చీమలు కూడా తిరగబడతాయి.. తస్మాత్‌ జాగ్రత్త

Physical strength should not become arrogant - Sakshi

శతక నీతి – సుమతి

ప్రతి జీవికీ తగినంత శారీరక బలం ఉంటుంది. తనను తాను రక్షించుకోవడానికీ, తన అవసరాలు తీర్చుకోవడానికీ అది చాలా అవసరం. కానీ అది గర్వంగా మారకూడదు. తనకంటే బలం తక్కువ ఉన్న వాటిపట్ల చులకన దృష్టి ఉండకూడదు. ఉంటే ? ‘బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేతచిక్కి చావదే సుమతీ!– అని బద్దెన క్లుప్తంగానే అయినా బలవర్ధకమైన సందేశాన్ని ఇచ్చాడు. నల్లచీమల్లో చలిచీమలని ఉంటాయి.

అవి ఎక్కువగా తేనెపట్టు పట్టినట్లు పట్టేస్తుంటాయి. అవి ఎక్కడున్నాయో అక్కడ ఒక రకమైన వాసన వస్తుంటుంది. అవి ఒంటిమీదకు చాలా త్వరగా ఎక్కేస్తాయి. సర్వసాధారణంగా కుట్టవు. లోకంలో చాలా బలహీనంగా పైకి కనపడే ప్రాణుల్లో అదొకటి. కానీ అది చాలా చిన్న ప్రాణే కదా అని దానికి పౌరుషం వచ్చేటట్లు ప్రవర్తించారనుకోండి... అవన్నీ కలిసి ఎంత బలమైన ప్రాణినయినా చంపేస్తాయి. పాముని చూసి భయపడని ప్రాణి ఏముంటుంది.

అలాంటి పాముని కూడా మామూలుగా ఈ చలి చీమలు ఏమీ చేయవు. కానీ వాటి ప్రాణానికి పామునుంచి ప్రమాదం ఎదురయినప్పడు అవన్నీ కలిసి మూకుమ్మడిగా ప్రాణాలకు తెగించి దాని పనిపడతాయి. అంత ప్రమాదకరమైన పాముకూడా కొన్ని వేల చీమల చేతిలో చిక్కి ఎక్కడికక్కడ అవి కుడుతున్నప్పుడు వాటి చేతిలో దయనీయంగా చచ్చిపోక తప్పని పరిస్థితి. గడ్డి పరక కూడా వృక్షజాతుల్లో అల్పమైనది. అవి ఎక్కువ మొత్తంలో కలిస్తే బలిష్ఠమైన ఏనుగును కూడా కట్టిపడేస్తాయి.

రావణాసురుడు గొప్ప తపస్సు చేసాడు. చతుర్మఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. నీకేం కావాలని అడిగారు. ‘నాకు గంధర్వల చేతిలో, దేవతల చేతిలో, నాగుల చేతిలో....’’ అంటూ పెద్ద జాబితా చదివి వీళ్ళెవరి చేతిలో నాకు మరణం ఉండకుండా వరం కావాలన్నాడు. ‘తృణ భూతాహితే ప్రాణినో మానుషోదయః’.. అనుకున్నాడు. మనుషులు గడ్డిపరకతో సమానం. వాళ్ల పేరెత్తి వాళ్ళ చేతిలో మరణించకూడదని వరం కూడా అడగనా... అనుకున్నాడు. మనిషిని అంత తక్కువగా జమకట్టాడు.. నరుల ఊసే ఎత్తనివాడు, వానరుల ఊసు అసలు ఎత్తలేదు. చివరకు ఏమయింది... పదహారణాల మానవుడు శ్రీరామచంద్రమూర్తి వానరులను కూడా వెంటపెట్టుకుని మరీ వచ్చాడు.  తరువాత ఏమయిందో తెలిసిందే కదా...

నిష్కారణంగా వదరి గర్వంతో మరొకరిని తక్కువ చేసి, చులకన చేసి ప్రవర్తించడంవల్ల వచ్చిన ఉపద్రవం అది. కాబట్టి నోటిని, మనసును అదుపులో పెట్టుకోవాలి. నువ్వెంత బలవంతుడవయినా, ఎంత విద్వాంసుడవయినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా... అదే  పనిగా నా అంతవాడిని నేను అని భావిస్తూ అందరినీ నిందిస్తూ, నిరసిస్తూ వాడెంత, వీడెంత అని తక్కువ చేసి చూడడం అలవాటు చేసుకుంటే పరిణామాలు ఇలానే ఉంటాయి. వినయ విధేయతలతో ఉండు, నీకంటే పైవారినే కాదు, కింద వారినీ, తక్కువ స్థాయిలో ఉన్నవారినీ, బాధితులను.. అల్పులనే దష్టితో చూడకుండా అందరిపట్ల దయాదాక్షిణ్యాలతో, గౌరవ మర్యాదలతో ప్రవర్తించడం చిన్నప్పటినుంచే అలవాటు కావాలి. పెద్దలు కూడా ఇటువంటి నీతి శతకాలను పిల్లల చేత చదివిస్తూ సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా మెలగడానికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. అప్పుడు బద్దెన వంటి పెద్దల తపనకు ప్రయోజనం లభించినట్లవుతుంది.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top