పిల్లలూ! ప్రతిరోజు మనం పాఠశాలకు వెళ్లి ఏం చేస్తాం? పాఠాలు వింటాం.. స్నేహితులతో ఆడుకుంటాం కదా.. కానీ పూజ అనే మనలాంటి ఒక విద్యార్థిని మాత్రం తను ప్రతిరోజూ పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం కనిపెట్టాలనుకుంది. ఆలోచన వచ్చిందే ఆలస్యం ఒక యంత్రాన్ని ఆవిష్కరించేసింది. అది ఆ పాఠశాల విద్యార్థుల సమస్యని పరిష్కరించడమే కాదు.. మనకు అన్నం పెట్టే అన్నదాతల ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తోంది. మరి మంచి పనులు చేస్తే ఏం జరుగుతుందో తెలుసుగా .. పూజా పేరు దేశమంతటా ప్రశంసలతో మార్మోగింది.. ఎన్నో బహుమతులనూ సొంతం చేసుకుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా...
పేద కుటుంబానికి చెందిన పూజ ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ బడిలో చదువుకునేది. పంట కోతల సమయంలో పొలాల్లోని యంత్రాల (థ్రెషర్లు) నుంచి వచ్చే దుమ్ము, ధూళి గాలిలో కలిసి ఆమె తరగతి గదిలోకి వచ్చేవి. దానివల్ల పిల్లలకు సరిగ్గా ఊపిరి ఆడక΄పోయేది, పుస్తకాలు కూడా కనబడకపోయేవి. మరోవైపు ఈ కాలుష్యం వల్ల ఎంతో మంది రైతులు అనారోగ్యం పాలవ్వడం పూజను బాధించింది. ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచించింది.
డస్ట్ ఎక్స్‌ట్రాక్టర్
ఒకరోజు ఇంట్లో తన తల్లి పిండిని జల్లెడ పట్టడం పూజ చూసింది. సన్నని పిండి కిందకు పడితే, గరుకుగా ఉండేవి జల్లెడలో ఉండిపోయాయి. అదే సూత్రం పూజను పరిష్కారం దిశగా ఆలోచించేలా చేసింది. పంటలోని దుమ్మును వేరు చేస్తే బాగుంటుందని ఆలోచించింది. వెంటనే తన సైన్స్ మాస్టారు సహాయంతో పాత రేకులు, వెల్డింగ్ మిషన్ ఉపయోగించి ఒక ప్రత్యేక యంత్రాన్ని తయారు చేసింది.
దీనికి ఆమె డస్ట్ ఎక్స్‌ట్రాక్టర్ అని పేరు పెట్టింది. ఈ యంత్రం పొలాల్లో పని చేస్తున్నప్పుడు, పంట నూర్పిడి సమయంలో వెలువడే దుమ్మును పీల్చుకుని, ఒక చోట సేకరిస్తుంది. దీనివల్ల రైతులు పీల్చే గాలి శుభ్రంగా ఉంటుంది, తద్వారా ఆస్తమా, టీబీ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అలాగే ఈ యంత్రాన్ని ఎవరైనా సులభంగా కొనుగోలు చేసేలా, అందుబాటులో ఉండే వస్తువులతోనే పూజ దీనిని రూపొందించింది.
దేశం గర్వించే గుర్తింపు!
పూజ సాధించిన ఈ విజయానికి గానూ, ఎన్నో ప్రశంసలతోపాటు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకుంది. సైన్స్ అండ్ ఇన్నోవేషన్‌లో తను చూపించిన ప్రతిభకు గాను జపాన్‌కి వెళ్లే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. అక్కడ ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలతో కలిసి పూజ తన యంత్రం గురించి వివరించింది. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమెను ‘బాల శాస్త్రవేత్త’గా గుర్తించి లక్ష రూపాయల నగదు బహుమతిని అందించింది.
పర్యావరణంపై చైతన్యం
పూజ భవిష్యత్తులో ఒక గొప్ప శాస్త్రవేత్త కావాలని కలలు కంటోంది. పర్యావరణ పరిరక్షణపై తన గ్రామంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ చైతన్యం తీసుకువస్తోంది. పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల కలిగే నష్టాల గురించి రైతులకు వివరిస్తోంది. ఒక సాదాసీదా పల్లెటూరి అమ్మాయి తన తెలివితేటలతో దేశానికే ఆదర్శంగా నిలిచింది. మనందరం ఆమెను చూసి నేర్చుకుందాం కదూ!
మన చుట్టూ సమస్యలు ఉన్నప్పుడు భయపడకూడదు. వాటికి పరిష్కారం ఆలోచించాలి. మన దగ్గర డబ్బు లేక΄ోయినా, పట్టుదల ఉంటే ఆకాశమంత ఎత్తుకు ఎదగవచ్చు.
– పూజ


