రానికి పూర్వం మన గ్రామాల్లో గానుగలు విరివిగా ఉండేవి. క్రమేణా యాంత్రీకరణ, కేంద్రీకృత వ్యవస్థ అమల్లోకి రావడంతో గానుగలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు బజారులో రంగు, రుచి, వాసన, పోషకాలు పుష్కలంగా ఉండే మంచి నూనెలు దొరకడం గగనం అయ్యింది. డా. ఖాదర్‌ సూచన ప్రకారం మంచి నూనెలను ప్రజలకు అందించాలన్న సంకల్పంతో నేను ఉపాధ్యాయ వృత్తికి స్వస్తి పలికి రైతుగా మారాను. రెండు ఎద్దు గానుగలను ప్రారంభించాను. సిరిధాన్యాలు, పప్పుధాన్యాలతోపాటు నూనెగింజలను సాగు చేయనారంభించాను. వీటిని శుద్ధి చేసి స్వచ్ఛమైన గానుగ నూనెలను నేరుగా ప్రజలకు అందిస్తున్నాను. – బసవరాజు (93466 94156), మహబూబ్‌నగర్‌

కట్టె గానుగల  నిర్వహణపై కెవిఐసి శిక్షణ
ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్, కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి చేయూతనిస్తుంది. స్వదేశీ పరిజ్ఞానంతో గ్రామీణ/పట్టణ ప్రాంతాల్లో గానుగ నూనె పరిశ్రమను స్థాపించవచ్చు. గానుగ నూనెకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. గానుగ ద్వారా తీసిన నూనె, దాని సహజ పోషకాలు, అసలు రుచి, రంగు, విటమిన్లు కలిగి ఉంటుంది. ఎక్స్‌పెల్లర్‌ నుంచి తయారు చేసిన వంట నూనెతో పోల్చినప్పుడు గానుగ నూనె ఇంకా మంచి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది స్వచ్ఛమైన, సహజ రూపంలో నూనెను అందించే సాంప్రదాయ సాంకేతికతను సంరక్షిస్తుంది.  మోటారుతో నడిచే కట్టె గానుగ (పవర్‌ ఘని) ద్వారా వంట నూనెలను వెలికితీసే పనిలో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ (కెవిఐసి) నామమాత్రపు ఖర్చుపై శిక్షణ ఇస్తుంది.

మహారాష్ట్ర నాసిక్‌ నగరంలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో ఈ శిక్షణ ఇస్తాం. శిక్షణ వ్యవధి 15 రోజులు. హాస్టల్‌ వసతి ఉంది. ప్రయాణ ఖర్చులను శిక్షణ పొందే వారే భరించాలి.  ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం(పిఎంఇజిపి) కింద మోటారుతో నడిచే కట్టె గానుగల (ఘనీ ఆయిల్‌ యూనిట్ల) ఏర్పాటుకు కె.వి.ఐ.సి. సాంకేతిక సహాయంతోపాటు సబ్సిడీ సహాయాన్ని కూడా అందిస్తోంది. మరిన్ని వివరాలకు తెలంగాణ వాసులైతే హైదరాబాద్‌ నాంపల్లిలో గాంధీ భవన్‌ ఆవరణలోని కె.వి.ఐ.సి. తెలంగాణ రాజ్య కార్యాలయ సిబ్బందిని సంప్రదించవచ్చు.
ఫోన్‌ నంబరు.. 040 29704463.
– వి. చందూల్, సంచాలకులు, కె.వి.ఐ.సి., హైదరాబాద్‌
– మాడుగుల హరి, సహాయ సంచాలకులు, కె.వి.ఐ.సి., హైదరాబాద్‌

ఆన్‌లైన్‌లోనే  ఫుడ్‌ సేఫ్టీ రిజిస్ట్రేషన్‌/లైసెన్స్‌
గానుగలు పూర్వం చాలా ఉండేవి. ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయి. గానుగ నూనెలు మంచివే. నూనె గానుగలకు ప్రత్యేక రూల్సేమీ లేవు. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాథికార సంస్థ నిబంధనల ప్రకారం రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా ధరఖాస్తు చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. చిన్న స్థాయిలో ఎద్దు గానుగ / మోటారుతో నడిచే కట్టె గానుగ పెట్టుకొని ఏడాదికి రూ. 12 లక్షల కన్నా తక్కువ అమ్మకాలు సాగించే వారైతే ఏడాదికి రూ. 100 చెల్లించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే చాలు. రూ. 500 చెల్లించి ఐదేళ్లకు ఒకేసారి రిజిస్ట్రేషన్‌ పొందవచ్చు. రోజుకు ఒక మెట్రిక్‌ టన్ను వరకు గానుగ నూనెను ఉత్పత్తి చేసే వారైతే ఏడాదికి రూ. 3 వేలు చెల్లించి లైసెన్స్‌ పొందాల్సి ఉంటుంది. ఐదేళ్లకు ఒకేసారి లైసెన్స్‌ పొందవచ్చు. ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసిన తర్వాత వెరిఫికేషన్‌ అనంతరం 60 రోజుల్లో లైసెన్స్‌ మంజూరు చేస్తారు. ఏజెంట్ల అవసరం లేదు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరమే ఉండదు. 
– డా. కె. శంకర్, తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా 
సంచాలకులు, హైదరాబాద్‌
www.fssai.gov.in

తేమ  తక్కువగా ఉంటే నిల్వ సామర్థ్యం ఎక్కువ 
ఎద్దు గానుగ నూనెలు పూర్వం నుంచి వాడుతున్నాం. ఈ నూనెలను వంటలకే కాకుండా వైద్యానికి కూడా వాడేవారు. గింజలు బాగా ఎండబెట్టి తేమ ఎక్కువగా లేని నూనె తీసుకుంటే, ఆ నూనెలు ఐదారు నెలలు నిల్వ ఉంచుకోవచ్చు. నూనె గింజల నుంచి 32–40 శాతం నూనె వస్తుంది. కట్టె గానుగ నూనెలు తీసిన తర్వాత మిగిలే పిప్పిని కోళ్లకు, పశువులకు, రొయ్యలు/చేపలకు దాణాగా వాడుతున్నారు. నువ్వుల నూనె తీసిన తర్వాత మిగిలే తెలగపిండి ఆడవాళ్లలో ఎముకల పుష్టి కోసం, కాల్షియం లోపాన్ని, మోకాళ్ల నొప్పులను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. తెలగపిండిని బాలింతలకు కూరగా వండి పెడితే బిడ్డకు పాల కొరత ఉండదు. తీసిన నూనెలో తేమ ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
– శివశంకర్‌ షిండే (98660 73174), కట్టె గానుగ నిర్వహణపై శిక్షకుడు, న్యూలైఫ్‌ ఫౌండేషన్, దమ్మాయిగూడ, సికింద్రాబాద్‌ 

కలుపు తీసే ‘పల్లె’ యంత్రాలపై వెబినార్‌ రేపు
పంట పొలాల్లో కలుపు నిర్మూలనకు ఉపయోగపడే అనేక పరికరాలు, యంత్రాలను ఆవిష్కరించిన గ్రామీణ ఆవిష్కర్తలు అనేక మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఈ ఆవిష్కరణల వివరాలు ‘సాక్షి సాగుబడి’ పాఠకులకు తెలిసినవే. అయితే, ఆ ఆవిష్కర్తలతో నేరుగా ముచ్చటించి సందేహాలను నివృత్తి చేసుకునే సదవకాశం కల్పిస్తున్నాయి పల్లెసృజన, క్రియేటివ్‌ మైండ్స్‌ సంస్థలు. ఈ నెల 14 (బుధవారం)న ఉదయం 10.30 గంటలకు గూగుల్‌ మీట్‌లో ఉచిత వెబినార్‌ జరుగుతుంది. https://meet.google.com/min-tvyx-bpm ఈ లింక్‌ ద్వారా వెబినార్‌లో పాల్గొనవచ్చు. గ్రామాల్లో మరుగునపడి ఉండిన ఆవిష్కర్తలను గుర్తించి వెలుగులోకి తేవడానికి, వారికి ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా సముచిత రీతిన పురస్కారాలు వచ్చేలా కృషి చేయటంలో బ్రిగేడియర్‌ పోగుల గణేశం, దుర్గాప్రసాద్‌ తదితరుల ఆధ్వర్యంలోని పల్లెసృజన, క్రియేటివ్‌ మైండ్స్‌ సంస్థలు సుదీర్ఘకాలంగా విస్తృత సేవలు అందిస్తుండటం ప్రశంసనీయం.
వివరాలకు: పల్లెసృజన సుభాష్‌ 9652801700

18న చిన్నవెలగటూరులో ప్రకృతి వ్యవసాయ శిక్షణ
చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం చిన్న వెలగటూరు గ్రామంలోని తేజోవంతరెడ్డికి చెందిన శ్రీ సాయి ఫామ్‌హౌస్‌లో ఈ నెల 18 (ఆదివారం)న ప్రకృతి వ్యవసాయంపై అనంతపురానికి చెందిన సీనియర్‌ రైతు నాగరాజు శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 100. వివరాలకు.. 79956 15060, 98668 81878  

18న నెమటోడ్స్, వరిలో కలుపు నివారణపై శిక్షణ
రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో ఈ నెల 18న సహజ పద్ధతిలో ఆకు రసాలతో ఉద్యాన పంటల్లో నులిపురుగులు (నెమటోడ్స్‌) నివారణ, ఆకు రసాలతో వరిలో కలుపు నివారణపై శిక్షణ ఇవ్వనున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త, ఆవిష్కర్త గళ్లా చంద్రశేఖర్‌ రైతులకు శిక్షణ ఇస్తారని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ డా. యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. 40 మందికి మాత్రమే ప్రవేశం. రిజిస్ట్రేషన్‌ వివరాలకు 97053 83666, 0863–2286255.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top