మాటిమాటికీ పీడకలలు ఎందుకొస్తాయి? ఎలా అధిగమించాలి?

Nightmare Disorder: Symptoms And Causes How To Overcome - Sakshi

పీడకలలు  రావడం ఏదో ఒక సమయంలో అందరి అనుభవంలోకి వచ్చే విషయమే. అయితే... తీవ్రమైన మానసిక ఒత్తిడి గురైనవారితో పాటు అత్యంత ఆవేదనభరితమైన పరిస్థితుల్లో బాధపడుతూ ఉండేవారికి తరచూ పీడకలలు వచ్చే అవకాశం ఉంది. ఇంకొందరిలో సుదీర్ఘ విమాన ప్రయాణం తర్వాతి జెట్‌లాగ్‌ తర్వాతా పీడకలలు రావచ్చు. నిజానికి జీవితంలోని ఏదో ఒక సమయంలో పీడకలలు రానివారంటూ ఉండరు.

అయితే... కొందరిలో రోజూ అలాంటి కలలే వస్తూ ఉండటం... వాటి ప్రభావం అన్ని విధాలా వారి రోజువారీ జీవితంపైనా, సామాజికంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా పడటం, దాంతో వారు ఇతరత్రా తమ పనులేవీ చేసుకోలేనంతగా ఒత్తిడికీ, ఆందోళనకూ, వేదనకూ గురికావచ్చు. అలా మాటిమాటికీ పీడకలలు వచ్చే కండిషన్‌ను ‘నైట్‌మేర్‌ డిజార్డర్‌’గా చెబుతారు. గతంలో ఈ మానసిక సమస్యను ‘డ్రీమ్‌ యాంగ్జైటీ డిజార్డర్‌’ అనే వారు. అయితే ఇప్పుడు ఈ సమస్యను ‘నైట్‌మేర్‌ డిజార్డర్‌’ లేదా ‘రిపీటెడ్‌ నైటమేర్స్‌’ అంటున్నారు. 

చాలా సందర్భాల్లో ‘నైట్‌మేర్‌ డిజార్డర్‌’ సమస్యకు మందుల అవసరం ఉండకపోవచ్చు. ఇలాంటి బాధితులకు సాంత్వన కలిగించడం, ధైర్య వచనాలు చెప్పడం, తనకు యాంగ్జైటీ, ఒత్తిడి కలిగించే అంశాల విషయంలో కౌన్సెలింగ్‌ ఇవ్వడం ద్వారా ఈ సమస్యను చాలావరకు పరిష్కరించవచ్చు. అయితే కొంతమందిలో ఈ తరహా కలలు రావడానికి ఏదో అంతర్గత కారణం ఉండి ఉంటుంది. అలాంటి అండర్‌ లైయింగ్‌ మెడికల్‌ సమస్యలకు తగిన మందులు ఇవ్వడం ద్వారా కూడా ఇలాంటి కలలు రాకుండా చూడవచ్చు.

మానసిక వైద్యనిపుణుల పర్యవేక్షణలో స్ట్రెస్‌ రెడ్యూసింగ్‌ టెక్నిక్‌లతో బాధితుల్లో ఒత్తిడి తగ్గించడం వల్ల కూడా ఇవి తగ్గిపోవచ్చు. ఇక చాలా భయంకరమైన యుద్ధం, కుటుంబంపై దాడి, ఏవైనా కారణాలతో  కుటుంబమంతా అల్లకల్లోలం కావడం వంటి అత్యంత తీవ్రమైన వేదన కలిగించే దుర్ఘటన తర్వాత కలిగే... ‘పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌’కు లోనైనవారిలో ‘ఇమేజరీ రిహార్సల్‌ థెరపీ’ అనే చికిత్సను అందిస్తారు. ఇందులో బాధితుల్లో వచ్చే పీడకల చివర్లో అంతా సుఖాతమైనట్లుగా అతడి మనసులో నాటుకుపోయేలా చేస్తారు. దాంతో పీడకలలు క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంది.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top