ఇద్దరు సిస్టర్స్‌ కృషి: 'యాత్రి'కుల కోసం.. | The sisters behind Mumbai's local train app Yatri | Sakshi
Sakshi News home page

ఇద్దరు సిస్టర్స్‌ కృషి: 'యాత్రి'కుల కోసం..

May 15 2026 1:15 PM | Updated on May 15 2026 1:20 PM

The sisters behind Mumbai's local train app Yatri

వాన రాకడ, ప్రాణం పోకడ వరుసలో రైలు రాకడను కూడా చేర్చారు చమత్కారులు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తాము ప్రయాణిస్తున్న ట్రైన్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ముంబైకి చెందిన లఖీ సకరియ, రీవ సకరియ సిస్టర్స్‌ క్రియేట్‌ చేసిన ‘యాత్రి’ యాప్‌ మన దేశంలోని ప్రధాన నగరాలలో ప్రాచుర్యం పొందింది. ఈ యాత్రి యాప్‌ ఇప్పుడు ముంబై లోకల్‌ ట్రైన్‌ సిస్టమ్, సెంట్రల్, వెస్ట్రన్‌ రైల్వేల అధికారిక యాప్‌గా ఉంది.

ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీలో బీటెక్‌., ఎంబీఏ చేసింది లఖీ. బి2బి, బి2జీ రంగాలలో సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌లను డెవలప్‌  చేసింది. రీవ కొన్ని సంవత్సరాలు కన్సల్టింగ్‌ కంపెనీలో పనిచేసింది. యాప్‌ ప్రారంభానికి ముందు రైల్వే అధికారులతో మాట్లాడి ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది లఖీ. రాకపోకలను కచ్చితంగా ట్రాక్‌ చేయడానికి ప్రతి స్టేషన్‌ చుట్టూ వర్చువల్‌ జియో ఫెన్స్‌లను సృష్టించి, దానికి జీపీఎస్‌ పరికరంలోని మోషన్‌ సెన్సర్‌లను జోడించారు. లైవ్‌ లొకేషన్‌ అప్‌డేట్‌లలో జాప్యాన్ని తొలగించడానికి పదిహేను మంది సభ్యులతో నెలరోజుల పాటు ప్రతిరోజూ రైళ్లలో ప్రయాణిస్తూ మాన్యువల్‌ పరీక్షలు నిర్వహించారు. 

యాప్‌ పరీక్షలో భాగంగా సిగ్నల్‌ అడ్డంకులను, టాంపరింగ్‌ సమస్యను తగ్గించడానికి జీపీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పనితీరును పరీక్షించడానికి వివిధ రూట్‌ ప్యాచ్‌లలో సిగ్నల్‌ కనెక్టివిటీని విస్తృతంగా పరీక్షించారు. ‘యాత్రి’ ప్రధాన లక్ష్యం రియల్‌ టైమ్‌ లోకల్‌–ట్రైన్‌  ట్రాకింగ్‌. తమ సొంత జీపీఎస్‌ పరికరాల ద్వారా నేరుగా రైల్వే కంట్రోల్‌ బోర్డ్‌ల నుంచి సమాచారాన్ని తీసుకుంటుంది యాత్రి. క్రౌడ్‌ సోర్స్‌ చేయదు. ట్రైన్‌ లొకేషన్, ట్రైన్‌ ఆలస్యం కావడానికి సంబంధించిన సమాచారం, ఫ్లాట్‌ఫారమ్‌ మార్పు, నోటిఫికేషన్‌లు, అంతరాయాల అప్‌డేట్‌లు.. మొదలైన వాటిని ప్రయాణికులు ‘యాత్రి’ ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రత్యామ్నాయ మార్గాలు
ఒక ట్రైన్‌ దాని నిర్దేశిత వేగంలో మూడో వంతు వేగంతో వెళితే వెంటనే ఆలస్యం జరగదు. కానీ రద్దీ సమయాలలో దాని ప్రభావం మొత్తం లైన్‌పై పడుతుంది. వివిధ కారణాల వల్ల రైళ్ల రాకపోకలలో ఆలస్యం జరుగుతుందని, అందువల్ల వేలాది మంది ప్రయాణికులకు సమాచారం త్వరగా చేరాల్సిన అవసరం ఉంది’ అంటుంది లఖీ. ట్రైన్‌లు ఆలస్యంగా నడవడం అనే సమస్య కంటే ఆ ఆలస్య సమాచారం ప్రయాణికులకు చేరకపోవడమే అసలు సిసలు సమస్య. 

దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘యాత్రి’ రైల్వే కంట్రోల్‌ రూమ్‌ల నుండి నేరుగా డేటాను తీసుకుంటుంది. ‘మేము తప్పుడు సమాచారాన్ని అందించే యాప్‌గా ఉండాలనుకోవడం లేదు. ప్రయాణికులు యాత్రి యాప్‌ను ఓపెన్‌ చేసిన వెంటనే తాము ప్రయాణించే రైలుకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోగలగాలి. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే అదే మార్గంలో ప్రత్యామ్నాయాలను చూడగలగాలి’ అంటుంది రీవ.

అయిదు నగరాలలో...
రియల్‌–టైమ్‌ ట్రాకింగ్‌తో పాటు ముంబై మహానగరంలోని మెట్రో, మోనోరైల్, బస్సులు, ఫెర్రీలతో సహా ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన సమగ్ర షెడ్యూల్‌ ఆధారిత సమాచారాన్ని ‘యాత్రి’ అందిస్తోంది. ప్రయాణికులు తమ ప్రారంభ స్థానం, గమ్యస్థానాన్ని నమోదుగా చేయగానే యాత్రి సమస్యలు లేని సరిౖయెన మార్గాన్ని మ్యాప్‌ చేస్తుంది. మెట్రో టికెట్‌లను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా క్యూలో సమస్యలు లేకుండా చేస్తుంది. దాదాపు మూడు మిలియన్‌ల డౌన్‌లోడ్‌లతో ‘యాత్రి’ ఇప్పుడు ముంబైతో సహా. దిల్లీ, కొచ్చి, కాన్పూర్, పుణే నగరాల్లో అందుబాటులో ఉంది.

నిరంతరం
నగర జనాభాలో సగం మంది రైళ్లలో ప్రయాణిస్తారు. విద్యార్థుల నుంచి శ్రామికుల వరకు ఎన్నో వర్గాల ప్రయాణికులు ఉంటారు. అన్ని వర్గాల ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని యాప్‌కు సంబంధించిన యూఐని రూపొందించాం. తక్కువ డేటా కనెక్టివిటీ, వ్యక్తుల డిజిటల్‌ అక్షరాస్యతను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఎప్పటికప్పుడూ ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకుంటూ యూఐనీ నిరంతరం మెరుగుపరుస్తున్నాం.
– లఖీ సకరియ, రీవ సకరియ, యాత్రి–ఫౌండర్స్‌ 
 

Advertisement
 
Advertisement
Advertisement